మూగబోయిన ‘లాల్బనో’ గళం - ఎన్.కె.
ఎన్.కెగా 1970 నుంచి విప్లవ సాహిత్యోద్యమానికి పరిచయ మైన నెల్లుట్ల కోదండరామారావు వరంగల్ జిల్లా కూనూరులో ఒక సంప్రదాయ దేశ్ముఖ్ కుటుం బంలో జన్మించారు. ఇటు సాహి త్య ప్రభావం, అటు తెలంగాణ ఉద్యమ వాతావరణంలో ఎన్కె వరంగల్ ఆర్ట్స్ కాలేజ్లో ఒక చిరు ఉద్యోగిగా మిత్రమండలికి వచ్చేవాడు. ఆయన కన్నతండ్రి పద్యాలై నా, అప్పుడప్పుడే రాస్తున్న కవితలైనా ఎవరివైనా సరే ఆయన చూసి చదివింది ఎప్పుడూలేదు. అన్నీ కంఠతా అద్భుతమైన స్వరంతో చదివేవాడు. మిత్ర మండలిలో కాళోజీ సోదరులకు, ఇతర సాహితీమిత్రులకు, సృజన ‘సాహితీమిత్రులకు’ ఆయనట్లా సన్నిహితమయ్యాడు. అదే కాలంలో సృజనలో ‘ట్రిగ్గర్ మీది వేళ్లతో.. ’లోచన్ కవిత, 69 నాటికి శివసాగర్ ‘లెనిన్-నా లెనిన్’ వంటి కవితలు, శివసాగర్ ‘జేగంటలు’, ‘తూర్పుపవనం వీచెనోయ్’ వంటి పాటలు ఎన్కెను ఆవహించి ఆయన నింక విప్లవోద్యమం నుంచి వెనక్కి చూడకుండా చేసినవి.
సృజన సాహితీమిత్రుల్లో రచనల ఎన్నిక విషయం లోనే కాదు, ప్రెస్లో ప్రూఫులు చూడడం మొదలు, ఇంట్లో మనిషి వలె తలకెత్తుకున్నవాడు ఎన్కె. మూడు నాలుగేళ్లు గా పార్కిన్సన్,, మధుమేహం, రక్తపోటుతో బాధపడు తూ, గుండెజబ్బుకు కూడా శస్త్ర చికిత్స జరిగి చూపు, నడక దాదాపు కోల్పోయి అనారోగ్యంతో శయ్యాగతుడుగానే ఉన్నాడు. ఆఖరిసారి ఈ సెప్టెంబర్ 7న కాళోజీపై లోచన్ పుస్తకావిష్కరణకు వెళ్లి, ఆయనను వెళ్లి చూసినప్పుడు మాత్రం కొంచెం మెరుగ్గా ఉన్నట్టు అనిపించింది. ఆయన మళ్లీ కంఠం సవరించుకొని మనమధ్యకు వచ్చి ఆ 70ల, 80ల రోజులను ఆలపించగలడనే ఆశ నిన్న 2014 డిసెంబర్ 27 రాత్రి 8గంటలకు శాశ్వతంగా విగత ఆశ అయిపోయింది.
ఎన్కె జీవితంలో 1968-85 ఒక ఉజ్వల కాలం. ముఖ్యంగా వరంగల్లో 85 సెప్టెంబర్ 3న డాక్టర్ రామనాథం గారి హత్యతో మేం పదిహేడేళ్లు ఒక గూటి పక్షులుగా పంచుకున్న జీవితాలు, ఉద్యమా లు అన్నీ చెల్లాచెదురయిపోయినవి. కొంద రు కూడదీసుకున్నారు. 1985-89 గడ్డుకా లాన్ని గడిచి మునుసాగారు. కాని ఎన్కె విరసం క్రమశిక్షణా నియమాల వల్ల కూడా 1990 నాటికి విరసం నుంచి నిష్ర్కమిం చాడు. అయితే హృదయంలో విప్లవం పట్ల, విప్లవసాహిత్యం పట్ల గూడుకట్టుకున్న భావాద్వేగాలు ఎప్పుడూ చెదిరిపోలేదు. 1985 దాకా విరసం కార్యకలాపాల్లో చాలా క్రీయాశీ లంగా పాల్గొన్న ఎన్కె 70లో ఖమ్మంలో కామ్రేడ్ సుబ్బా రావు పాణిగ్రాహినగర్లో జరిగిన ప్రథమ మహాసభల నుంచి వరంగల్, హైదరాబాద్, తెనాలి, గుంటూరు, విశాఖపట్నంల దాకా వేదికలపై విప్లవగీతాల ఆలాపనల తో చాలా ప్రసిద్ధుడయ్యాడు. అప్పుడు విరసం సభలకు వేలాది మందిగా జనం వచ్చేవాళ్లు.
