kings eleven punjab team
-
బెంగళూరు గెలిచిందోచ్
ఒకటి కాదు... రెండు కాదు... బెంగళూరు ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లాడింది. ఎట్టకేలకు ఏడో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. కోహ్లి పట్టుదల, డివిలియర్స్ మెరుపులు రాయల్ చాలెంజర్స్‌కు తొలి విజయాన్ని అందించాయి. ఈ మ్యాచ్‌లో బౌలర్లు కాస్త మెరుగనిపించారు. బ్యాటింగ్‌లో టాపార్డరే విజయందాకా లాక్కొచ్చింది. ఆఖర్లో స్టొయినిస్ ధనాధన్ ఒత్తిడిని జయించేలా చేసింది. బెంగళూరును గెలిపించింది. మొహాలి: హమ్మయ్య బెంగళూరు కూడా పాయింట్ల పట్టికలో గెలుపు కాలమ్‌ను భర్తీ చేసింది. ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లాడినా అందని విజయం ఏడో మ్యాచ్‌లో దక్కింది. శనివారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ జట్టు 8 వికెట్లతో పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (64 బంతుల్లో 99 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగాడు. చహల్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ కోహ్లి (53 బంతుల్లో 67; 8 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఏబీ డివిలియర్స్ (38 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో అదరగొట్టారు. సుడి‘గేల్’ ఆఖరిదాకా... టాస్ నెగ్గిన బెంగళూరు కెప్టెన్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ పరుగులు ప్రారంభించేందుకు దిగింది. ఉమేశ్ తొలి ఓవర్లో 2 పరుగులే ఇచ్చాడు. తర్వాత సైనీ ఓవర్లో బౌండరీతో గేల్ పరుగుల ప్రవాహానికి తెరలేపాడు. మూడో ఓవర్‌ను ఉమేశ్ వేయగా 4, 6తో 14 పరుగులు రాబట్టాడు. ఇక హైదరాబాదీ పేసర్ సిరాజ్ బౌలింగ్‌కు దిగితే బౌండరీలకు గేట్లెత్తినట్లుగా బాదేశాడు గేల్. ఈ ఆరో ఓవర్లో 4, 6, 4, 0, 6, 4తో ఏకంగా 24 పరుగుల్ని పిండుకున్నాడు. పవర్ ప్లేలో పంజాబ్ స్కోరు 60/0. ఇందులో గేల్ ఒక్కడివే 48 కావడం విశేషం. శుభారంభం దక్కిన కింగ్స్ ఇన్నింగ్స్‌కు చహల్ తన తొలి ఓవర్ (ఇన్నింగ్ 7వ)లో బ్రేక్ వేశాడు. మొదటి బంతికి సిక్సర్ కొట్టిన రాహుల్ ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. దీంతో 66 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత మయాంక్ అగర్వాల్ క్రీజులోకి వచ్చినా... ఎంతోసేపు నిలువలేకపోయాడు. గేల్ 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 28 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. తన రెండో ఓవర్లో చహల్... మయాంక్‌నూ ఔట్ చేశాడు. అచ్చు రాహుల్ లాగే సిక్స్ కొట్టి మరుసటి బంతికే మయాంక్ (15; 1 ఫోర్, 1 సిక్స్) ఔటయ్యాడు. ఈ దశలో గేల్ నెమ్మదించాడు. పరుగుల వేగం తగ్గింది. 12వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. ఆ తర్వాతి ఓవర్లోనే సర్ఫరాజ్ ఖాన్ (15; 1 ఫోర్, 1 సిక్స్)ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. స్వల్ప వ్యవధిలో స్యామ్ కరన్ (1) మొయిన్ అలీ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. అలా 113 పరుగుల వద్ద నాలుగో వికెట్ పడింది. అనంతరం గేల్‌కు మన్దీప్ సింగ్ జతయ్యాడు. మరో వికెట్ పడకుండా ఇద్దరు పరుగుల వేగం పెంచారు. చివరి ఓవర్లో ఆఖరి బంతికి ఫోర్ కొట్టడంతో గేల్ సరిగ్గా 99 స్కోరు చేసి సెంచరీకి పరుగు దూరంలో అజేయంగా ఆగిపోయాడు. ధాటిగా మొదలైంది... ఎలాగైనా గెలవాలన్నా కసో లేక మిడిలార్డర్‌పై అపనమ్మకమో గానీ... కోహ్లి, పార్థివ్ పటేల్ ద్వయం బెంగళూరు ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టింది. పార్థివ్ ఇన్నింగ్స్ తొలి బంతినే బౌండరీకి తరలించాడు. రెండో ఓవర్లో కోహ్లి రెండు, పార్థివ్ మరో ఫోర్ కొట్టారు. మూడో ఓవర్లో ఈ సారి కోహ్లి ఒక బౌండరీ బాదితే... పార్థివ్ రెండు బాదాడు. 3 ఓవర్లలో రాయల్ చాలెంజర్స్ స్కోరు 36/0. నాలుగో ఓవర్ వేసిన అశ్విన్... పార్థివ్ (9 బంతుల్లో 19; 4 ఫోర్లు)ను ఔట్ చేసి ఈ జోడీని విడగొట్టాడు. తర్వాత డివిలియర్స్ వచ్చిరాగానే 2 ఫోర్లు కొట్టడంతో పవర్ ప్లేలో బెంగళూరు వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. కోహ్లి, డివిలియర్స్ ఫిఫ్టీ–ఫిఫ్టీ కోహ్లి, డివిలియర్స్ ఇద్దరు క్రీజ్‌లో పాతుకుపోవడంతో పంజాబ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ముఖ్యంగా డివిలియర్స్ పాదరసంలా పరుగెత్తాడు. దీంతో సింగిల్స్ వచ్చే చోట బెంగళూరు రెండేసి పరుగుల్ని చకచకా సాధించింది. 10 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 88/1. ఇద్దరు సమన్వయంతో ఆడటంతో భారీషాట్లు కొట్టకుండానే బెంగళూరు అవసరమైన రన్‌రేట్‌ను సాధిస్తూ వచ్చింది. 11వ ఓవర్లో కోహ్లి 37 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటే 12వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. మెరుపుల్లేకపోయినా పరుగులు మాత్రం చేస్తుండటంతో పంజాబ్ బౌలర్లకు ఎటూ పాలుపోలేదు. ఈ ద్వయాన్ని పడగొట్టలేక, పరుగుల్ని నియంత్రించలేక విలవిల్లాడారు. ఇలా చూస్తుండగానే రాయల్ చాలెంజర్స్ 15 ఓవర్లలో 126/1 స్కోరు చేసింది. ఇక ఆఖరి 5 ఓవర్లలో ‘బెంగ’తీరే విజయానికి 48 పరుగులు కావాలి. 16వ ఓవర్ వేసిన షమీ... కోహ్లి వికెట్ తీశాడు. దీంతో 85 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ ఓవర్లో 4 పరుగులు, 17వ ఓవర్లో 6 పరుగులు రావడంతో చేయాల్సిన రన్‌రేట్ ఒక్కసారిగా పెరిగింది. 18 బంతుల్లో 38 పరుగులు చేయాల్సిన దశలో అండ్రూ టై వేసిన 18వ ఓవర్లో స్టొయినిస్ 2 ఫోర్లు, డివిలియర్స్ సిక్స్ బాదాడు. దీంతో 18 పరుగులు రాగా, డివిలియర్స్ 35 బంతుల్లో ఫిఫ్టీ చేసుకున్నాడు. షమీ 19 ఓవర్లో 14 పరుగులిచ్చాడు. దీంతో ఆఖరి ఓవర్లో 6 పరుగులు అవసరమైతే స్టొయినిస్ (16 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు) 4, 2తో మరో 4 బంతులు మిగిలుండగానే ముగించాడు. -
కోల్‌కతా ఫైనల్‌కి...
