Kondapalli toy
-
బొమ్మల కొలువు
పండుగకు బొమ్మలను కొలువుదీర్చడం లేదామె. బొమ్మల తయారీ ‘కొలువు’ను పండగ చేస్తున్నారు. బొమ్మలతో ‘చక్కటి కొలువు’కు మార్గం వేస్తున్నారు. మన బొమ్మల నుంచి మన చేనేతల వరకు... సంప్రదాయ కళల పురోగతికి బాట వేస్తున్నారామె. ‘‘కళకు రాజపోషణ అవసరమే. కానీ కళ జీవించాల్సింది కేవలం దాతల దయాదాక్షిణ్యాల మీద మాత్రమే కాదు. కళ స్వయంసమృద్ధి సాధించాలి. అప్పుడే ఆ కళకు గుర్తింపు, కళాకారులకు గౌరవం లభిస్తాయి’’ అన్నారు చిత్రాసూద్. ఆమె హైదరాబాద్‌లో కార్పొరేట్రంగంలో ఉన్నతస్థాయిలో ఉద్యోగం చేస్తున్నారు. సమాజానికి చేయాలనుకున్న పనులను ఒక సుమహారంగా మలుచుకున్నారు. తన ప్రవృత్తిలో భాగంగా గొల్లభామ చీరలు, బొబ్బిలి నేత, ఇకత్ లక్ష వత్తుల చీర వంటి తెలుగు వారి సిగ్నేచర్ వీవింగ్‌కు సహజ రంగులను మేళవిస్తున్నారు. కొండపల్లి బొమ్మల కళాకారులు వృత్తిని వదిలి ఇతర ఉపాధి మార్గాల వైపు మరలుతున్న పరిస్థితిని గమనించి ఆ కళను పరిరక్షించే పనిలో పడ్డారామె. ఆ వివరాలతోపాటు తాను ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రభావితం చేసిన పరిస్థితులను సాక్షితో పంచుకున్నారు చిత్రాసూద్. తమిళనాడు నుంచి తెలంగాణకు ‘‘మా పూర్వికులది పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి. అమ్మవైపు విశాఖపట్నం. ఇరువైపుల కుటుంబాలూ తమిళనాడులో స్థిరపడ్డాయి. నాన్న కుటుంబం చెన్నైలో, అమ్మ వాళ్లు మధురైలో. అలా నేను పుట్టిన ప్రదేశం మధురై, పెరిగింది చెన్నై. నా చిన్నప్పుడే నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కి వచ్చేశాం. ఆ తర్వాత స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్థిరపడ్డారు. అలా నా చదువు సింగరేణిలో, పాల్వంచలో సాగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... నేను నా బాల్యంలోనే నాగరక భారతాన్ని, గ్రామీణ భారతాన్ని దగ్గరగా చూడగలిగాను. అప్పట్లో తలెత్తిన అనేక సందేహాలే ఇప్పుడు నేను చేస్తున్న పనుల కారకాలు. గ్రామీణ మహిళలు, పిల్లల్లో చైతన్యం లేకపోవడం, చదువు లేకపోవడం, అవకాశాలు లేకపోవడం అప్పట్లో నాలో ఆలోచనను రేకెత్తించేవి, కానీ వాటిని ఎలా పరిష్కరించాలో తెలియదు. అలాగే నా తొలి ఉద్యోగంలో నేను చూసిన పరిస్థితులు కూడా ఆందోళనకరమైనవే. అది హైదరాబాద్ శివారులో ఉన్న కెమికల్ ఇండస్ట్రీ. ఆ జిలెటిన్ తయారీ పరిశ్రమలో ఏడెనిమిదేళ్ల పిల్లలు పని చేసేవాళ్లు. పొడులను జల్లెడ పట్టడం వంటి పనిని ఆటలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్లు. తామెంత విపత్కరమైన పని చేస్తున్నారనేది తెలియని అమాయకత్వం వారిది. నా చదువు నా ఉన్నతికి మాత్రమే పరిమితం కాకూడదు, ఇంకా ఏదైనా చేయాలని గట్టిగా అనిపించిన సందర్భం కూడా అదే. నాలో అస్పష్టంగా ఉన్న ఆలోచనలకు ఒక రూపాన్ని ఇవ్వడం పదేళ్ల కిందట మొదలైంది. చదువులో రాణిస్తూ ఉన్నత చదువులకు కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించని విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడంతో సమాజానికి మా వంతు చారిటీ మొదలు పెట్టాం. ఆ టాస్క్‌లో మా హస్బెండ్ అనిల్ సూద్ సహకరిస్తున్నారు. చేనేతల్లో నాచురల్ కలర్స్ వాడకం, కొండపల్లి బొమ్మల కళ పరిరక్షణలో ‘అభిహార’ సంస్థ నిర్వాహకురాలు చిత్ర అనుభవాన్ని కలుపుకుని ముందుకుపోతున్నాను. కళలో సామాజిక మార్పు! ఏ కళలనైనా దాతల సహకారంతో ఎంతకాలమని పరిరక్షించగలం? కళ తనకు తానుగా స్వయంసమృద్ధి సాధించాలి. అప్పుడే కళకు, కళాకారులకు గౌరవం. అందుకే మహిళలకు శిక్షణ ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇవ్వడంతోపాటు మార్కెట్ సౌలభ్యత కోసం పని చేస్తున్నాను. కొండపల్లిలో ఉండే మహిళలను తీసుకువచ్చి హైదరాబాద్‌లోని సప్తపర్ణిలో ఎగ్జిబిషన్ పెట్టించడంలో నా ఉద్దేశాలు రెండు నెరవేరాయి. ఒకటి గ్రామీణ మహిళలకు తమ బొమ్మలకు ప్రపంచంలో ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలియాలి, అలాగే కొనేవాళ్లు ఏం కోరుకుంటున్నారో అర్థం కావాలి. అలాగే ఒక అద్భుతమైన కళను సంపన్నుల లోగిళ్లను చేరగలిగితే ఆ కళకు రాజపోషణకు దారి వేసినట్లే. ఈ రెండూ సాధ్యమయ్యాయి. ఎప్పుడూ చేసే దశావతారాలు, ఎడ్లబండ్ల నుంచి కళాకారుల నైపుణ్యాన్ని టేబుల్ టాప్స్, మొబైల్ ఫోన్ స్టాండ్ వంటి రోజువారీ వాడుక వస్తువుల తయారీకి విస్తరించగలిగాం. అలాగే ఒక కళ ఆవిర్భవించినప్పుడు అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఒక రూపం సంతరించుకుని ఉంటుంది. ఆ రూపాలను కాలానుగుణంగా మార్చుకోవాలి. అందుకే కళను ధార్మికత పరిధి నుంచి సామాజిక పరిధికి విస్తరించాల్సిన అవసరాన్ని నేర్పిస్తున్నాం. ఈ బొమ్మలను లాంకో కంపెనీ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ హస్తకళాకృతుల సంస్థలు లేపాక్షి, గోల్కొండలు పెద్ద ఆర్డర్లతో ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడ నేను నమ్మే సిద్ధాంతం ఏమిటంటే... కళను పరిరక్షించడం అనేది పెద్దమాట. కళ ద్వారా ఉపాధి పొందడం ప్రధానం. అప్పుడే కళ కలకాలం నిలుస్తుంది, కళాకారులు తమ ఉనికిని గర్వంగా చాటుకోగలుగుతారు. నా సర్వీస్‌తో ఎన్ని కుటుంబాలు, ఎన్ని కళారూపాలు స్వయంసమృద్ధి సాధించాయనేది నాకు మిగిలే సంతృప్తి’’ అన్నారు చిత్రాసూద్. వృత్తులకు, కళలకు ఇల్లే యూనివర్సిటీగా ఉండేది. పుస్తకం–కలం లేకుండానే విస్తృతమైన జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అయ్యేది. కాలం మారింది, ప్రపంచీకరణ మన సంప్రదాయ వృత్తులను కాలగర్భంలో కలిపేస్తున్న తరుణంలో మన కళల జ్ఞానాన్ని గ్రంథస్థం చేయాల్సిన అవసరం ఉంది. దానికి శాస్త్రబద్ధత కల్పించాల్సిన అవసరం వచ్చింది. ఈ సైన్స్ ఏ పుస్తకంలోనూ లేదు! కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రానికి అనుబంధంగా సహజ రంగుల తయారీ పరిశ్రమను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సొరకాయ ఆకులతో చెక్కకు రంగు అద్దవచ్చని ఇంతవరకు ఏ పుస్తకమూ చెప్పలేదు. కొండపల్లి బొమ్మల కళాకారులకు మాత్రమే తెలిసిన సైన్స్ అది. ఇక చేనేతల్లో గొల్లభామ, బొబ్బిలి, ఇకత్ చీరల్లలోనూ నేచురల్ కలర్స్ ప్రయోగం మొదలైంది. ఈ రంగాల్లో ఉన్న జ్ఞానాన్ని నిక్షిప్తం చేయడం కూడా మా తదుపరి ప్రాజెక్టుల్లో ఒకటి. భూమండలాన్ని ప్రమాదం అంచుల్లోకి నెట్టివేస్తున్న కారకాల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ కాలుష్యం ప్రధానమైనది. అందుకే మనవంతుగా కొన్ని అడుగులు వేయగలిగితే, మరికొందరి చేత వేయించగలిగితే... ఆ తర్వాత ఈ నేచర్ మూవ్మెంట్ దానంతట అదే ముందుకు సాగుతుంది. – చిత్రాసూద్, యాక్టివిస్ట్, రివైవల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కో – ఫౌండర్, అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ చాయిసెస్ ‘మహిళ’ శ్రమ చర్చకే రాదు! మహిళ స్థితిగతులు మారాలంటే ఆర్థిక స్వావలంబన సాధించాలనేది జగమెరిగిన సత్యం. మన వ్యవస్థలన్నింటిలోనూ మహిళలను సహాయక పనులకే పరిమితం చేయడంతో వారి శ్రమ గుర్తింపునకు నోచుకోవడం లేదు. మహిళలకు కూడా ఆర్టిజన్ కార్డ్ ఇప్పించడానికి పని చేస్తున్నాను. అలాగే వేతనపెంపు విషయంలో మహిళల పని గురించి చర్చ కూడా ఉండడం లేదు. ఎంతగా శ్రమించినప్పటికీ మహిళకు గుర్తింపు ఉండదు, ఆదాయం తక్కువ. ఈ పరిస్థితిని మార్చడానికి ‘అభిహార’ అనే వేదిక ద్వారా పని చేస్తున్నాను. కొండపల్లి బొమ్మలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి సహకారం అందిస్తోంది. ఏపీ ప్రాథమిక పాఠశాలల్లో బోధన పరికరాలు కొండపల్లి కళాకృతులే. నేను హార్టికల్చర్ విద్యార్థిని కావడంతో నాకు తెలిసిన సైన్స్‌ని హస్తకళల రంగానికి మేళవిస్తున్నాను. హస్తకళల రంగంలో విశేషమైన కృషి చేస్తున్న ఉజ్రమ్మ, సురయ్యా హసన్బోస్, జగదరాజప్పలు నాకు గురువులు. నా ఆకాంక్షలు, చిత్ర ఆలోచనలు ఒకే తీరుగా సాగడంతో మా ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. – సుధారాణి ముళ్లపూడి, సీఈవో, అభిహార సోషల్ ఎంటర్ప్రైజ్ – వాకా మంజులారెడ్డి -
‘బొమ్మ’కు బాసట
సాక్షి ప్రతినిధి విజయవాడ : కొండపల్లి బొమ్మల పరిశ్రమకు పూర్వ వైభవం తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బొమ్మల తయారీకి అవసరమయ్యే కలపనిచ్చే చెట్ల పెంపకానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అటవీశాఖ అధికారులు, బొమ్మల తయారీదారులతో ఇటీవల సమావేశమై పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. బొమ్మల తయారీకి అవసరమైన కలప గతంలో అందుబాటులో ఉండేదని, ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన వీరులపాడు, ఎ.కొండూరు అటవీ ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నట్టు బొమ్మల తయారీదారులు తెలిపారు. ఈ చెట్లు అంతరించిపోతున్నాయని, బొమ్మలు తయారు చేసే కళాకారుల సంఖ్యా తగ్గిపోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చెట్ల పెంపకానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి, ఉపాధి హామీ పథకం కింద మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తెల్లపొని చెట్లతో కలప బ్యాంకు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పరిశ్రమను ప్రోత్సహించేలా యువతకు శిక్షణ సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. అలా వచ్చి.. ఇలా! కొండపల్లి ఖిల్లా రాజభవనాల నిర్మాణంలో డిజైన్లు(నక్సే) చేసేందుకు 400 ఏళ్ల కిందట రాజస్థాన్ నుంచి వచ్చిన హస్తకళాకారులు.. రాజుల కాలం అంతరించాక బొమ్మల తయారీ పరిశ్రమను జీవనోపాధిగా ఎంచుకుని ఇక్కడే స్థిరపడ్డారు. కొండపల్లి అడవుల్లో లభించే తెల్లపొని చెట్ల నుంచి లభించే చెక్కతో బొమ్మల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారి శిక్షణలో స్థానికులు సైతం పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. బొమ్మల తయారీ, ఉత్పత్తుల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన పరిశ్రమ.. నేడు కలప కొరతతో కొంత నిరాదరణకు గురైంది. గతంలో మొత్తం బొమ్మల పరిశ్రమ కుటుంబాలు 250 ఉండగా.. ప్రస్తుతం 45 కుటుంబాలు మాత్రమే బొమ్మలను తయారు చేస్తున్నాయి. మళ్లీ పూర్వ వైభవం దిశగా.. డిమాండ్ ఉన్న బొమ్మలను మనసుకు హత్తుకునేలా వివిధ ఆకృతుల్లో మలిచి రంగులద్ది.. అమ్మకాలకు ఉంచుతారు. ఎడ్లబండి, కల్లుగీత తాటిచెట్టు, దశావతారాలు, ఏనుగు అంబారీ, ఆవుదూడ, గంగిరెద్దు, అర్జునుడి రథం, తాటిచెట్టు బొమ్మలను అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దడంతో పాటు.. దేవతామూర్తుల బొమ్మలను జీవం ఉట్టిపడేలా తయారు చేస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి కుటీర పరిశ్రమలా పనిచేసి ఈ బొమ్మలను తయారు చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మన్‌కీబాత్‌లో కొండపల్లి బొమ్మల పరిశ్రమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని ప్రస్తావించడం, ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి’ ప«థకంలో అంతర్జాతీయ ఆన్లైన్ మార్కెటింగ్‌కు రాష్ట్ర పరిశ్రమ శాఖ సన్నాహాలు చేస్తుండటంతో కొండపల్లి బొమ్మల పరిశ్రమకు పూర్వవైభవం వస్తుందని బొమ్మల తయారీదారులు ఆశిస్తున్నారు. మళ్లీ మంచిరోజులు.. బొమ్మల పరిశ్రమ అభివృద్ధికి వన సంరక్షణ సమితులు ద్వారా తెల్లపొని వనాలు పెంచాలి. నైపుణ్యం కోసం శిక్షణ కేంద్రాన్ని కూడా నెలకొల్పితే బాగుంటుంది. ప్రభుత్వం తెల్లపొని కలపను సబ్సిడీపై అందించడంతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలో ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కలెక్టర్ తీసుకుంటున్న చొరవతో పరిశ్రమకు మంచిరోజులొస్తాయన్న నమ్మకం ఉంది. – కె.వెంకటాచారి, బొమ్మల కళాకారుడు -
కొండపల్లి బొమ్మ.. తరతరాల జ్ఞాపకం
‘కొండపల్లి కొయ్యబొమ్మ... కోటగట్టి కూచుందమ్మ...’ అని పాడుకోవడానికే కాదు.. కొండపల్లి బొమ్మ పాటకు తగ్గట్టే తరతరాలకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది కూడా. అమ్మకు చిన్నప్పుడు తిరునాళ్లలో తాతయ్య కొనిచ్చిన ‘అమ్మాయి– అబ్బాయి’ బొమ్మ ఉంటుంది. అన్నయ్య కొనిపించుకున్న ఎడ్లబండి అదే షెల్ఫ్‌లో చోటు చేసుకుంటుంది. నానమ్మ ముచ్చటపడి తెచ్చుకున్న దశావతారాల బొమ్మ ఉండనే ఉంటుంది. కొండపల్లి బొమ్మ ఒకసారి ఇంట్లో షోకేస్‌లోకి వచ్చిందంటే ఇక తరాలు మారినా ఆ బొమ్మ చెక్కు చెదరదు. బొమ్మ చెక్కు చెదరదు... కానీ ఇటీవల బొమ్మలు చేసే వాళ్లు కనుమరుగైపోతున్నారు. వందలాది కుటుంబాలు ఈ కళను కొనసాగించలేక ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయాయి. ఈ దశలో కళను బతికించుకోవడానికి, కళతోనే తమ బతుకును నిర్మించుకోవడానికి ముందుకు వచ్చారు మహిళలు. బావుదరి పట్టారు! నలభై ఏళ్ల కిందట కొండపల్లి కళాకారుల చేతిలో 84 రకాల కళాఖండాలు రూపుదిద్దుకునేవి. ఇప్పుడా సంఖ్య ఐదారుకు మించడం లేదు. ఈ కళ మీద ఆధారపడి ఉపాధి పొందే పరిస్థితులు సన్నగిల్లడంతో ఈ తరం యువకులు ఎవరూ ముందుకు రావడం లేదు. కళ అంతరించిపోవడానికి ఎంతోకాలం పట్టదనే పరిస్థితి పదేళ్ల కిందటే మొదలైంది. ఈ దశలో మహిళలు ముందుకు వచ్చారు. ఇంతవరకు మగవాళ్లు బొమ్మలు చేస్తుంటే, మహిళలు ఆ బొమ్మలకు రంగులు వేయడం, ప్యాకింగ్ వంటి సహాయక బాధ్యతలకే పరిమితమయ్యారు. ఇప్పుడు మహిళలే కలప కొట్టడం, రంపంతో కోసి చిన్న దిమ్మలు చేయడం, ఆ దిమ్మలను కుంపటి మీద ఆరబెట్టడం నుంచి బొమ్మను చెక్కి రంగులు వేయడం వరకు అన్ని పనులూ చేస్తున్నారు. ‘ఈ బొమ్మల తయారీలో ఉపయోగించే మెటీరియల్ మొత్తం సహజమైనదే. చెట్ల బెరళ్లు, కాయల