nano chemical
-
వచ్చేస్తోంది ‘నానో డీఏపీ’.. అర లీటర్ డీఏపీ బాటిల్ కేవలం రూ.600లే
సాక్షి, అమరావతి: నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ (డైఅమ్మోనియం ఫాస్పేట్) కూడా వచ్చేస్తోంది. తొలకరి సీజన్ నుంచే నానో డీఏపీని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో–ఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) సర్వం సిద్ధం చేసింది. 2021లో మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా రైతుల మన్ననలు పొందుతోంది. తాజాగా ఈ ఖరీఫ్ నుంచే నానో డీఏపీని మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. అర లీటర్.. 50 కేజీల బస్తాతో సమానం గుళికల రూపంలో ఉండే సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఇఫ్కో సంస్థ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్‌తో కలిసి నానో టెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో సూక్ష్మ ఎరువులను మార్కెట్లోకి తీసుకొస్తున్న విషయం విదితమే. నానో యూరియా మాదిరిగానే.. నానో డీఏపీ కూడా 500 మిల్లీ లీటర్ల బాటిల్ 50 కేజీల డీఏపీ ఎరువుల బస్తాతో సమానమని ఇఫ్కో స్పష్టం చేస్తోంది. డీఏపీ ఎరువుల బస్తా ధర మార్కెట్లో రూ.1,350 ధర పలుకుతోంది. నానో యూరియా అర లీటర్ బాటిల్ ధర కేవలం రూ.600 మాత్రమే. అంటే సంప్రదాయ డీఏపీ ఎరువుల బస్తాతో పోలిస్తే రూ.750 తక్కువ ధరకే మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతుంది. ఎన్నో ప్రత్యేకతలు డీఏపీ ఎరువుల వినియోగం పంటల సాగులో చాలా కీలకం. మార్కెట్లోకి రానున్న నానో డీఏపీ పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించకుండా.. పంటలకు అవసరమైన పోషక అవసరాలను తీరుస్తుంది. నానో డీఏపీలో నత్రజని 8 శాతం, భాస్వరం 16 శాతం ఉంటుంది. నానో డీఏపీ కణ పరిమాణం 100 నానోమీటర్ కంటే తక్కువగా ఉండటం వల్ల విత్తనం లోపలికి, శ్వాస క్రియ ద్వారా మొక్కలలోకి సులభంగా ప్రవేశిస్తుంది. పంటలకు అవసరమైన నత్రజని (నైట్రోజన్), భాస్వరం (ఫాస్పరస్ పెంటాక్సైడ్)ను సమపాళ్లలో అందిస్తుంది. మొక్కల్లో వీటి లోపాలను సరిచేస్తుంది. సమపాళ్లలో వ్యాప్తి చెందడం వల్ల విత్తన శక్తితోపాటు కిరణజన్య సంయోగ క్రియ సామర్థ్యం పెరుగుతుంది. మెరుగైన, నాణ్యమైన పంటల దిగుబడికి దోహదపడుతుంది. క్షేత్రస్థాయి పరిశీలనలో పోషక వినియోగ సామర్థ్యం 90 శాతానికి పైగానే ఉన్నట్టు నిర్ధారించారు. రానున్న ఖరీఫ్‌లో 4.50 లక్షల లీటర్లు (9లక్షల బాటిల్స్), రబీలో 5.50 లక్షల లీటర్లు (11లక్షల బాటిల్స్) అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో నానో జింక్, నానో కాపర్ కూడా.. ఎరువుల మార్కెట్ రంగంలో భారత శాస్త్రవేత్తలు నానో యూరియాను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఇందుకుగాను ఇఫ్కో పేటెంట్ కూడా పొందింది. ఇప్పుడు శాస్త్రవేత్తల కృషితో అదే బాటలో నానో డీఏపీని మార్కెట్లోకి తీసుకొస్తోంది. త్వరలో నానో జింక్, నానో కాపర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఇఫ్కో సన్నాహాలు చేస్తోంది. వినియోగం పెరుగుతోంది ఖరీఫ్–1021లో మార్కెట్లోకి తీసుకొచ్చిన నానో యూరియా వినియోగంపై రైతుల్లో ఆసక్తి పెరిగింది. ఖరీఫ్–21లో రాష్ట్రంలో 17 వేల లీటర్ల నానో యూరియా అమ్ముడు కాగా.. తరువాత ఏడాది 2.73 లక్షల లీటర్లు అమ్ముడైంది. 2022–23 ఖరీఫ్‌లో 1.25 లక్షల లీటర్లు, రబీలో 2.40 లక్షల లీటర్ల మేర విక్రయాలు జరిగాయి. సూక్ష్మ ఎరువులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేస్తుండటంతో రైతుల్లో చైతన్యం పెరిగి 2023–24 వ్యవసాయ సీజన్ నుంచి నానో యూరియా నిల్వలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచేందుకు ఇఫ్కో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు వచ్చే ఖరీఫ్ సీజన్లో 12.50 లక్షల లీటర్లు, రబీలో 17.50 లక్షల లీటర్లు నానో యూరియా నిల్వలు రాష్ట్రానికి కేటాయించింది. నానో యూరియాతో పాటు కొత్తగా వస్తున్న నానో డీఏపీని ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీటి వినియోగంపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేసేందుకు కార్యాచరణ సిద్ధమైంది. ఎకరాకు బాటిల్ యూరియా వేశా వరిలో ఎకరాకు 3–4 బస్తాల యూరియా వాడేవాళ్లం. ప్రస్తుతం ఎకరాకు ఒక బాటిల్ మాత్రమే వాడాను. చామంతి, టమోటా, మిరప తోటల్లో కేఊడా వాడుతున్నాను. మంచి ఫలితం కనిపిస్తోంది. మిరప కాయలో మంచి ఊట, ఎదుగుదల కన్పిస్తోంది. – పి.నాగబాబు, నాగాయతిప్ప, కృష్ణా జిల్లా నానో డీఏపీ రెడీ చేస్తున్నాం నానో డీఏపీ రెడీ చేస్తున్నాం. మార్క్‌ఫెడ్ ద్వారా నానో డీఏపీని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దీని వినియోగం వల్ల రైతులకు ఎరువుల ఖర్చులు బాగా తగ్గుతాయి. నానో యూరియా వినియోగంపై రైతుల్లో చైతన్యం పెరుగుతోంది. వచ్చే ఖరీఫ్ నుంచి పూర్తిస్థాయిలో నానో యూరియాను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. డిమాండ్‌ను బట్టి నిల్వలు పెంచేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. – టి.శ్రీధర్‌రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
పరిశ్రమల పేరుతో భూదందా
– కొండజూటూరులో కెమికల్ ఫ్యాక్టరీ వద్దు – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాణ్యం: పరిశ్రమల పేరుతో పేదల భూములు లాక్కొంటూ తన అనుచరులకు సీఎం చంద్రబాబు నాయుడు కట్టబెడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. బుధవారం మండల పరిధిలోని కొండజూటూరు గ్రామంలో పంట పొలాలను ఆయన పరిశీలించారు. గ్రామ సమీపంలో శాంతిరాం నిర్మించ తలపెట్టిన నానో కెమికల్ పరిశ్రమను తాత్కలింకంగా కాకుండా శాశ్వతంగా విరమించుకోవాలన్నారు. పచ్చటి గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీ పెట్టి.. ప్రజలను, పాడి పశువులను నాశనం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామం కంఠంగా పిలుచుకోనే ప్రభుత్వ భూములను గ్రామస్తుల అనుమతి లేకుండా కెమికల్ పరిశ్రమకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. పరిశ్రమలు వస్తే రాష్ట్రం బాగుపడుతుందనే భ్రమను సీఎం చంద్రబాబు వీడాలన్నారు. ఇప్పటికే ఓర్వకల్లు మండలంలో దాదాపుగా 7500 ఎకరాల భూమిని పరిశ్రమలకు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు. అరకొర పరిహారం రైతులకు ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా 4.70లక్షల ఎకరాల భూమిని బలవంతంగా లాక్కున్నారన్నారు. పరిశ్రమలు పేరుతో సీఎం ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కొండజూటూరు గ్రామంలో పరిశ్రమకు కేటాయించిన 150 ఎకరాల భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ధర్నాలు చేపడతామన్నారు. ప్రభుత్వం 150 ఎకరాలు ఇస్తే యజమాన్యంఅదనంగా మరో 150 ఎకరాలను దౌర్జన్యంగా తీసుకున్నదని.. ఇది మంచి పద్ధతి కాదన్నారు. తక్షణమే ఆ స్థలంలో గ్రామస్తులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం వడ్డుగండ్ల, జూటూరు చెరువులను పరిశీలించారు. కార్యకమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు రామకష్ణ, ఉసేన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
మా అందరిపై కేసులు పెట్టండి
– పోలీసు చర్యలను నిరసిస్తూ కొండజూటూరు వాసులు స్టేషన్ ఎదుట బైఠాయింపు పాణ్యం: కొండజూటూరు గ్రామ సమీపంలో శాంతిరాం నానో కెమికల్ పరిశ్రమ ఏర్పాటులో భాగంగా ఈనెల 14న కలెక్టర్ విజయమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రణరంగంగా మారింది. గ్రామస్తులు ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వాహనాలపై రాళ్లు విసిరారు. దీన్ని పోలీసులు సుమోటోగా తీసుకొని గ్రామస్తులపైన 8మందిపై కేసులు నమోదు చేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా గ్రామ పెద్దలను పోలీస్ స్టేషన్‌కు రమ్మని పిలిపించడంతో ఊరి జనమంతా మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ రోజు నిరసన కార్యక్రమంలో తామందరం పాల్గొన్నామని, అందరిపై నమోదు చేయాలని లేదంటే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెప్పినా శాంతించలేదు. గంటకు పైగా స్టేషన్ ఎదుటనే బైఠాయించి పోలీసుల తీరుపై నిరసన తెలిపారు. ప్రజాభిప్రాయసేకరణ సమావేశానికి సంబంధించిన వీడియోను గ్రామంలో చూపించిన తర్వాతే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని సీఐ పార్థసారథిరెడ్డి, ఎస్ఐ మురళీమోహన్రావు నచ్చజెప్పేందుకు యత్నించారు. జిల్లా అధికారులు కుట్రపన్ని తమపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని మహిళలు, గ్రామస్తులు హెచ్చరిస్తూ ఆందోళన విరమించారు. -
‘నానో’ వద్దే వద్దు
– కొండజూటూరు గ్రామస్తుల ఆందోళన – రోడ్డుపై బైఠాయింపు – అధికారులను అడ్డుకున్న వైనం – గ్రామస్తులతో పోలీసుల చర్చలు పాణ్యం: కొండజుటూరు గ్రామ సమీపంలో సుమారు వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన శాంతిరాం నానో కెమికల్ పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆదివారం ఆందోళనకు దిగారు. సుమారు రెండు గంటలపాటు రోడ్డుపైనే బైఠాయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించేందుకు కిందిస్థాయి అధికారులు ఆదివారం గోప్యంగా గ్రామంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే విషయం గమనించిన గ్రామస్తులు మూకుమ్మడిగా రోడ్డెక్కారు. తహసీల్దార్ చంద్రావతి అడ్డుకున్నారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర ్భంగా ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు 50 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే మహిళలు, చిన్నపిల్లలు సహా గ్రామస్తులు కర్రలు తీసకుఉని రోడ్డుపై బైఠాయించారు. 500 మంది వరకు స్థానికులు నిరసన గళం విప్పారు. పరిశ్రమ, అదీ ఇదీ అంటూ మరోసారి గ్రామంలోకి వస్తే ఎం జరిగినా తమది బాధ్యత కాదంటూ హెచ్చరించారు. దీంతో చేసేదేమి లేక అధికారులు, పోలీసులు వెనుదిరిగారు.