కాంగ్రెస్, టీడీపీకి బీఆర్ఎస్ బ్రేక్.. కోదాడలో ఉత్కంఠ పోరు?
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కోదాడ ఒకటి. తెలంగాణ సరిహద్దు సెగ్మెంట్ అయిన కోదాడలో ఏపీ రాజకీయాలు కూడా ప్రభావితం చేస్తుంటాయి. ఉమ్మడి జిల్లా మొత్తంలో టిల్లర్ల ఓటు బ్యాంక్ ప్రభావం ఉన్న నియోజకవర్గం ఇది. ఏపీ, తెలంగాణకు ఎక్కువగా రాకపోకలు ఉండటం వల్ల రెండు రాష్ట్రాలు కలిసిన వాతావరణం కనిపిస్తుంది. మొదటి నుంచి ఇక్కడ తెలంగాణవాదం తక్కువే. కానీ గత ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. అనూహ్యంగా ఇక్కడ గులాబీ జెండా ఎగిరింది. ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్థులు చెరో ఐదు సార్లు గెలిచారు. కానీ ఫస్ట్‌టైం 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బొల్లం మల్లయ్య యాదవ్ గెలిచారు...
కాంగ్రెస్, టీడీపీ కంచుకోటలకు బీఆర్ఎస్ బ్రేక్:
నిజానికి కోదాడ నియోజకవర్గం మొదట కాంగ్రెస్‌కు.. తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారిపోయింది. గత ఎన్నికలకు ముందు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు బీఆర్ఎస్లో చేరారు. ఆయన తర్వాత.. బొల్లం మల్లయ్య యాదవ్ కూడా సైకిల్ దిగి కారెక్కారు. దాంతో టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం బీఆర్ఎస్ వైపు మళ్లింది. దాంతో మల్లయ్య యాదవ్ తొలిసారి గులాబీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. గెలుపు జెండా ఎగరేశారు.
ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న నేతలు :
ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉన్నట్లు కనిపించినా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకే మరోసారి టికెట్ దక్కింది. ఇక కాంగ్రెస్ పార్టీలో మరోసారి ఉత్తమ్ పద్మావతీ పోటీ చేయనున్నారు. ఒకవేళ ఒకే ఇంట్లో రెండు పదవులు అంశం తెరపైకి వస్తే మాత్రం కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాని నేతను పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి నూకల పద్మారెడ్డి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు :
ప్రధానంగా సాగర్ ఎడమ కాలువ నియోజవర్గం నుంచి వెళ్తున్నా మోతే లాంటి ప్రాంతాలకు చివరి భూములకు నీరు అందడం లేదని అక్కడి రైతులు మండిపడుతున్నారు. ఇక కోదాడలో ఉన్న పెద్ద చెరువు కబ్జాకు గురికావడం కబ్జా వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఈ కబ్జాలను అడ్డుకోవడంలో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు. ఇక ప్రస్తుత ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్తు టాక్ నడుస్తోంది. మరోవైపు దళిత బంధులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడం కూడా పెను దుమారాన్ని లేపింది.
వృత్తిపరంగా ఓటర్లు
ఇక్కడ ప్రధానంగా రైతులు, వ్యాపారంపైనే అధికంగా ఆధారపడి ఉంటారు. రైసు మిల్లులు కూడా అధికంగా ఉంటాయి. ఆంధ్రా సరిహద్దు ప్రాంతం కావడంతో సెటిలర్స్ కూడా ఉంటారు.
మతం/కులం పరంగా ఓటర్లు
ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఓటర్లే అధిక సంఖ్యలో ఉంటారు. ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం నిర్ణాయాత్మక పాత్రను పోషిస్తుందని లెక్కలు చెప్తున్నాయి. మాదిగ సామాజిక వర్గానికి 32427 ఓట్లు, రెడ్డి 24365, గౌడ 22673 , లంబాడా19988, యాదవ్ కులస్తులు -16473, మల 11673, కమ్మ 11628, ముదిరాజ్ 9961, పెరిక 9384, ముస్లీం 8 వేలు
భౌగోళిక పరిస్థితులు..
ఆలయాలు : కోదాడ మండలం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం ఇటీవల కాలంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడకు ఇరు రాష్ట్రాల నుంచి వేలాదిగా నిత్యం భక్తులు వస్తుంటారు. అనంతగిరి మండలం గొండ్రియల రామాలయం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. మునగాల మండలం రేపాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, బరకత్ గూడెం వెంకటేశ్వర స్వామి దేవాలయం.
నదులు : ఈ నియోజకవర్గం నుంచి సాగర్ ఎడమ కాలువ ప్రవహిస్తుంది.