పరిశ్రమల పేరుతో భూదందా
– కొండజూటూరులో కెమికల్ ఫ్యాక్టరీ వద్దు
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
పాణ్యం: పరిశ్రమల పేరుతో పేదల భూములు లాక్కొంటూ తన అనుచరులకు సీఎం చంద్రబాబు నాయుడు కట్టబెడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. బుధవారం మండల పరిధిలోని కొండజూటూరు గ్రామంలో పంట పొలాలను ఆయన పరిశీలించారు. గ్రామ సమీపంలో శాంతిరాం నిర్మించ తలపెట్టిన నానో కెమికల్ పరిశ్రమను తాత్కలింకంగా కాకుండా శాశ్వతంగా విరమించుకోవాలన్నారు. పచ్చటి గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీ పెట్టి.. ప్రజలను, పాడి పశువులను నాశనం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామం కంఠంగా పిలుచుకోనే ప్రభుత్వ భూములను గ్రామస్తుల అనుమతి లేకుండా కెమికల్ పరిశ్రమకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. పరిశ్రమలు వస్తే రాష్ట్రం బాగుపడుతుందనే భ్రమను సీఎం చంద్రబాబు వీడాలన్నారు. ఇప్పటికే ఓర్వకల్లు మండలంలో దాదాపుగా 7500 ఎకరాల భూమిని పరిశ్రమలకు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు. అరకొర పరిహారం రైతులకు ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా 4.70లక్షల ఎకరాల భూమిని బలవంతంగా లాక్కున్నారన్నారు. పరిశ్రమలు పేరుతో సీఎం ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
కొండజూటూరు గ్రామంలో పరిశ్రమకు కేటాయించిన 150 ఎకరాల భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ధర్నాలు చేపడతామన్నారు. ప్రభుత్వం 150 ఎకరాలు ఇస్తే యజమాన్యంఅదనంగా మరో 150 ఎకరాలను దౌర్జన్యంగా తీసుకున్నదని.. ఇది మంచి పద్ధతి కాదన్నారు. తక్షణమే ఆ స్థలంలో గ్రామస్తులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం వడ్డుగండ్ల, జూటూరు చెరువులను పరిశీలించారు. కార్యకమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు రామకష్ణ, ఉసేన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.