అమెరికాకు బార్బీ అయితే...ఇండియాకి ‘కియా’..! | Indian girl Kia released | Sakshi
Sakshi News home page

అమెరికాకు బార్బీ అయితే...ఇండియాకి ‘కియా’..!

Published Thu, Sep 11 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM

అమెరికాకు బార్బీ అయితే...ఇండియాకి ‘కియా’..!

అమెరికాకు బార్బీ అయితే...ఇండియాకి ‘కియా’..!

ఘనమైన చరిత్ర, సంస్కృతికి నెలవైన భారతదేశంలో, 120 కోట్ల మంది ఉన్న ఈ  దేశంలో మనకంటూ ఒక బొమ్మ లేకపోవడం ఏంటి? అందుకే ఈ ప్రయత్నం అంటున్నారు హిమ శైలజ. ఆమె నిన్న (గురువారం) ఇండియన్‌గాళ్ కియాను మార్కెట్‌లోకి విడుదల చేశారు.  విజయవాడలో పుట్టి పెరిగిన హిమశైలజ కొండపల్లి బొమ్మలకు చీరకట్టి, పూలు పెట్టి మురిసిపోయేది. స్కూలు అయిపోయాక పాలిటెక్నిక్‌లో చేరారు. ఆ తర్వాత ముంబయిలో బి.టెక్ ఎలక్ట్రానిక్స్ చేశారు. 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకుని భర్తతోపాటు యు.కెకి వెళ్లిపోయారు.
 
భారతీయతను ప్రతిబింబించేటట్లు ఓ బొమ్మను చేయాలనే ఓ కొత్త ఆలోచనకు బీజం పడింది 2003లో! అప్పుడు దుబాయ్ ఎయిర్‌పోర్టులో బార్బీ డాల్ డ్రెస్సింగ్ పోటీ జరుగుతోంది. ఆ పోటీలో శైలజ కూడా పాల్గొన్నారు. బార్బీ డాల్ అంటే నిలువెత్తు అమెరికా అమ్మాయికి ప్రతిరూపం. ఈ అమెరికా బొమ్మ భారతీయుల ఇళ్లలో గొప్ప స్థానాన్నే దక్కించుకుంది. బార్బీ బొమ్మకు భారతీయతను ఆపాదిస్తూ మన దుస్తులు, ఆభరణాలు పెట్టి మురిసిపోవడంకంటే మన రూపలావణ్యాలతో ఓ బొమ్మను ఎందుకు రూపొందించకూడదు... అనుకున్నారామె. ‘‘అనుకోవడం అయితే అనుకున్నాను. కానీ దానిని ఆచరణలోకి తీసుకురావడానికి పదేళ్లు పట్టింది. 2009లో ఇండియాకి వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్‌లో కోర్సు చేసి బొటీక్ పెట్టాను. అది స్మూత్‌గా నడుస్తోంది. నాలో మళ్లీ ఆలోచనలు చుట్టుముట్టాయి. దాంతో రంగంలో దిగాను’’ అన్నారు.
 
ఒక్కో పొరపాటు ఒక్కో పాఠం...
శైలజ మనసులో ఉన్న ఆకారానికి కాగితం మీద ఓ రూపాన్ని తీసుకురావడానికి రెండు నెలలు పట్టింది. అనుకున్న రూపం వచ్చిన తర్వాత దాని తయారీ మరో సవాల్ అయింది. దాంతో చైనా పరిశ్రమల సహకారం తీసుకున్నారామె. నెలల కొద్దీ చేసిన ఈ ప్రయత్నంలో ఒక్కొక్క పొరపాటు ఒక్కో పాఠం అయ్యాయంటారామె. ‘‘కేరళ అమ్మాయి బొమ్మలో దుస్తులు ఎలా ఉండాలి, కేరళ అమ్మాయి ఎలాంటి ఆభరణాలు ధరిస్తుంది, అలాగే రాష్ట్రాల వారీగా దుస్తులు, ఆభరణాలు మారిపోవడం, సందర్భానుసారంగా అలంకరణ వంటివన్నీ చెప్పాల్సిందే. పాదాలకుపెట్టే పట్టీల గురించి చెప్పడం మర్చిపోయినా సరే... పొంతన లేని అలంకరణతో బొమ్మ తయారైపోతుది. ఇన్ని ఒడుదొడుకుల తర్వాత ఈ రూపాన్ని తెచ్చుకోగలిగాను. ఇంకా హెయిర్‌స్టయిల్స్‌లో మార్పులు చేస్తాను’’ అని చెప్పారు.
 
 తొలి ప్రశ్న కొడుకు నుంచే!
 ‘‘బార్బీ ఉందిగా. మరో బొమ్మ ఎందుకు? అన్నాడు మా తన్మయ్. ముందు వాడికి వివరించాల్సి వచ్చింది. తమ నేటివిటీతో ఉన్న వాటినే పిల్లలు ఇష్టపడతారు. అమెరికాలో బార్బీ, చైనాలో సారా, కొరియాలో పుల్లిప్ ఇరాన్ బొమ్మ పుల్లా, ఇండియాకి కియా... అని చెప్పాను. కియాను చూసి ‘ఇండియా అమ్మాయిలు ఇష్టపడతారు అన్నాడు. అదే నాకు పెద్ద ప్రశంస’’ అన్నారామె.
 
’కియా’ అంటే!
కియా అనేది సంస్కృత పదం. పక్షి కూత అని అర్థం. ‘‘మన భాషలకు మూలం సంస్కృతం కాబట్టి నా బొమ్మకు పేరు ఆ భాష నుంచే తీసుకోవాలనుకున్నాను. అలాగే పేరు ఏ మతానికీ చెందకుండా విశ్వవేదికగా ఉండాలనే ఉద్దేశంతో పక్షి అరుపును తీసుకున్నాను. బొమ్మలతోపాటు  పవర్ ఆఫ్ ట్రూత్ అనే నీతికథ, ఇంకా చరిత్ర, సంస్కృతిని తెలిపే కథలు సిద్ధం చేశాను. కియా బొమ్మ ధర, లభ్యత అన్ని వర్గాలకూ అనుకూలంగా ఉండేటట్లు ప్రణాళిక సిద్ధం అవుతోంది ’’ అన్నారు శైలజ. ప్రపంచదేశాల ముందు మన రూపాన్ని, మన చరిత్రనూ, సంస్కృతినీ నిలబెట్టడానికి తొలి ప్రయత్నం చేశారామె. అది సఫలం కావాలని ఆశిద్దాం.
 
భారతీయత కోసమే తన తపన
తన బిడ్డ ఇండియాలోనే పుట్టాలని పట్టుపట్టి మరీ డెలివరీకి ఇండియాకి వచ్చింది శైలజ. ప్రపంచంలోని అన్ని దేశాలకూ మన దేశం గురించి తెలియచేయాలనుకుంటుంది. ‘కియా’ రూపొందించే ప్రయత్నంలో శైలజ రెండేళ్లపాటు పడిన శ్రమను చూశాను. ఇప్పుడు తన ఆనందాన్ని చూస్తున్నాను. తండ్రిగా నాకు సంతోషంగా ఉంది.
- సుబ్రమణ్యేశ్వర శర్మ, శైలజ తండ్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement