k.kanna babu
-
షాడో డేగ కన్ను
జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చులను అధికార యంత్రాంగం వేయి కళ్లతో పరిశీలిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే వివిధ రకాల ఖర్చులకు జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం రేట్లను కూడా నిర్ణయించింది. ఈ రేట్ల ప్రకారం అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెట్టే భోజనాలు, కాఫీ, టీ తదితర వాటికి లెక్క కట్టి ఖర్చును అభ్యర్థుల ఖాతాలో రాస్తారు. ఇలా జెండాలు, పోస్టర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, జీపులు, ఇతర వాహనాలకు కూడా రేట్లను నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గానికి 7 రకాల టీమ్‌లు ఉన్నాయి. వీటి లక్ష్యం ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయడం, అభ్యర్థులు చేసే ఖర్చును నిశితంగా గమనించడం, ఆధారాలు సేకరించి అభ్యర్థి వారీగా రికార్డులలో ఖర్చుల వివరాలను నమోదు చేస్తారు. పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థులు రూ.78 లక్షలు, శాసనసభకు పోటీ చేసేవారు రూ.28 లక్షల వరకు వ్యయం చేయవచ్చు. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ఖర్చును మించి ఎక్కువ ఖర్చు చేస్తే అనర్హత వేటు పడే ప్రమాదం ఉంది. నామినేషన్ల అనంతరం పోటీ చేసే అభ్యర్థులు ప్రచారంలో చేసే ఖర్చుల వివరాలను ప్రతి మూడు రోజులకోసారి రిటర్నింగ్ అధికారికి, వ్యయ పరిశీలకులకు సమర్పించాల్సి ఉంది. అభ్యర్థులు సమర్పించిన ఖర్చుల వివరాలను తమ దగ్గర ఉన్న షాడో రిజిస్టర్లో నమోదు చేసిన వాటితో సరిచూస్తారు. ఆధారాలతో సహా సేకరించిన ఖర్చుల వివరాలు అభ్యర్థులు చూపిన ఖర్చుల్లో లేకపోతే వెంటనే నోటీసులు ఇస్తారు. వీటికి విధిగా జవాబు ఇవ్వాల్సి ఉంది. 2004, 2009 ఎన్నికలతో పోలిస్తే ఈసారి వ్యయంపై నిఘా పెరిగిందనేది సుస్పష్టం. అయితే అధికారులు లెక్కిస్తున్న ధరలు కాస్తా ఎక్కువగా నిర్ణయించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ రేట్లపై రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నేటి నుంచి నగదు బదిలీ
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సబ్సిడీ గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకం జనవరి 1వ తేదీ నుంచి అమలు కానుందని జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పథకం అమల్లోకి వచ్చినా వినియోగదారులు కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు. గ్రేస్ పీరియడ్ నెల రోజుల వరకు ఉంటుందని తెలిపారు. ఈలోగా ఆధార్, బ్యాంకు అకౌంట్ , సెల్‌ఫోన్ నంబర్లు సంబంధిత గ్యాస్ డీలర్లకు ఇవ్వాలని పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయడం పూర్తి చేసిన వినియోగదారులకు ఇప్పటికే ఒక సిలిండర్ సబ్సిడీ బ్యాంకు ఖాతాలకు జమ అయి ఉంటుందని తెలిపారు. జమ కాకపోయివుంటే త్వరలో ఒక సిలిండర్ సబ్సిడీ అడ్వాన్స్‌గా జమ అవుతుందని తెలిపారు. గ్రేస్ పీరియడ్ పూర్తి అయ్యేలోగా వినియోగదారులు ఆధార్, బ్యాంకు ఖాతాలు ఇవ్వకపోతే పూర్తి ధరతో సిలిండర్ కొనాల్సి వస్తుందని చెప్పారు. జిల్లాలో 42 లక్షల జనాభా ఉండగా, ఇందులో 32 లక్షల మందికి ఆధార్ నంబర్లు వచ్చాయని తెలిపారు. వివిధ జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలో ఆధార్‌లో పురోగతి ఎక్కువగా ఉందని వివరించారు. జిల్లాలో మొత్తం గ్యాస్ వినియోగదారులు 5,53,481 మంది ఉండగా, వీరిలో 2,28,646 మంది నుంచి ఆధార్ నెంబర్లు 2,08,170 మంది నుంచి బ్యాంకు ఖాతాలు సేకరించామని వివరించారు. మరో 67,138 మంది వినియోగదారుల నుంచి ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్లు సేకరించామని వివరించారు. ఆధార్ నమోదు అయి యుఐడీ రాకపోయి ఉంటే అటువంటివారికి యుఐడీ నంబర్లు తెప్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నగదు బదిలీ పథకంతో గ్యాస్ వినియోగదారులకు ఎవ్వరికీ ఎటువంటి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆధార్, బ్యాంకు ఖాతాలు ఇవ్వని రైతులు వెంటనే ఈ వివరాలతో పాటు సెల్‌ఫోన్ నంబర్ కూడా గ్యాస్ డీలర్లకు ఇచ్చి సహకరించాలని కోరారు. గ్యాస్ వినియోగదారుల నగదు బదిలీ పథకం అమలుపై మరింత చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.