కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సబ్సిడీ గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకం జనవరి 1వ తేదీ నుంచి అమలు కానుందని జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పథకం అమల్లోకి వచ్చినా వినియోగదారులు కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు. గ్రేస్ పీరియడ్ నెల రోజుల వరకు ఉంటుందని తెలిపారు. ఈలోగా ఆధార్, బ్యాంకు అకౌంట్ , సెల్‌ఫోన్ నంబర్లు సంబంధిత గ్యాస్ డీలర్లకు ఇవ్వాలని పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయడం పూర్తి చేసిన వినియోగదారులకు ఇప్పటికే ఒక సిలిండర్ సబ్సిడీ బ్యాంకు ఖాతాలకు జమ అయి ఉంటుందని తెలిపారు.
జమ కాకపోయివుంటే త్వరలో ఒక సిలిండర్ సబ్సిడీ అడ్వాన్స్‌గా జమ అవుతుందని తెలిపారు. గ్రేస్ పీరియడ్ పూర్తి అయ్యేలోగా వినియోగదారులు ఆధార్, బ్యాంకు ఖాతాలు ఇవ్వకపోతే పూర్తి ధరతో సిలిండర్ కొనాల్సి వస్తుందని చెప్పారు. జిల్లాలో 42 లక్షల జనాభా ఉండగా, ఇందులో 32 లక్షల మందికి ఆధార్ నంబర్లు వచ్చాయని తెలిపారు. వివిధ జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలో ఆధార్‌లో పురోగతి ఎక్కువగా ఉందని వివరించారు. జిల్లాలో మొత్తం గ్యాస్ వినియోగదారులు 5,53,481 మంది ఉండగా, వీరిలో 2,28,646 మంది నుంచి ఆధార్ నెంబర్లు 2,08,170 మంది నుంచి బ్యాంకు ఖాతాలు సేకరించామని వివరించారు. మరో 67,138 మంది వినియోగదారుల నుంచి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్లు సేకరించామని వివరించారు.
ఆధార్ నమోదు అయి యుఐడీ రాకపోయి ఉంటే అటువంటివారికి యుఐడీ నంబర్లు తెప్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నగదు బదిలీ పథకంతో గ్యాస్ వినియోగదారులకు ఎవ్వరికీ ఎటువంటి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆధార్, బ్యాంకు ఖాతాలు ఇవ్వని రైతులు వెంటనే ఈ వివరాలతో పాటు సెల్‌ఫోన్ నంబర్ కూడా గ్యాస్ డీలర్లకు ఇచ్చి సహకరించాలని కోరారు. గ్యాస్ వినియోగదారుల నగదు బదిలీ పథకం అమలుపై మరింత చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.
నేటి నుంచి నగదు బదిలీ
Published Wed, Jan 1 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
Advertisement