మేమింతే!
=ఫ్లై ఓవర్ నిర్మాణంలో నిబంధనలకు పాతర
=భూ యజమానులతో చర్చించకుండా పనులు
=పరిహారం నిర్ణయించకుండా నిర్మాణం
వంతెన నిర్మించాలనుకున్నారు..అంతే.. పనులు ప్రారంభించేశారు. భూ సేకరణలో నిబంధనలు పాటించలేదు. ప్రయివేటు భూముల యజమానుల్ని సంప్రదించలేదు. వారి అభిప్రాయం తెలుసుకోలేదు. పరిహారం ఎంతో నిర్ణయించలేదు. కొక్కిరాపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణంలో అధికారులు ముందు చూపు లేకుండా వ్యవహరిస్తున్నారు. పద్ధతి లేకుండా పనులు చేపడుతున్నారన్న విమర్శలను మూటగట్టుకున్నారు.
యలమంచిలి, న్యూస్‌లైన్: కొక్కిరాపల్లి రైల్వే గేట్ వద్ద రూ.36 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఆరు నెలల క్రితమే ప్రారంభమయ్యాయి. వంతెన నిర్మాణానికి 8 ఎకరాల 42 సెంట్ల భూ సేకరణకు సర్వే పూర్తి చేశారు. దీంట్లో 6 ఎకరాల 38 సెంట్లు ప్రభుత్వ భూమి కాగా, 2.04 ఎకరాల్లో వ్యవసాయ, ప్రయివేటు స్థలాలున్నాయి. ప్రస్తుతం ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా పిల్లర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నెల 20న జేసీ ప్రవీణ్‌కుమార్ ప్రయివేటు భూములను పరిశీలించి మార్కెట్ ధరలపై ఆరా తీశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివరాలను సేకరించాలని స్థానిక రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ప్రయివేట్ భూసేకరణలో అధికారులు నిబంధనలను పాటించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా పరిశ్రమలు, ప్రాజెక్టులు, ఇతర అవసరాలకు భూసేకరణలో ముందుగానే సంబంధిత రైతులు, యజమానుల అభిప్రాయాలను సేకరించాలి.
అనంతరం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయాలి. ప్రభుత్వం చెల్లించే పరిహారంపై చర్చించాలి. భూయజమానుల అంగీకారం మేరకు నష్టపరిహారం నిర్ణయించాలి. ఆ తర్వాతే పనులు ప్రారంభించాలి. యలమంచిలి ఫ్లై ఓవర్ నిర్మాణంలో మాత్రం అధికారులు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రయివేట్ భూములకు పరిహారం చెల్లించడంలో జాప్యం జరిగితే రూ.కోట్ల విలువైన పనులు నిలిచిపోయే అవకాశం ఉంది.
కొత్త నిబంధనలతో చెల్లింపులెలా?
కేంద్రప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం భూసేకరణలో అధికార యంత్రాంగం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మార్కెట్ ధరకు 3 రెట్లు అధికంగా భూములకు పరిహారం అందజేయాలి. కొక్కిరాపల్లి వంతెనను నిర్మిస్తున్న ప్రాంతంలో ప్రస్తుతం ఎకరా భూమి మార్కెట్ ధర రూ.12 లక్షల వరకు ఉందని అంచనా. భూసేకరణ కొత్త చట్టం ప్రకారం భూమి కోల్పోతున్న వారికి ఎకరాకు పరిహారంగా రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అధికారులు ఇంకా మార్కెట్ ధరలపై ఆరా తీయడం స్థానికులను విస్మయపరుస్తోంది.