క్వాలిఫయర్ మ్యాచ్‌లో పంజాబ్‌పై ఘన విజయం రాణించిన ఉతప్ప, ఉమేశ్ సంచలనాల మీద నిలకడదే పైచేయి. ఐపీఎల్-7లో లీగ్ దశలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లే రేసులో నిలబడ్డాయి. ఒకే ఒక్క మ్యాచ్‌లో పెను విధ్వంసం ద్వారా నాకౌట్‌కు చేరిన ముంబై కథ ఎలిమినేటర్‌లోనే ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండ్ నైపుణ్యం ముందు ముంబై తేలిపోయింది. ఇక వరుస విజయాలతో సంచలనాలు సృష్టిస్తున్న కోల్‌కతా... క్వాలిఫయర్లోనూ ఏ మాత్రం తడబాటు లేకుండా పంజాబ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. పంజాబ్ ఓడినా లీగ్ దశలో నిలకడ పుణ్యమాని ఫైనల్‌కు చేరడానికి మరో అవకాశం ఉంది. ఇక క్వాలిఫయర్-2లో చెన్నైతో పంజాబ్ అమీతుమీ తేల్చుకోనుంది. కోల్‌కతా: లీగ్ ఆరంభంలో తొలి ఏడు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ చివర్లో మాత్రం అద్భుతాలు చేసింది. వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో నెగ్గి నాకౌట్‌కు చేరుకోవడంతో పాటు క్వాలిఫయర్లోనూ సంచలనం సృష్టించింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతూ వస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను కట్టడి చేసి ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. వర్షం అంతరాయం మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బెయిలీసేన ఏ దశలోనూ కోల్‌కతాకు పోటీ ఇవ్వలేకపోయింది. ఫలితంగా బుధవారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 28 పరుగుల తేడాతో పంజాబ్‌పై ఘన విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఉతప్ప (30 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), పాండే (20 బంతుల్లో 21; 3 ఫోర్లు), యూసుఫ్ పఠాన్ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) సూర్యకుమార్ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. కరణ్వీర్ 3 వికెట్లు, జాన్సన్, అక్షర్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేసింది. సాహా (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ వోహ్రా (19 బంతుల్లో 26; 3 సిక్సర్లు), బెయిలీ (17 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉమేశ్ 3, మోర్కెల్ 2 వికెట్లు తీశారు. ఉతప్ప జోరు... గంభీర్ (1) రెండో ఓవర్లోనే అవుట్ కావడంతో కోల్‌కతా ఆరంభంలో కాస్త తడబడింది. అయితే ఉతప్ప, మనీష్ పాండేలు వికెట్‌ను కాపాడుకుంటూనే వేగంగా ఆడారు. దీంతో పవర్‌ప్లేలో గౌతీసేన వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. మెరుగైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను ఆదుకున్న ఈ జోడిని అక్షర్ పటేల్ దెబ్బతీశాడు. 9వ ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలో ఇద్దర్ని అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 42 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులో ఉన్న షకీబ్ (16 బంతుల్లో 18; 2 ఫోర్లు), యూసుఫ పఠాన్ నెమ్మదిగా ఆడినా రన్‌రేట్ తగ్గకుండా చూశారు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. అడపాదడపా బౌండరీలతో స్కోరును పెంచారు. 15వ ఓవర్లో కరణ్వీర్.... వరుస బంతుల్లో షకీబ్, యూసుఫ్‌లను అవుట్ చేశాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 113/5 ఉన్న దశలో 25 నిమిషాల పాటు వర్షం అంతరాయం కలిగించింది. తర్వాత సూర్యకుమార్, టెన్ డస్కెట్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 21 బంతుల్లో 37 పరుగులు జోడించి వెంటవెంటనే అవుటైనా కోల్‌కతా మాత్రం పోరాడే స్కోరును సాధించింది. తడబడుతూ... ఓపెనర్లలో సెహ్వాగ్ (2) వెంటనే అవుటైనా.. వోహ్రా ఉన్నంతసేపు వేగంగా ఆడాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడినా ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. ఫలితంగా పవర్‌ప్లేలో పంజాబ్ స్కోరు 46/2. సాహా నిలకడను కనబర్చినా... ఉమేశ్ నాణ్యమైన బంతితో మాక్స్వెల్ (6)ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో పంజాబ్ 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. వ్యక్తిగత స్కోరు ఒక పరుగు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ మిల్లర్ (8).. సాహాతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ మూడు బంతుల తేడాతో ఈ ఇద్దరు అవుటయ్యారు. కొద్దిసేపటికే అక్షర్ పటేల్ (2) కూడా వెనుదిరిగడంతో పంజాబ్ 87 