Korraminu
-
చేప ప్రసాదంగా కొల్లేరు కొర్రమీను
కైకలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కొల్లేరు కొర్రమీను పిల్లలు (సీడ్) ఆస్తమా నివారణలో ఔషధంగా మారాయి. మృగశిరకార్తె రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదానికి కొల్లేరు ప్రాంత కొర్రమీను పిల్లలను సరఫరా కానున్నాయి. తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కో–ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ (టీఎస్ ఎఫ్సీఓఎఫ్) ఆధ్వర్యంలో చేప మందు ప్రసాదం నిమిత్తం టెండర్లను ఆహా్వనించింది. దాదాపు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు కొర్రమీను పిల్ల అవసరమని గుర్తించారు. తెలంగాణ మత్స్యశాఖ అధికారులు కొర్రమీను సీడ్ అందించే సీడ్ ఫామ్‌లను పరిశీలించి నివేదికను అక్కడి ప్రభుత్వానికి అందించారు. తెలంగాణలో లభ్యత లేకపోవడంతో.. చేప ప్రసాదానికి తెలంగాణలో సరిపడినన్ని చేప పిల్లల లభ్యత లేకపోవడంతో ఏపీ నుంచి కొర్రమీను పిల్లలకు మే 21న టెండర్లు ఆహా్వనించింది. ఏపీ నుంచి కొల్లేరు ప్రాంతాలైన ఏలూరు జిల్లాలోని ముదినేపల్లి మండలం దేవపూడి ఫణిరామ్ ఫిష్ సీడ్ ఫామ్, ఏలూరుకు చెందిన దుర్గమల్లేశ్వర ఫిష్ హేచరీస్, కలిదిండి మండలం పోతుమర్రు, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు నుంచి దుర్గ ఫిష్ సీడ్ ఫామ్‌తో పాటు తెలంగాణలోని నల్గొండ, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు కలిపి మొత్తం ఏడుగురు టెండర్లను దాఖలు చేశారు. తెలంగాణకు చెందిన వనపర్తి, ఖమ్మం, హన్మకొండ, సంగారెడ్డిలకు చెందిన జిల్లా మత్స్యశాఖ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతను అక్కడి ప్రభుత్వం అప్పగించింది. ఖమ్మం మత్స్యశాఖ అధికారి డి.ఆంజనేయస్వామి నేతృత్వంలో అధికారులు టెండర్లు వేసిన ఏపీలో సీడ్ ఫామ్‌లను పరిశీలించి ఈ నెల 25 తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించారు. పోషకాల గని కొర్రమీను కొర్రమీను పిల్ల చాలా హుషారుగా ఉంటుంది. ఇది మీటరు వరకు పెరుగుతుంది. మంచినీటి సరస్సులు, పొలాల బోదెలు, బురద నేలల్లో ఇవి పెరుగుతాయి. వీటిలో 18–20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఆకు కూరల్లో లభించే విటమిన్ ‘ఏ’ కంటే కొర్రమీనులో ఉండే విటమిన్ ‘ఏ’ తేలిగ్గా జీర్ణమవుతుంది. వీటిలో గంధకం కలిగిన లైసిన్, మిథియానిక్, సిస్టిన్ అమినో యాసిడ్లు లభిస్తాయి.చేప మందుతో కొర్రమీనుకు గుర్తింపు ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప ప్రసాదాన్ని హైదరాబాద్‌లో బత్తిన సోదరులు ఉచితంగా అందిస్తారు. కరోనా కారణంగా మూడేళ్లు ఆగిన ప్రసాదం పంపిణీ ఈ ఏడాది జూన్ 8న మృగశిరకార్తె ప్రారంభమయ్యే ఉదయం 11 నుంచి 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు పంపిణీ చేయనున్నారు. వీరు తయారు చేసిన ప్రత్యేక మందును కొర్రమీను పిల్ల సహా నోటిలో వేస్తారు. తెలంగాణకు సరఫరా చేసే కొర్రమీను పిల్ల సైజు 2 అంగుళాల నుంచి 3 అంగుళాలు ఉండాలి. నల్ల రంగులో హుషారుగా ఉండాలి. ప్రస్తుత మార్కెట్లో ఒక్కో కొర్రమీను పిల్ల రూ.30 ధర పలుకుతోంది. పిల్ల సేకరణ ఓ సవాల్ కొర్రమీను పిల్లను సేకరించడం పెద్ద సవాల్‌గా