వరుణుడు కరుణించలేదు
క్వాలిఫయర్-1 నేటికి వాయిదా
కోల్‌కతా: భారీ వర్షం కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మంగళవారం జరగాల్సిన ఐపీఎల్-7 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ వాయిదా పడింది. ‘రిజర్వ్ డే’ అయిన బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లోనే ఈ మ్యాచ్ జరగనుంది. గత కొన్ని రోజులుగా కోల్‌కతాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మంగళవారం కూడా కొనసాగాయి. దీంతో సాయంత్రం 5.15 గంటలకు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు నీజెల్ లాంగ్, ఎస్.రవి, క్యురేటర్ ప్రబీర్ ముఖర్జీలు ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాదని తేల్చారు. దీంతో ఈ ముగ్గురూ మ్యాచ్‌ను వాయిదా వేస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.
‘సూపర్ ఓవర్’
బుధవారం కూడా పూర్తి మ్యాచ్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోతే ఐపీఎల్ నిబంధనల ప్రకారం కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. ఇది కూడా సాధ్యం కాకపోతే ‘సూపర్ ఓవర్’ను నిర్వహిస్తారు. దీనికి కూడా మైదానం అనుకూలంగా లేకపోతే లీగ్ దశలో ఎక్కువ విజయాలు సాధించిన పంజాబ్ (11) జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. కేవలం తొమ్మిది విజయాలు మాత్రమే సాధించిన కోల్‌కతా రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడుతుంది.
రద్దయితేనే డబ్బులు వాపస్
కోల్‌కతా, పంజాబ్ మ్యాచ్ కోసం కొనుగోలు చేసిన టిక్కెట్లు బుధవారం కూడా చెల్లుబాటు అవుతాయని ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఒక బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దయితే టిక్కెట్ల డబ్బులు వాపస్ ఇస్తామని, ఇందుకోసం మరో ప్రకటన చేస్తామని వెల్లడించారు.