కొండూరులో విషజ్వరాలు
కొండూరు (అచ్చంపేట): గ్రామం మంచం పట్టింది. విష జ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు. కొండూరు పంచాయతీ పరిధిలో రెండు గిరిజన తండాలు, నిండుజర్ల శివారు గ్రామం ఉంది. జనాభా 4 వేల మందికి పైగా జనాభా, 2600 మంది ఓటర్లు ఉన్నారు. వారం రోజులుగా గ్రామం అంతా జ్వరాలతో తల్లడిల్లిపోతోంది. ప్రధానంగా బీసీ, ఎస్సీ కాలనీల్లో ఇంటికొకరు జ్వర పీడితులున్నారు. బీసీ కాలనీలో సుమారు 40 కుటుంబాల వారు జ్వరాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. అధ్వాన పారిశుద్ధ్యం కారణంగానే రోగాలు ప్రభలాయని బాధితులు చెప్పారు. ఇంత మంది జ్వరాలతో బాధపడుతున్నా ప్రభుత్వ వైద్యులు మాత్రం కన్నెత్తి కూడా చూడలేదని అంటున్నారు. మూడు కిలోమీటర్ల పరిధిలోని దొడ్లేరులో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడిపైనే ఆధారపడి చికిత్స పొందుతున్నారు. తాత్కాలికంగా తగ్గుతున్నా మరలా తిరగబెడుతోందని బాధితులు వాపోయారు. తమకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే చాలు.... కుటుంబంలోని మిగతా వారందరికీ వస్తుందని ఆవేదన చెందారు. సత్తెనపల్లి, గుంటూరు వంటి ప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటుంటే వేలాది రూపాయలు ఖర్చవుతోందని పేర్కొన్నారు. అచ్చంపేట పీహెచ్సీ సెంటర్ నుంచి గానీ, పెదపాలెం సబ్ సెంటర్ నుంచి గానీ ఏ ఒక్క వైద్యుడు తమ వద్దకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మెరుగైన వైద్యం కల్పించాలని కుంభా లక్ష్మణరావు, నాగరాజు తెలిపారు. ఇంట్లో తమ పిల్లలిద్దరూ జ్వరంతో బాధపడుతున్నారని, ఆర్ఎంపీతో చికిత్స చేయించినా తగ్గడం లేదని తెలిపారు. ఈ విషయంపై డాక్టర్ రమ్యను సాక్షి వివరణ అడగ్గా జన్మభూమి రోజు వైద్య శిబిరం ఏర్పాటుచేశామని, జ్వరాలు తగ్గేంత వరకు శిబిరం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అవసరమైన మందులు, వైద్య సిబ్బందిని నియమిస్తామన్నారు.