సామాజిక ఉద్యమకారుల స్ఫూర్తి
ఆచార్య కొలకలూరి ఇనాక్
తెనాలి: సమాజాన్ని మార్చిన మేధావుల స్ఫూర్తిగా సామాజిక, సాంస్కృతిక అంశాల్లోని సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని సాహితీవేత్త, ప్రతిష్టాత్మక మూర్తిదేవి అవార్డుకు ఎంపికైన ఆచార్య కొలకలూరి ఇనాక్ సూచించారు. సామాజిక పరివర్తన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఇక్కడి పెన్షనర్స్ అసోసియేషన్ హాలులో ‘సామాజిక పరివర్తనలో సెప్టెంబర్’ సదస్సు నిర్వహించారు. ఇనాక్ మాట్లాడుతూ.. తొలిసారిగా సత్యశోధక్ సమాజ్ స్థాపనతో సామాజిక ఉద్యమానికి జ్యోతిబా పూలే సెప్టెంబరు 24న నాంది పలికారని గుర్తుచేశారు. అట్టడుగువర్గాల అభ్యున్నతిని ఆశించిన మహాకవి గుర్రం జాషువా, కుసుమ ధర్మన్నకవి, డాక్టర్ బోయి భీమన్న జయంతి ఇదే నెలలోనేనని చెప్పారు. అంబేడ్కర్ కృషితో పూనా ఒడంబడిక, రిజర్వేషన్ల సాధన వంటి అనేక సంఘటనలు సెప్టెంబరు 24నే జరిగాయని వివరించారు. కేంద్రం అధ్యక్షుడు అంబటి అనిల్‌కుమార్ అధ్యక్షత వహించిన సదస్సులో రచయిత్రి గుజ్జర్లమూడి స్వరూపరాణి, వివిధ సంస్థలు, ఉద్యోగ, సాంస్కృతిక సంఘాల నేతలు మాతంగి దిలీప్‌కుమార్, వున్నవ వినయ్‌కుమార్, ఎస్.ఎస్.ఎస్ సుకుమార్, ఎస్.ఎం.ప్రకాష్‌కుమార్ ప్రసంగించారు.