చేపలు.. చేదు నిజాలు!
కొరమేను కోమలం సొరచేప శోభనం దొరసాని
బురదకొయ్యా.. అంటూ అమ్మాయిని
అభివర్ణించాడు ఒక సినీ కవి.
∙∙
ఒరేయ్ ఆడు బొమ్మిడాయిలా జారిపోతాడు.
జాగ్రత్తగా పట్టుకోండి.. అంటూ గ్రామీణ ప్రాంతాల్లో కూతకొచ్చిన కబడ్డీ ఆటగాడిని ఉద్దేశించి ప్రత్యర్ధి టీమ్ సభ్యులు అప్రమత్తమవుతుంటారు.
∙∙
ఏంట్రా మట్టగిడసలా కొట్టుకుంటున్నావ్ అంటూ
పల్లెల్లో స్నేహితుల మధ్య తగువులు వచ్చినప్పుడు
పరస్పరం హెచ్చరించుకుంటారు.
సాక్షి, అమరావతి:
... సరదాగా ఆటపట్టించినా.. కోపంతో హెచ్చరించినా.. ప్రేమతో పలకరించినా.. ఆట, మాట, పాటల్లో చేపల ప్రస్తావన వస్తుంటుంది. ఇది నాణేనికి ఓ వైపు. మరోవైపు.. పైన పేర్కొన్న కొరమేను, బొమ్మిడాయి, మట్టగిడసలతోపాటు గురక, ఇంగిలాయి, జెల్ల వంటి నల్లజాతి చేపల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లా కొల్లేరులోను ఒకప్పుడు కిలకలలాడిన ఈ చేపలు ప్రతికూల పరిస్థితులను ఈదలేక అంతరించే దశకు చేరుకోవడం బాధాకరం.
బొమ్మిడాయి బతకనంటోంది..
చేపల్లో బొమ్మిడాయి పులుసుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కాలువలు, ఏరులు, నదుల్లో బాగా లభ్యమయ్యేవి. గోదావరి జిల్లాల వాసులు బొమ్మిడాయి కూరతో రాజకీయ నాయకులు, అధికారులతో ఏ పని అయినా చేయించుకునే వారని చెబుతారు. అటువంటి బొమ్మిడాయి ఇప్పుడు అరకొరగా దొరకుతుండడంతో మార్కెట్లో ఖరీదైన చేపల జాబితాలో చేరిపోయింది. ఒకప్పుడు సామాన్యుడి కూరకు దొరికిన ఈ చేప ఇప్పుడు ప్రముఖ హోటళ్లలో ప్రత్యేక వంటకంగా మారిపోయింది.
గురకకు గడ్డుకాలమే..
పల్లెటూరులోని కాలువలు, పంటబోదెల్లో ఒకప్పుడు గుట్టలుగుట్టలుగా దొరికిన గురకలు ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ముళ్లులాంటి పొలుసు, ప్రత్యేక శరీర నిర్మాణంతో ఉండే గురకలు వర్షాకాలం వస్తే నీటిలోని మొక్కలపైకి కూడా ఎగబాకగలవు. నారుమడుల్లోనూ ఇవి బాగా దొరికేవి. కూలి పనులకు వెళ్లిన పేదలు దోసిళ్లతో గురకలను పట్టుకుని క్యారేజీల్లో ఇంటికి తెచ్చుకుని తినేవారు. పంటలకు రసాయన ఎరువుల వాడకం మితిమీరిపోవడంతో వీటి ఉనికి కూడా ఇప్పుడు ప్రశ్నార్ధకమవుతోంది.
కొరమేనుకు కష్టకాలం..
సహజ సిద్ధంగా పెరిగే నల్లజాతి చేపల్లో కొరమేను అంటే మాంసాహార ప్రియులకు చాలా మక్కువ. వీటిని తింటే గుండెకు మేలు జరగడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు సూచిస్తుంటారు. ఇప్పుడు ఆ కొరమేనుకు పెద్ద కష్టమొచ్చిపడింది. కాలువలు, సహజసిద్ధమైన చెరువుల్లో నీటి అడుగున బతికే కొరమేను చేపలు నీటి కాలుష్యం దెబ్బకు చనిపోతున్నాయి. కొరమేను జాతి చేపలు దాదాపు 90 శాతం అంతరించాయి. కేవలం 10 శాతం మాత్రమే మనుగడ కోసం పోరాటం చేస్తున్నాయి.