పై తొక్కలు, గింజల పొడులతో రంగులు తయారు చేస్తారు. ఈ కలప మెత్తగా ఉంటుంది. కాబట్టి పిల్లలు నోట్లో పెట్టుకున్నా, ఒకరి మీద ఒకరు విసురుకున్నా అంతగా దెబ్బ తగలదు. కాబట్టి స్కూల్ కిట్ల కోసం ప్రైవేట్ స్కూళ్ల నుంచి కూడా మంచి డిమాండ్ రావచ్చ’ని ఆశాభావం వ్యక్తం చేశారు అభిహార స్వచ్ఛంద సంస్థ నిర్వహకురాలు సుధారాణి. అంతర్జాతీయ వేదికల మీద మన కొండపల్లి బొమ్మలు కనిపించాలనేది ఆమె ఆకాంక్ష. ఇన్నాళ్లూ బావుదరికి దూరంగా ఉన్న మహిళలు ఇప్పుడు తమ కెరీర్‌ని స్వయంగా చెక్కుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల దృష్టి కార్లలో వేళ్లాడే నారింజ రంగు హనుమాన్ బొమ్మ మీద పడింది. కొండపల్లి హనుమాన్ రూపకల్పనలో మునిగిపోయారు. కార్లలో షోపీస్‌లుగా కొండపల్లి బొమ్మలు కనిపించే రోజు ఎంతో దూరం ఉండకపోవచ్చు. ఇప్పుడు మేమే చెక్కుతున్నాం! నేను ముప్పై ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు అన్ని పనులూ నేర్చుకున్నాను. కలపను ముక్కలు చేయడం, ఆరబెట్టడం వంటివి పది బొమ్మలకు సరిపడిన మెటీరియల్ ఒకేసారి సిద్ధం చేసుకుంటాం. ఆకారాలు చెక్కడం రెండు రోజుల్లో పూర్తవుతుంది. ఈ బొమ్మల్లో మనిషి దేహం చెక్కేటప్పుడు పాదాల నుంచి తల వరకు ఒకే ముక్కలో చెక్కుతాం. చేతులను విడిగా చెక్కి అతికిస్తాం. ఆ తర్వాత తల మీద కిరీటం వంటి అలంకరణ చేసి రంగులు వేస్తాం. అడుగు ఎత్తున్న బొమ్మల జత ధర నాలుగు నుంచి ఆరువేలవుతుంది. మొదట్లో మేము లేపాక్షి హస్తకళల ఎంపోరియమ్‌కి ఇచ్చేవాళ్లం. ఇప్పుడు అభిహార సంస్థ వాళ్లు మాకు మరికొన్ని కొత్త వస్తువులు చేయడంలో కూడా శిక్షణ ఇస్తున్నారు. మేము చేసిన బొమ్మలను మార్కెట్ చేయడానికి వాళ్లకే ఇస్తున్నాం. ఇప్పుడు రోజూ పని ఉంటోంది. కొండపల్లి బొమ్మ చేయడానికి తెల్ల పొణికి చెక్క వాడతాం. ఎన్నేళ్లయినా ఈ చెక్కలో పగుళ్లు రావు. అందుకే బొమ్మలు కలకాలం అంత అందంగా ఉంటాయి. – చందూరి స్వరాజ్యం, కొండపల్లి బొమ్మల కళాకారిణి ‘చెక్క’ని విప్లవం కొండపల్లి బొమ్మల తయారీలో మహిళల శ్రమ చిన్నది కాదు. కానీ ఆ శ్రమ ప్రధాన బొమ్మ తయారీ కాకపోవడంతో వాళ్లకు ఆర్టిజాన్ గుర్తింపు కార్డు వచ్చేది కాదు. నాలుగు నెలల శిక్షణలో ఇప్పుడు మహిళలు ఎవరి సహాయమూ లేకుండా స్వయంగా బొమ్మ చేయగలుగుతున్నారు. ఇప్పుడు మహిళలు కూడా హక్కుగా ఆర్టిజాన్ కార్డు పొందవచ్చు. ఇప్పటి వరకు మహిళలకు కళాకారులుగా గుర్తింపు లేకపోవడంతో కళాఖండాల ప్రదర్శన, కళాకారుల అవార్డుల విషయంలో మహిళలు కనిపించేవాళ్లు కాదు. ఇప్పుడు ఈ మహిళలు ఆ పరిధిని చెరిపివేశారు. – సుధారాణి, అభిహార సంస్థ నిర్వహకురాలు బొమ్మల బడి! కొండపల్లి బొమ్మలు చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఈ కళాకారుల చేతిలో చెక్క చక్కని బొమ్మగా ఎంత లాలిత్యంగా రూపుదిద్దుకుంటుందో వర్ణించడం సాధ్యం కాదు. ఇంత గొప్ప కళ అంతరించిపోతుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఆ కళ తరతరాలకు అందాలి, ఈ కళాకారులు సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలి. అందుకే మాకు వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెడుతున్నాం. స్కూల్ కిట్‌కు ఐడియా ఇచ్చాం. ఆ కిట్‌లో తెలుగు, ఇంగ్లిష్ అక్షరమాల ఉంటాయి. అలాగే పిల్లలు లాయర్, టీచర్, డాక్టర్, రైతు, జాలరి వంటి వృత్తులను తెలుసుకోవడానికి వీలుగా ఆ బొమ్మలు చేయించాం. ఆఫీస్‌లో ఉపయోగించే ట్రే, పెన్ స్టాండ్, ఇళ్లలో ఉపయోగించే వస్తువులను కూడా ఈ మెటీరియల్‌తో చేయవచ్చు. ఇలాంటి మార్పును స్వాగతిస్తే కళాకారులకు చేతినిండా పని ఉంటుంది. ఈ కళాకారుల కోసం బీటూబీ మీటింగ్ వంటి మార్కెట్ వేదికల గురించి ఆలోచిస్తున్నాం. – విజయశారదారెడ్డి, వైస్ చైర్పర్సన్, ఏపీఎస్‌ఈఆర్‌ఎమ్‌సీ కొండపల్లి కృష్ణుడు నేను చేసిన తొలి బొమ్మ గోపికల మధ్య కృష్ణుడు. బావుదరి మీద పట్టు రావడానికి నెల రోజులు పట్టింది. అది వస్తే ఇక బొమ్మలు చేయడం ఏ మాత్రం కష్టం కాదు. మా బ్యాచ్ ట్రైనింగ్ పూర్తి కావస్తోంది. తర్వాత బ్యాచ్‌కి మరో పది మంది సిద్ధంగా ఉన్నారు. – పద్మావతి వెన్నవల్లి, శిక్షణలో ఉన్న విద్యార్థి – వాకా మంజులారెడ్డి ఫొటోలు : ఎ. బాబు, సాక్షి, ఇబ్రహీంపట్నం -
కళల కాణాచి.. జీవమై మెరిసి
సాక్షి, అమరావతి: కొండపల్లి అడవిలో లభించే తెల్ల పొనుకు చెట్ల నుంచి సేకరించిన చెక్కతో కొండపల్లి హస్త కళాకారులు తయారు చేసే ఎడ్లబండి, కల్లుగీత తాటి చెట్టు, ఏనుగు అంబారీ, దశావతారాలు, అర్జునుడి రథం, దేవతామూర్తుల బొమ్మలు దేశవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందాయి. టేకు చెక్కతో అత్యంత నైపుణ్యంతో చేసే కలంకారీ అచ్చులకు ఉన్న ప్రత్యేకత అంతాఇంతా కాదు. చీరలు, దుప్పట్లు, లుంగీలు, చొక్కాలు, బ్లౌజులపై ఈ అచ్చుల సాయంతో అద్దే డిజైన్లకు మంచి క్రేజ్ ఉంది. విదేశాల నుంచి సైతం ప్రత్యేకంగా ఆర్డర్‌పై కలంకారీ అచ్చులను తయారు చేయించుకుని వెళ్తుండటంతో వీటికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. కొండపల్లి బొమ్మ.. అనంతపురం తోలుబొమ్మ.. గుంటూరు రాతి శిల్పాలు.. పెడన కలంకారీ.. చిలకలపూడి రోల్డ్ గోల్డ్ నగలు.. నరసాపురం లేసు అల్లికలు వంటి ఎన్నో హస్త కళలు మన సొంతం. జగమంతా మోగిన బొబ్బిలి వీణ.. కొండపల్లి కొయ్య బొమ్మ.. ఏటికొప్పాక లక్క బొమ్మలు.. గోదావరి తీరంలో అల్లే లేసులు.. ఏలూరు ఎర్ర తివాచీలు.. పుత్తడిని తలదన్నే బుడితి ఇత్తడి సామానులు.. ఆళ్లగడ్డ, దుర్గి శిల్పాలు.. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో చెక్కలపై చెక్కే అందాలు మన ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన వార సత్వ హస్త కళా సంపద. వీటిలో ఏ కళ వైపు చూసినా వాటికి పురుడు పోసే హస్తకళాకారుల చేతులు చమత్కారం చేస్తుంటాయి. భళా.. హస్తకళ అనిపించుకుంటాయి. 2 లక్షల కుటుంబాలకు హస్తకళలే ఆధారం రాష్ట్రంలో హస్త కళలపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో ఒక్కో హస్తకళ ప్రత్యేకతను సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షలకు పైగా కుటుంబాలు హస్తకళలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంత మహిళలు సూది, దారాలతో అలవోకగా అల్లే లేసులు, ఏలూరులో తివాచీల తయారీపై ఆధారపడి అత్యధికంగా లక్ష మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. ఆ తరువాత కృష్ణా జిల్లాలోని పెడన కలంకారీ అచ్చుల తయారీ, బం దరులోని చిలకలపూడి బంగారం, కొండపల్లి కొయ్య బొమ్మల తయారీపై ఉపాధి పొందుతున్న వారి సంఖ్య రెండో స్థానంలో ఉంది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు ప్రాంతంలో లేసు అల్లికలు, రామచంద్రపురం తాటి ఆకుల కళాఖండాలు, చిత్తూరులో చెక్క కళాకృతులను బతికిస్తున్న హస్త కళాకారుల సంఖ్య మూడో స్థానంలో ఉంది. కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన ఇతడి పేరు కె.