మార్చినాటికి జంటనగరాలకు కృష్ణా నీళ్లు
పెద్ద అడిశర్లపల్లి/ చింతపల్లి : కోదండాపురం ప్లాంట్ నుంచి మార్చి నాటికి మూడోదశ పైపులైన్ ద్వారా జంటనగరాలకు కృష్ణాజలాలు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టి. పద్మారావు వెల్లడించారు. సోమవారం ఆయన హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ(హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు)అధికారులతో కలిసి పెద్ద అడిశర్లపల్లి మండలంలోని కోదండాపురం ప్లాంటును, మూడోదశ పైపులైన్ పనులను అలాగే చింతపల్లి మండలంలోని గొడకొండ్ల, నసర్లపల్లి వాటర్ప్లాంట్లలో కొనసాగుతున్న పైపులైన్ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జంటనగరాలకు తాగునీటి అవసరాల దృష్ట్యా నాలుగో పైపులైన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ వరకు చేపట్టిన పైప్‌లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. సుంకిశాల డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు.
ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణ రాష్ట్రం తీవ్ర కరెంట్ సమస్యను ఎదుర్కొంటున్నదని అన్నారు. అర్హులందరికీ ఆహారభద్రత కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలందరికీ ఈ కార్డులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అవసరమైతే నూతనంగా మరో పది లక్షల కార్డులైనా అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గొడకొండ్ల, నసర్లపల్లి వాటర్ప్లాంట్లలో పని చేస్తున్న పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట బోర్డు ఎండీ జగదీశ్వర్, ఈడీలు సత్యనారాయణ, ప్రభాకర్ శర్మ, కొండారెడ్డి, శ్రీధర్‌బాబు, డెరైక్టర్ రామేశ్వర్ రావు, డీజీఎం దశరథరెడ్డి,డిప్యూటీ కమిషనర్ అనసూయాదేవి, ఈఎస్‌లు దత్తరాజ్‌గౌడ్, శ్రీనివాస్, ఏఈలు పవన్‌కుమార్ , ధనవంతరెడ్డి పాల్గొన్నారు.