Killed 15 people
-
గోడ కూలి 15 మంది మృతి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని పుణేలో శుక్రవారం అర్థరాత్రి ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పుణేలోని కోండవా ప్రాంతంలో ప్రహరీ గోడ కూలి 15 మంది దుర్మరణం చెందారు. భవన నిర్మాణ పనులు చేపట్టేందుకు గాను అల్కాన్ ల్యాండ్‌మార్క్స్, కంచన్ రాయల్ ఎక్సోటికా ప్రాజెక్టు సంస్థలు భారీగా తవ్వకాలు చేపట్టాయి. ఈ పనుల్లో పాల్గొంటున్న బిహార్‌లోని కటిహార్ ప్రాంతానికి చెందిన కూలీలు దాదాపు 20 మంది అక్కడే గుడిసెలు వేసుకుని కుటుంబాలతోపాటు ఉంటున్నారు. ఆ పక్కనే దాదాపు 22 అడుగుల ఎత్తైన ప్రహరీ ఉంది. శుక్రవారం నాటి భారీ వర్షానికి ప్రహరీ బాగా నాని, అర్థరాత్రి సమయంలో కూలీల గుడిసెలపై కూలి పడింది. గోడతోపాటుఅవతలి వైపు పార్కు చేసిన పదుల సంఖ్యలో కార్లు కూడా వారిపై పడిపోయాయి. దీంతో వాటికింద నలిగి 15 మంది కూలీలు అక్కడికక్కడే చనిపోగా ముగ్గురు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. వారిలో ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఏడేళ్లలోపు నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. కాగా, అల్కాన్ ల్యాండ్‌మార్క్స్, కంచన్ రాయల్ ఎక్సోటికా ప్రాజెక్టు సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రహరీ వరకు తవ్వకాలు చేపట్టడం వల్లనే ఈ ఘటన జరిగిందని మున్సిపల్ కమిషనర్ సౌరభ్‌రావు తెలిపారు. అల్కాన్ ల్యాండ్‌మార్క్స్, కంచన్ రాయల్ ఎక్సోటికా ప్రాజెక్టు సంస్థలకు చెందిన 8మందిపై ఐపీసీ–304 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, బిహార్ ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున సాయం ప్రకటించాయి. ఈ విషయమై మంత్రి తానాజీ సావంత్ మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 లక్షలు, శివసేన పార్టీ తరఫున రూ.లక్ష కలిపి మొత్తం రూ.5 లక్షల ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు అందజేయనున్నట్లు మీడియాకు తెలిపారు. ఈ దుర్ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశిస్తూ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. వారంలోగా నివేదిక అందజేయాలని కోరారు. ఘటన ప్రాంతంలో భవన నిర్మాణ పనులను నిలిపివేయాలని పుణే మేయర్ ఆదేశించారు. -
మెక్సికోలో కాల్పులు
గ్వానజువాటో: మెక్సికోలో దుండగులు రెచ్చిపోయారు. గ్వానజువాటో రాష్ట్రంలోని లాప్లాయా నైట్‌క్లబ్‌పై శనివారం తెల్లవారుజామున కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థ పెమెక్స్ పైప్లైన్ల నుంచి ఇంధనాన్ని దొంగిలిస్తున్న ముఠాలు లక్ష్యంగా మెక్సికో సైన్యం వేట మొదలెట్టింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక ఆయుధాలతో నైట్‌క్లబ్‌పై కాల్పులు జరిపిన దుండగులు ఘటనాస్థలం నుంచి కారులో పరారయ్యారు. పెమెక్స్ పైప్లైన్ల నుంచి ఆయిల్ చోరీ కారణంగా మెక్సికో గత కొన్నేళ్లలో రూ.21,000 కోట్లు నష్టపోయింది. -
ఇరాన్లో కూలిన కార్గో విమానం
టెహ్రాన్: ఇరాన్లో మరో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. దశాబ్దాల క్రితం నాటి బోయింగ్ 707 కార్గో విమానం మాంసం లోడ్‌తో సోమవారం కిర్గిస్తాన్ నుంచి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు బయలుదేరింది. పాయం విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఈ విమానం అత్యవసరంగా ఉదయం 8.30కి ఫత్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో రన్‌వేపై అదుపు తప్పింది. దీంతో స్థానికంగా ఉన్న ఇళ్లలోకి దూసుకెళ్లడంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు, పొగ ఎగిసిపడ్డాయి. పాయంలో దిగాల్సిన విమానం పొరపాటున ఫత్లో దిగినట్లు ఓ ఏవియేషన్ అధికారి తెలిపినట్లు ఇరాన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. 2016 నుంచి ఈ బోయింగ్ విమానం కిర్గిస్తాన్ నుంచి ఇరాన్‌కు మాంసం రవాణా చేస్తుంది. ఇరాన్లో విమాన ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఏళ్లపాటు కొనసాగిన అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ కొత్త విమానాలను కొనుగోలు చేసుకోలేకపోయింది. -
వధూవరులు సహా 15 మంది దుర్మరణం
అలీపూర్దౌర్: పెళ్లి సంబరంతో కళకళలాడుతున్న వధూవరులు సహా 15 మంది రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని మదారిహాత్ జిల్లాలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుక తర్వాత బిర్పారా నుంచి పెళ్లి బృందంతో వస్తున్న వాహనం 31వ నంబరు జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. దీంతో పెళ్లికొడుకు, పెళ్లికూతురు, వాహనం డ్రైవర్, క్లీనర్ సహా 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురు సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ చనిపోయారు. మిగిలిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు లారీని, దాని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.