వెంకటాచారి. 35ఏళ్లుగా కొయ్య బొమ్మల తయారీలో నిమగ్నమయ్యాడు. ఈ కళనే జీవనోపాధిగా మలుచుకున్న వెంకటాచారి తన ఇద్దరు కొడుకుల్ని బాగా చదివించి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేశాడు. ఇటీవల ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డును ఇచ్చి గౌరవించింది. ఇటీవల ‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ సైతం కొండపల్లి బొమ్మల తయారీని ప్రస్తావించడంతో వెంకటాచారి పులకించిపోతున్నాడు. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన పెడన కలంకారీ అచ్చుల తయారీలో 40ఏళ్లుగా సేవలందిస్తున్నఈయన పేరు కొండ్రు గంగాధర్. కృష్ణా జిల్లా పెడనకు చెందిన గంగాధర్ కుటుంబం మొత్తం ఇదే కళపై ఆధారపడి జీవిస్తోంది. ఎంతో మందికి కలంకారీ అచ్చుల తయారీలో శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించిన గంగాధర్‌ను కేంద్ర ప్రభుత్వం 2002లో రాష్ట్రపతి పురస్కారంతో సత్కరించింది. గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘శిల్పగురు’ అవార్డు ఇంకా అందుకోవాల్సి ఉందని గంగాధర్ గర్వంగా చెబుతున్నాడు. కళల కాణాచిగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో ఎందరో కళాకారులు హస్త కళలనే నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నారు. తాము బతుకుతూ హస్త కళలను బతికిస్తున్నారు. తాతల కాలం నుంచీ చేస్తున్నాం మా తాతల కాలం నుంచి చిలకలపూడిలో రోల్డ్ గోల్డ్ ఆభరణాలు (ఇమిటేషన్ నగలు) తయారు చేస్తున్నాం. నేను మా నాన్న దగ్గర రోల్డ్‌గోల్డ్ నగల తయారీ నేర్చుకుని ఇదే పనిలో స్థిరపడ్డాను. మా ఇద్దరు పిల్లల చదువులు పూర్తయ్యాక వారితో రోల్డ్ గోల్డ్ నగల వ్యాపారం పెట్టించాను. ఈ వృత్తిని నమ్ముకున్న మాకు ఎలాంటి కష్టం లేదు. మచిలీపట్నంలో దాదాపు 3 వేల కుటుంబాలు రోల్డ్ గోల్డ్ నగల తయారీపై ఆధారపడి బతుకుతున్నాయి. – పెద్దేటి పాండురంగారావు, రోల్డ్ గోల్డ్ ఆభరణాల తయారీదారు, మచిలీపట్నం అమ్మ నుంచి నేర్చుకున్నా మా అమ్మ చంద్రమ్మ నుంచి లేసులు అల్లడం నేర్చుకున్నాను. ఈ కళే నాకు ఉపాధిగా మారింది. పెళ్లయి అత్తారింటికి వచ్చినా అదే వ్యాపకాన్ని కొనసాగిస్తున్నాను. లేసు అల్లికల ద్వారా నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వస్తాయి. వేడి నీళ్లకు చన్నీళ్ల సాయం మాదిరిగా నా కుటుంబానికి ఉపయోగపడుతున్నాయి. మా ప్రాంతంలో లేసు అల్లికలపై దాదాపు 15 వేల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. – పులపర్తి మహాలక్ష్మి, అధ్యక్షురాలు, నరసాపురం లేసు పార్కు, పశ్చిమగోదావరి జిల్లా -
అమెరికాకు బార్బీ అయితే...ఇండియాకి ‘కియా’..!
ఘనమైన చరిత్ర, సంస్కృతికి నెలవైన భారతదేశంలో, 120 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో మనకంటూ ఒక బొమ్మ లేకపోవడం ఏంటి? అందుకే ఈ ప్రయత్నం అంటున్నారు హిమ శైలజ. ఆమె నిన్న (గురువారం) ఇండియన్గాళ్ కియాను మార్కెట్లోకి విడుదల చేశారు. విజయవాడలో పుట్టి పెరిగిన హిమశైలజ కొండపల్లి బొమ్మలకు చీరకట్టి, పూలు పెట్టి మురిసిపోయేది. స్కూలు అయిపోయాక పాలిటెక్నిక్‌లో చేరారు. ఆ తర్వాత ముంబయిలో బి.టెక్ ఎలక్ట్రానిక్స్ చేశారు. 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకుని భర్తతోపాటు యు.