ఎమర్జెన్సీ ప్రకటించగానే 1975 జూలై 4న ఆయనను మీసా కింద అరెస్టు చేశారు. 75 అక్టోబరు 1 దాకా జైలులో మా గదిలోనే ఉన్న చెరుకూరి రాజకుమార్తో కలిసి ఎప్పుడూ ఆయన విప్లవగీతాలు ఆలపిస్తుండేవాడు. ఎమ ర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత విప్లవోద్యమం ప్రజాపంథాను చేపట్టాక మాకు జన్నుచిన్నాలు తలలో నాలుకయ్యాడు. 1979 అక్టోబర్ 19న జన్ను చిన్నాలు హత్య జరిగినప్పుడు ‘‘నీ కోసం పాట పాడుతా చిన్నాలన్నా, ఒక్కసారి లేచిరా వయ్యా చిన్నాలన్నా’’ అని ఆయన పాడిన పాట ఎన్ని సభల్లో మారుమ్రోగేదో. సృజనలో 1982 ఆగస్టులో అచ్చయిన ‘లాల్బనో గులామీ చోడో బోలో వందేమా తరమ్’ అనే ఎన్కె దీర్ఘకవిత 1983లో ఒకసారి, 84లో మళ్లీ అంతే సుదీర్ఘమైన బాలగోపాల్ ముందు మాటతో ఆర్ఎస్యూనే ప్రచురించి, విస్తృత ప్రచారం చేసింది.
ఈ కవితకు ఒక చరిత్ర ఉంది. నక్సలైట్లు ఏ దేశ భక్తులు, చైనా చెంచాలు, రష్యా తొత్తులు అని గోడల మీద ఏబీవీపీ వాళ్లు నినాదాలు రాస్తే ‘నక్సలైట్లే దేశభక్తులు’ అని రాడికల్స్ రాసిన రోజులవి. ‘లాల్గులా మీ చోడ్కే బోలో వందే మాతరమ్’ అని ఏబీవీపీ వాళ్లు రాస్తే దానికి ముహ్తోడ్ జవాబివ్వాలని ఆవేశపడిన ఎన్కె ఏకంగా ఒక దీర్ఘకవితను వేలాది మంది ప్రేక్షకుల ముందు కంచుకంఠం మోగినట్లు అరమోడ్పు కన్నులతో పాడుతుం టే అది ఓ రోమాంచి తదృశ్యం. ఒక ఉద్రిక్త అనుభవం. జమ్మి కుంట ఆదర్శ కళాశాల విద్యార్థి తిరుపతి పోలీసుల చిత్రహింసలకు గురై తర్వాత కొద్ది రోజులకే కరెంటు షాక్తో మరణించినప్పుడు ఆయనపై ఎన్కె రాసిన పాట చాలా ప్రచారాన్ని పొందింది. తిరుపతిలో విప్లవోద్య మాన్ని నిర్మించిన చలపతి, నాగరాజుల లో నాగరాజు అమరుడైనప్పుడు ‘అంటాము అమరు డవని నాగరాజు, ఉంటాము నీవెంట రోజురోజు’ అని రాసిన పాట ఇప్పటికీ విప్లవ విద్యార్థి ఉద్యమం గుర్తు పెట్టుకుంటుంది.
68 నుంచి 85 దాకా ఆయన మా ఇంట్లో పెద్ద కొడుకు వలె వ్యవహరించాడు. నన్ను చిన్నబాపు అని, నా సహచరి హేమలతను చిన్నమ్మ అని పిలిచేవాడు. ఆమెను కూడా కన్నతల్లి అంతగా అభిమానించాడు. ఇంట్లో పిల్లల వలెనే అలకలు, కోపాలు, ఉద్రేకాలు, అపార్థాలు, సాధించడాలు - మళ్లా కరిగిపోవడాలు అన్నీ ఉండేవి. 1990 తర్వాత మాకు పరస్పరం ప్రేమాభిమానాల్లో ఏ కల్మషమూ రాలేదు గానీ ఆయన విరసంకు దూరమ య్యాడు.
‘అమ్మమనసు’ వస్తుగత దృష్టితో కాకుండా స్వీయాత్మక దృష్టితో రాసాడనిపించింది. విరసం నిర్మా ణం, కార్యకలాపాల పట్ల కూడా కొన్ని తప్పులు దొర్లాయి. కనుక అవి సవరించుకొని మళ్లీ రాయమన్నాను. అంతే. ఆ పుస్తకానికి ముందు మాటలో ఆ అలక, కోపం, బాధ, వేదన కనిపిస్తాయి. కానీ ప్రేమలున్నచోట అవన్నీ కన్నీళ్ల లో కరిగిపోతాయి కంట్లో నలుసులు కరిగి పోయినట్లుగా, చినబాపూ, చిన్నమ్మా, చెల్లెళ్లూ, తమ్ములూ అని ఆయన నాభి దగ్గర్నించి వచ్చే పిలుపు, గాలిలో తేలిపోయే ఆయన పాటలు మా చెవుల్లో మోగుతూనే ఉంటాయి. గుండెల్లో తడిగా మిగిలి ఉంటాయి. ఇవన్నీ విప్లవానుబంధం వల్ల, సృజన వల్ల, విరసం వల్ల ఏర్పడినవే. కనుక మరింత స్వచ్ఛమైనవి.
(వ్యాసకర్త విప్లవ కవి, విరసం నేత)