అత్యాచారం చేసి.. కిరోసిన్ పోసి తగలెట్టేశారు!
పశ్చిమబెంగాల్ రాజధాని నగరం కోల్కతాలో బాలికపై జరిగిన అత్యాచారం కేసు మరో కొత్త మలుపు తిరిగింది. అక్టోబర్ నెలలో రెండుసార్లు అత్యాచారానికి గురి కావడం, పదే పదే రేపిస్టుల నుంచి బెదిరింపులు ఎదుర్కోవడంతో తట్టుకోలేని 16 ఏళ్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని గత రెండు మూడు రోజులుగా చెబుతున్నారు. అయితే, ఆమెది ఆత్మహత్య కాదు.. హత్య అని ఇప్పుడు పోలీసులు అంటున్నారు. రేపిస్టులే ఆమెపై కిరోసిన్ పోసి తగలబెట్టారని తేల్చారు. ఈ మేరకు నిందితులు ఇద్దరిపై తగిన చర్యలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు.
సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాల్సిందిగా నిందితులు రతన్ సిల్, మింటా సిల్ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. వాళ్లిద్దరూ ఆ కుటుంబం అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కొడుకులు. అయితే, అందుకు ఆమె తిరస్కరించడంతో వాళ్లు కిరోసిన్ పోసి తగలబెట్టేశారు. పైకి మాత్రం దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఇంతకుముందు వారిపై బెదిరింపు కేసు మాత్రమే నమోదైంది. బాధితురాలు మరణించిన ఒకరోజు తర్వాత.. అంటే డిసెంబర్ 24న వారిని పోలీసులు అరెస్టుచేశారు. రెండు రోజుల క్రితం.. మంగళవారం నాడు ఆమె కాలిన గాయాలతో ఆస్పత్రిలో మరణించింది.