పోలీసులపై రాళ్లతో దాడి.. తీవ్ర ఉద్రిక్తత
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని కొమరంభీం నగర్లో పోలీసులపై రాళ్ల దాడి జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడి సర్వే నెంబర్ 169లో పేదల ఆక్రమిత గుడిసెలను తొలగించేందుకు మంగళవారం ఉదయం ఆర్డీవో యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వచ్చాయి. అయితే, స్థానికులు వారిని రానీయకుండా అడ్డుకున్నారు. కొందరు రాళ్లతో పోలీసులపై దాడికి యత్నించారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు జల ఫిరంగులను ఉపయోగించారు.
సర్వే నెంబర్ 169లోని 32 ఎకరాలను 2007లో ప్రభుత్వం హౌసింగ్బోర్డ్కు కేటాయించింది. అయితే ఈ భూమిలో 2011లో పేదలు సుమారు రెండు వేల గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. గతంలో రెండు సార్లు వీటిని తొలగించినప్పటికీ తిరిగి మళ్లీ వారు గుడిసెలను నిర్మించుకున్నారు. దీంతో వాటిని తొలగించేందుకు అధికారులు మరోసారి యత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.