మరుగున పడుతున్న మార్పు
వాతావరణంలో వస్తున్న మార్పులతో మనుగడ సాగించలేక ‘మార్పు’ చేపలు కనుమరుగవుతున్నాయి. ఈ జాతి అంతరించే దశకు చేరడంతో దీనిని పరిరక్షించేందుకు శాస్త్రవేత్తలు ప్రాజెక్టును నెలకొల్పి కృషిచేస్తున్నారు. నోటి వద్ద పెద్ద మీసాలు ఉండే ఈ చేపలకు శరీరంలో ముళ్లు ఉండవు. రబ్బరు మాదిరిగా మెత్తగా ఉండే ఈ చేపలను మాంసాహారులు ఇష్టపడతారు. ఇవి వాగుల్లో ఎక్కువగా దొరుకుతాయి.
మట్టగిడస కొట్టుమిట్టాడుతోంది..
కొరమేనును పోలి ఉండే మట్టగిడసకు మంచి డిమాండ్ ఉండేది. కొరమేను కంటే కాస్త పొట్టిగా ఉంటుంది. మట్టగిడస పులుసును మాంసాహార ప్రియులు లొట్టలు వేసుకుని మరీ తింటారు. గతంలో నీటి వనరులు ఉన్న ప్రతీచోటా ఇవి విరివిగా దొరికేవి. ఇప్పుడు ఈ చేపలను కొని చెరువుల్లో పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇంగిలాయి ఈదలేనంటోంది..
కృష్ణా–పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించిన కొల్లేరులో ఇంగిలాయి రకం ఒకప్పుడు బాగా దొరికేది. ఈ చేపలు లేత పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. తలపై ఉండే ముల్లుతో తనను రక్షించుకుంటుంది. పట్టుకునే ప్రయత్నం చేసినా.. ఆహారంగా తినేందుకు పాములు ప్రయత్నించినా తలపై ఉన్న ముల్లుతో కుట్టి తప్పించుకుంటుంది. కోల్కత వంటి నగరాల్లో ఈ చేపల నుంచి ఔషధాలను తయారుచేస్తుంటారు. కొల్లేరులో మావులతో వీటిని వేటాడుతుంటారు. పరిశ్రమలు, డ్రెయిన్ల వ్యర్థాలు చేరడంతో కొల్లేరులో ఇవి కనుమరుగవుతున్నాయి.
భావితరాలకు అందించాలంటే..
సహజ సిద్ధంగా పెరిగి సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటున్న నల్లజాతి చేపలను భావితరాలకు అందించాలంటే వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం.. ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాల్సి ఉంది. అంతరించే దశకు చేరిన చేపల సంతతిని పెంపొందించేలా ప్రత్యేక హేచరీస్, ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలి. మత్స్య పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)ల పర్యవేక్షణలోని శాస్త్రవేత్తలను ఉపయోగించుకుని నల్లజాతి చేపల పరిరక్షణ, ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలి. అంతరించిపోతున్న చేపల మనుగడ కోసం జలకాలుష్యాన్ని నివారించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.
మత్స్య సంపదకు చేటు తెస్తున్నవి ఇవే..
ఒకనాడు స్వచ్ఛంగా ఉండే జలవనరులు ఇప్పుడు తీవ్ర కాలుష్యం బారిన పడుతున్నాయి..
పరిశ్రమల వ్యర్థాలు (మోలాసిస్)లను శుద్ధి చేయకుండా నేరుగా కాలువలు, డ్రెయిన్లలోకి వదిలేయడం..
విచ్చలవిడిగా తవ్విన చెరువుల్లో చేపలకు రసాయన మందులు, మేత, మృత కళేబరాలు వేస్తున్నారు. చెరువుల్లో రోజుల తరబడి అవి నిల్వ ఉండడంతో నీరు కలుషితమవుతోంది. ఆ నీటిని నేరుగా కాలువలు, డ్రెయిన్లలోకి వదిలేస్తున్నారు.
వరి చేలల్లో ఎరువులు, పురుగుమందులు చల్లి ఆ నీటిని నేరుగా కాలువల్లోకి వదిలేయడం.
వర్షాభావ పరిస్థితుల్లో సముద్రం నీరు డ్రెయిన్ల ద్వారా నేరుగా చొచ్చుకురావడంతో భూమిలో ఉప్పునీటి సాంద్రత పెరుగుతోంది. దీంతో మంచినీటి చెరువుల్లోను, కాలువల్లోను పెరిగే చేపలకు ప్రతికూల పరిస్థితి ఏర్పడుతోంది.