. గ్రామస్తులకు నచ్చజెబుతున్న ఎస్‌ఐ మురళీమోహన్‌రావు
మా అందరిపై కేసులు పెట్టండి
Published Tue, Sep 27 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
– పోలీసు చర్యలను నిరసిస్తూ కొండజూటూరు వాసులు స్టేషన్ ఎదుట బైఠాయింపు
పాణ్యం: కొండజూటూరు గ్రామ సమీపంలో శాంతిరాం నానో కెమికల్ పరిశ్రమ ఏర్పాటులో భాగంగా ఈనెల 14న కలెక్టర్ విజయమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రణరంగంగా మారింది. గ్రామస్తులు ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వాహనాలపై రాళ్లు విసిరారు. దీన్ని పోలీసులు సుమోటోగా తీసుకొని గ్రామస్తులపైన 8మందిపై కేసులు నమోదు చేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా గ్రామ పెద్దలను పోలీస్ స్టేషన్‌కు రమ్మని పిలిపించడంతో ఊరి జనమంతా మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ రోజు నిరసన కార్యక్రమంలో తామందరం పాల్గొన్నామని, అందరిపై నమోదు చేయాలని లేదంటే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెప్పినా శాంతించలేదు. గంటకు పైగా స్టేషన్ ఎదుటనే బైఠాయించి పోలీసుల తీరుపై నిరసన తెలిపారు. ప్రజాభిప్రాయసేకరణ సమావేశానికి సంబంధించిన వీడియోను గ్రామంలో చూపించిన తర్వాతే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని సీఐ పార్థసారథిరెడ్డి, ఎస్‌ఐ మురళీమోహన్‌రావు నచ్చజెప్పేందుకు యత్నించారు. జిల్లా అధికారులు కుట్రపన్ని తమపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని మహిళలు, గ్రామస్తులు హెచ్చరిస్తూ ఆందోళన విరమించారు.
Advertisement