స్పీడు మీదున్న సోహైల్, వకీల్ సాబ్ బ్యూటీతో రెండో సినిమా
Bigg Boss Contestant Syed Sohel Ryan Second Movie Details: బిగ్‌బాస్ షోతో దశ తిరిగిపోయిన అతికొద్దిమందిలో సోహైల్ ఒకరు. బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్లో పాల్గొన్న సోహైల్ తన ప్రవర్తన, ఆటతీరుతో ప్రేక్షకులను కట్టిపటేశాడు. టైటిల్ గెలవలేకపోయినప్పటికీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. షో నుంచి బయటకు వచ్చాక మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నట్లు ప్రకటించాడు.
తాజాగా అతడి రెండో సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి 'బూట్ కట్ బాలరాజు' అని టైటిల్ ఫిక్స్ చేశారు. కోనేటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వకీల్‌సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్గా నటిస్తోంది. బెక్కం వేణుగోపాల్ నిర్మాగా వ్యవహరిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్‌నివ్వగా మిర్యాల రవీందర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనిల్ రావిపూడి మొదటి షాట్‌ను డైరెక్ట్ చేశాడు.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ``లాక్డౌన్ టైమ్‌లో రిలీజైన పాగల్ మూవీని ప్రేక్షకులు బాగా ఆదరించారు. థియేటర్, ఓటీటీ, శాటిలైట్ అన్ని ప్లాట్‌ఫామ్‌లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఉత్సాహంతోనే మా బ్యానర్లో అల్లూరి సినిమా రూపొందిస్తున్నాం. ఈ సినిమా విషయానికి వస్తే గత ఆరేడు నెలలుగా సోహైల్‌తో ఒక పాయింట్ అనుకుని దాన్ని ఒక కథగా మార్చి ఈ రోజు ఓపెనింగ్ జరిపాం. ఇలాంటి కథ సోహైల్‌కి కరెక్ట్. హుషారు తర్వాత ఆ తరహాలో మరో మంచి కథలో వస్తున్న సినిమా బూట్‌కట్ బాలరాజు. జనవరి, పిబ్రవరిలో వరుసగా షెడ్యూల్స్ జరిపి సినిమా పూర్తి చేస్తాం. తెలంగాణ క్యారెక్టరైజేషన్ కావడంతో తెలుగమ్మాయి కావాలని అనన్యని తీసుకున్నాం అన్నారు.
View this post on Instagram
A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official)
సోహెల్ మాట్లాడుతూ.. ``బిగ్‌బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత చేస్తున్న రెండో చిత్రమిది. దాదాపు తొమ్మిది నెలలు స్క్రిప్ట్ మీద వర్క్ చేశాం. మంచి స్క్రిప్ట్ కుదిరింది. డైలాగ్స్ చాలా బాగా వచ్చాయి. బూట్ కట్ బాలరాజు అనే క్యారెక్టర్ డెఫినెట్‌గా మీ అందరిలో ఉండిపోతుంది`` అన్నారు.
దర్శకుడు శ్రీ కోనేటి మాట్లాడుతూ - ``ఈ కథ ఇంతబాగా రావడానికి నా చిన్ననాటి మిత్రుడు గోపి కారణం. మేం ఇద్దరం కలిసి చాలా రోజుల క్రితమే సినిమా చేయాల్సింది. కాస్త ఆలస్యమైంది. బూట్‌కట్ బలరాజు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రెండు గంటలు హ్యాపీగా నవ్వుకునే సినిమా`` అన్నారు. ఈ సినిమాలో శ్రీమతి ఇంద్రజ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ఆనంద్ చక్రపాణి, ఝాన్సి, జబర్దస్త్ రోహిణి, మాస్టర్ రామ్ తేజస్ తదితరులు నటించనున్నారు.