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకుంది. చివర్లో బెయిలీ, ధావన్ (14), జాన్సన్ (10 నాటౌట్) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా రన్‌రేట్ పెరిగిపోవడంతో ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) మిల్లర్ (బి) పటేల్ 42; గంభీర్ (సి) బెయిలీ (బి) జాన్సన్ 1; పాండే (బి) పటేల్ 21; షకీబ్ (సి) మిల్లర్ (బి) కరణ్వీర్ 18; యూసుఫ్ (సి) మిల్లర్ (బి) కరణ్వీర్ 20; టెన్ డస్కెట్ (సి) వోహ్రా (బి) జాన్సన్ 17; సూర్య కుమార్ (బి) కరణ్వీర్ 20; చావ్లా నాటౌట్ 17; నరైన్ రనౌట్ 0; మోర్కెల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1-2; 2-67; 3-67; 4-108; 5-108; 6-145; 7-147; 8-159. బౌలింగ్: అవానా 4-0-33-0; జాన్సన్ 4-0-31-2; అక్షర్ పటేల్ 4-1-11-2; రిషీ ధావన్ 4-0-44-0; కరణ్వీర్ 4-0-40-3. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) షకీబ్ (బి) ఉమేశ్ 2; వోహ్రా (సి) ఉమేశ్ (బి) మోర్కెల్ 26; సాహా (సి) ఉమేశ్ (బి) మోర్కెల్ 35; మాక్స్వెల్ ఎల్బీడబ్ల్యు (బి) ఉమేశ్ 6; మిల్లర్ (బి) చావ్లా 8; అక్షర్ పటేల్ రనౌట్ 2; బెయిలీ (సి) పాండే (బి) ఉమేశ్ 26; ధావన్ (స్టంప్డ్) ఉతప్ప (బి) షకీబ్ 14; జాన్సన్ నాటౌట్ 10; కరణ్వీర్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1-5; 2-45; 3-55; 4-80; 5-82; 6-87; 7-117; 8-134 బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 4-0-23-2; ఉమేశ్ 4-0-13-3; నరైన్ 4-0-30-0; షకీబ్ 4-0-43-1; చావ్లా 4-0-23-1. -
పంజాబ్ ఓటమి: ఫైనల్లో కోల్ కతా
కోల్ కతా: గంభీర్ సేన ఐపీఎల్ -7 ఫైనల్లోకి దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ను కంగు తినిపించి తుదిపోరుకు కోల్ కలా నైట్ రైడర్స్ సిద్దమయింది. బుధవారమిక్కడ జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో పంజాబ్ పై కోల్ కతా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా 8 విజయాలు సాధించి గంభీర్ సేన ఫైనల్ కు చేరడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప మరోసారి రాణించాడు. 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లుకోల్పోయి 135 పరుగులు మాత్రమే చేసింది. కోల్ కతా అన్ని విభాగాల్లో రాణించి పంజాబ్ ను కట్టడి చేసింది. మ్యాక్స్ వెల్(6), మిల్లర్(8) విఫలమవడంతో పంజాబ్ ఓటమి ఖాయమయింది. సాహా 35, వోహ్రా 26, బైయిలీ 26 పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ 3, మోర్కల్ 2 వికెట్లు పడగొట్టారు. షకీబ్, చావ్లా చెరో వికెట్ తీశారు. -
వరుణుడు కరుణించలేదు
క్వాలిఫయర్-1 నేటికి వాయిదా కోల్‌కతా: భారీ వర్షం కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మంగళవారం జరగాల్సిన ఐపీఎల్-7 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ వాయిదా పడింది. ‘రిజర్వ్ డే’ అయిన బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లోనే ఈ మ్యాచ్ జరగనుంది. గత కొన్ని రోజులుగా కోల్‌కతాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మంగళవారం కూడా కొనసాగాయి. దీంతో సాయంత్రం 5.15 గంటలకు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు నీజెల్ లాంగ్, ఎస్.రవి, క్యురేటర్ ప్రబీర్ ముఖర్జీలు ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాదని తేల్చారు. దీంతో ఈ ముగ్గురూ మ్యాచ్‌ను వాయిదా వేస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ‘సూపర్ ఓవర్’ బుధవారం కూడా పూర్తి మ్యాచ్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోతే ఐపీఎల్ నిబంధనల ప్రకారం కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. ఇది కూడా సాధ్యం కాకపోతే ‘సూపర్ ఓవర్’ను నిర్వహిస్తారు. దీనికి కూడా మైదానం అనుకూలంగా లేకపోతే లీగ్ దశలో ఎక్కువ విజయాలు సాధించిన పంజాబ్ (11) జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. కేవలం తొమ్మిది విజయాలు మాత్రమే సాధించిన కోల్‌కతా రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడుతుంది. రద్దయితేనే డబ్బులు వాపస్ కోల్‌కతా, పంజాబ్ మ్యాచ్ కోసం కొనుగోలు చేసిన టిక్కెట్లు బుధవారం కూడా చెల్లుబాటు అవుతాయని ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఒక బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దయితే టిక్కెట్ల డబ్బులు వాపస్ ఇస్తామని, ఇందుకోసం మరో ప్రకటన చేస్తామని వెల్లడించారు.