కెకి వెళ్లిపోయారు. భారతీయతను ప్రతిబింబించేటట్లు ఓ బొమ్మను చేయాలనే ఓ కొత్త ఆలోచనకు బీజం పడింది 2003లో! అప్పుడు దుబాయ్ ఎయిర్‌పోర్టులో బార్బీ డాల్ డ్రెస్సింగ్ పోటీ జరుగుతోంది. ఆ పోటీలో శైలజ కూడా పాల్గొన్నారు. బార్బీ డాల్ అంటే నిలువెత్తు అమెరికా అమ్మాయికి ప్రతిరూపం. ఈ అమెరికా బొమ్మ భారతీయుల ఇళ్లలో గొప్ప స్థానాన్నే దక్కించుకుంది. బార్బీ బొమ్మకు భారతీయతను ఆపాదిస్తూ మన దుస్తులు, ఆభరణాలు పెట్టి మురిసిపోవడంకంటే మన రూపలావణ్యాలతో ఓ బొమ్మను ఎందుకు రూపొందించకూడదు... అనుకున్నారామె. ‘‘అనుకోవడం అయితే అనుకున్నాను. కానీ దానిని ఆచరణలోకి తీసుకురావడానికి పదేళ్లు పట్టింది. 2009లో ఇండియాకి వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్‌లో కోర్సు చేసి బొటీక్ పెట్టాను. అది స్మూత్‌గా నడుస్తోంది. నాలో మళ్లీ ఆలోచనలు చుట్టుముట్టాయి. దాంతో రంగంలో దిగాను’’ అన్నారు. ఒక్కో పొరపాటు ఒక్కో పాఠం... శైలజ మనసులో ఉన్న ఆకారానికి కాగితం మీద ఓ రూపాన్ని తీసుకురావడానికి రెండు నెలలు పట్టింది. అనుకున్న రూపం వచ్చిన తర్వాత దాని తయారీ మరో సవాల్ అయింది. దాంతో చైనా పరిశ్రమల సహకారం తీసుకున్నారామె. నెలల కొద్దీ చేసిన ఈ ప్రయత్నంలో ఒక్కొక్క పొరపాటు ఒక్కో పాఠం అయ్యాయంటారామె. ‘‘కేరళ అమ్మాయి బొమ్మలో దుస్తులు ఎలా ఉండాలి, కేరళ అమ్మాయి ఎలాంటి ఆభరణాలు ధరిస్తుంది, అలాగే రాష్ట్రాల వారీగా దుస్తులు, ఆభరణాలు మారిపోవడం, సందర్భానుసారంగా అలంకరణ వంటివన్నీ చెప్పాల్సిందే. పాదాలకుపెట్టే పట్టీల గురించి చెప్పడం మర్చిపోయినా సరే... పొంతన లేని అలంకరణతో బొమ్మ తయారైపోతుది. ఇన్ని ఒడుదొడుకుల తర్వాత ఈ రూపాన్ని తెచ్చుకోగలిగాను. ఇంకా హెయిర్స్టయిల్స్లో మార్పులు చేస్తాను’’ అని చెప్పారు. తొలి ప్రశ్న కొడుకు నుంచే! ‘‘బార్బీ ఉందిగా. మరో బొమ్మ ఎందుకు? అన్నాడు మా తన్మయ్. ముందు వాడికి వివరించాల్సి వచ్చింది. తమ నేటివిటీతో ఉన్న వాటినే పిల్లలు ఇష్టపడతారు. అమెరికాలో బార్బీ, చైనాలో సారా, కొరియాలో పుల్లిప్ ఇరాన్ బొమ్మ పుల్లా, ఇండియాకి కియా... అని చెప్పాను. కియాను చూసి ‘ఇండియా అమ్మాయిలు ఇష్టపడతారు అన్నాడు. అదే నాకు పెద్ద ప్రశంస’’ అన్నారామె. ’కియా’ అంటే! కియా అనేది సంస్కృత పదం. పక్షి కూత అని అర్థం. ‘‘మన భాషలకు మూలం సంస్కృతం కాబట్టి నా బొమ్మకు పేరు ఆ భాష నుంచే తీసుకోవాలనుకున్నాను. అలాగే పేరు ఏ మతానికీ చెందకుండా విశ్వవేదికగా ఉండాలనే ఉద్దేశంతో పక్షి అరుపును తీసుకున్నాను. బొమ్మలతోపాటు పవర్ ఆఫ్ ట్రూత్ అనే నీతికథ, ఇంకా చరిత్ర, సంస్కృతిని తెలిపే కథలు సిద్ధం చేశాను. కియా బొమ్మ ధర, లభ్యత అన్ని వర్గాలకూ అనుకూలంగా ఉండేటట్లు ప్రణాళిక సిద్ధం అవుతోంది ’’ అన్నారు శైలజ. ప్రపంచదేశాల ముందు మన రూపాన్ని, మన చరిత్రనూ, సంస్కృతినీ నిలబెట్టడానికి తొలి ప్రయత్నం చేశారామె. అది సఫలం కావాలని ఆశిద్దాం. భారతీయత కోసమే తన తపన తన బిడ్డ ఇండియాలోనే పుట్టాలని పట్టుపట్టి మరీ డెలివరీకి ఇండియాకి వచ్చింది శైలజ. ప్రపంచంలోని అన్ని దేశాలకూ మన దేశం గురించి తెలియచేయాలనుకుంటుంది. ‘కియా’ రూపొందించే ప్రయత్నంలో శైలజ రెండేళ్లపాటు పడిన శ్రమను చూశాను. ఇప్పుడు తన ఆనందాన్ని చూస్తున్నాను. తండ్రిగా నాకు సంతోషంగా ఉంది. - సుబ్రమణ్యేశ్వర శర్మ, శైలజ తండ్రి