మారుతోంది. కొల్లేరు సరస్సు, పొలాల గుంతల్లో కొర్రమీను తల్లి చేపను గుర్తిస్తారు. తల్లి వద్ద తిరిగే వేలల్లో పిల్లలను సేకరించి సిమెంటుతో చేసిన కుండీలలో ప్రత్యేకంగా పెంచుతారు. రోజుకు మూడుపూటలా నీరు మారుస్తారు. నాలుగు పూటలా మేత వేస్తారు. తెలంగాణ వరకు వ్యాన్లలో అత్యంత జాగ్రత్తగా వీటిని రవాణా చేస్తారు. కొల్లేరు ప్రాంతాల నుంచి వెళ్లే వ్యాన్లలో పిల్లలకు మూడు ప్రాంతాల్లో నీటిని మార్పు చేస్తారు. చేప మందు ప్రసాదం నిమిత్తం జూన్ 6వ తేదీన ఉదయం హైదారాబాద్‌కు కొల్లేరు కొర్రమీను పిల్లల్ని తరలించనున్నారు.కొల్లేరు ప్రాంతం అనుకూలం చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు సరస్సులో సహజసిద్ధంగా కొర్రమీను పెరుగుతుంది. నల్లజాతి చేపల్లో కొర్రమీనుకు ప్రత్యేక స్థానం ఉంది. కొల్లేరు పరీవాహక ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు వీటిని సరఫరా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొర్రమీను సాగు సైతం చేస్తున్నారు. కొర్రమీనులో పోషకాహారాలు అధికంగా ఉంటాయి. – షేక్ చాన్‌బాషా, ఫిషరీస్ ఏడీ, కైకలూరు -
కొల్లేరు కొర్రమీను.. కనుమరుగయ్యేను
సాక్షి, అమరావతి బ్యూరో/కైకలూరు: తెల్ల చేప రకాల్లో గోదావరి పులసకు ఎంత పేరుందో.. నల్ల చేప రకాల్లో ఒకటైన కొర్రమీనుకూ అంతే గుర్తింపు ఉంది. అందులోనూ కొల్లేరు సరస్సులో పెరిగే కొర్రమీనుకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడా కొల్లేరు కొర్రమీనులకు కష్టకాలం దాపురించింది. సరస్సులో వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. కృష్ణా, గోదావరి నదీ తీర ప్రాంతాలు, పంట కాలువలు, గుంతలు, వరి చేలల్లో కొర్రమీను చేపలు పుట్టి పెరుగుతుంటాయి. ప్రాంతాలను బట్టి పూమేను, కొర్రమీను, మట్టమీను, బురద మట్ట వంటి పేర్లతో పిలుచుకునే ఈ జాతి చేపలు సహజంగా నీటి అడుగున బురదలో జీవిస్తుంటాయి. నీరు లేనప్పుడు భూమి పొరల్లోకి కూడా చొచ్చుకుపోయి అక్కడి తేమను ఆధారం చేసుకుని జీవించగలిగే మొండి జాతి ఇది. కాలుష్యమే అసలు సమస్య కొల్లేరు సరస్సులోకి చేరుతున్న వ్యర్థ జలాలు సరస్సు గర్భంలో పురుడు పోసుకుంటున్న సహజ నల్ల జాతి చేపల ఉసురుతీస్తున్నాయి. స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన కొల్లేరు నీరు కాలకూట విషంగా మారింది. సరస్సులో ఉప్పు శాతం ప్రమాదకర స్థాయికి చేరడం అందోళన కలిగిస్తోంది. సరస్సులోకి ఏటా 17 వేల టన్నుల వ్యర్థ జలాలు చేరుతున్నట్టు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనా వేసింది. కేవలం పెద్ద కర్మాగారాల నుంచే రోజుకు 7.2 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు కొల్లేరులో కలుస్తున్నాయి. విజయవాడ, ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల నుంచి చేరుతున్న వ్యర్థ రసాయనాలు మత్స్య సంపదపై మృత్యు పాశం విసురుతున్నాయి. దీనికి తోడు సముద్రపు నీరు కొల్లేరులోకి ఎగదన్నుతోంది. కొర్రమీను చేప ‘జీరో’ సెలినిటీ (ఉప్పు శాతం లేని) మంచినీటిలో పెరిగే చేప. ప్రస్తుతం కొల్లేరులో ఉప్పు శాతం 3–15 శాతంగా ఉంది. దీంతో సరస్సులో చేపల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత నీటి కాలుష్యం వల్ల కొర్రమీను ఎపిజూటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ (ఈయూఎస్) వ్యాధులకు గురవుతోంది. దీనివల్ల శరీరంపై పుండ్లు, రక్తస్రావం కావడం, ఎదుగుదల లోపించడం, సంతానోత్పత్తి నశించడం వంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే కొల్లేరులో బొమ్మిడాయి, మట్టగిడస, గురక, ఇంగిలాయి, మార్పు, జెల్ల వంటి నల్ల చేప జాతులు కనుమరుగయ్యాయి. ఇప్పుడు మొండి జాతి రకమైన కొర్రమీను సైతం వాటి జాబితాలో చేరుతోంది. నీటి కాలుష్యాన్ని అరికట్టాలి కొల్లేరు సరస్సులోకి ఫ్యాక్టరీల నుంచి వ్యర్థ జలాలు రాకుండా నియంత్రించాలి. కర్మాగారాల నుంచి శుద్ధి చేసిన నీటిని మాత్రమే విడిచిపెట్టేలా చర్యలు తీసుకోవాలి. కొల్లేరులో నిత్యం నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. – ఎండీ ఆసిఫ్‌పాషా, జాతీయ ఉత్తమ చేపల రైతు, కైకలూరు కృత్రిమ సాగు మేలు కొర్రమీను రకం చేపలను కృత్రిమ పద్ధతిలో సాగు చేయడానికి రైతులు ముందుకొస్తున్నారు. కొర్రమీను సీడ్‌ను కొల్లేరు సరస్సుతోపాటు, కృష్ణా, గోదావరి నదుల నుంచి సేకరిస్తున్నారు. కొర్రమీను సాగుకు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) ప్రోత్సాహకాలు అందిస్తోంది. – పి.ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కైకలూరు -
చేపల విక్రయం @ రూ. కోటి
రూ.650 ధర పలికిన కొర్రమీను రేట్లు పెంచిన చేపల కట్టర్స్ ఆదివారం కావడంతో భారీగా విక్రయాలు కిక్కిరిసిన ముషీరాబాద్ చే పల మార్కెట్ భోలక్‌పూర్, న్యూస్‌లైన్ : మృగశిర కార్తె సందర్భంగా ఆదివారం కొర్రమీను ధర చుక్కలనంటింది. కిలో కొర్రమీను ధర ఏకంగా 650 పలికింది. మిగతా చేపల ధరలూ రెండు రెట్లు పెరిగాయి. మొత్తంగా ఈ ఒక్కరోజే 30 టన్నుల చేపల విక్రయాలు జరిగాయి. రూ. కోటికి పైగా వ్యాపారం జరిగినట్లు అంచనా. నగరంలోకెల్లా పెద్దదైన ముషీరాబాద్ చేపల మార్కెట్ వినియోగదారులతో కిటకిటలాడింది. శనివారం అర్ధరాత్రి నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో డీసీఎం, లారీల్లో చేపలను దిగుమతి చేసుకున్నారు. గత ఏడాది శనివారం కావడంతో మాంసాహారులు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ ఈసారి మాంసప్రియులకు ఇష్టమైన ఆదివారం రోజున మృగశిర కార్తె రావడంతో ఎప్పుడూ లేనంతగా జనాలు కనబడ్డారు. దీంతో చేపల మార్కెట్ నుంచి రాంనగర్ వైపు అరకిలోమీటరు వరకు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొండెక్కిన కొర్రమీను ఆదివారం ముషీరాబాద్ చేపల మార్కెట్లో కొర్రమీను ధర సామాన్య రోజులతో పోల్చితే రెండింతలు పెరిగింది. కిలోకు రూ.600 నుంచి రూ.650 వరకు కొర్రమీను చేపలు అమ్ముడుపోయాయి. రవ్వలు కిలోకు రూ.110 ధర పలుకగా, బొచ్చలు రూ.100 ధరకు అమ్ముడు పోయాయి. టైగర్ రొయ్యలు కిలో.రూ.300 నుంచి రూ.350 వరకు ధర పలికాయి. బంగారుతీగ రూ.110, మర్తగుంజ చేపలు రూ.210 చొప్పున అమ్ముడయ్యాయి. వీటితో పాటు పీతలు, రొయ్యలు, సీ ఫిష్‌లను విక్రయదారులు అధికంగా కొనుగోలు చేశారు. 30 టన్నుల చేపలు దిగుమతి ముషీరాబాద్ చేపలమార్కెట్లో ఆదివారం ఒక్కరోజే రూ.కోటికిపైగా వ్యాపారం జరిగిందని నగర గంగపుత్ర సంఘం ఉపాధ్యక్షులు జి.ప్రసాద్ న్యూస్‌లైన్‌కి తెలిపారు. 30 టన్నుల చేపలు దిగుమతి అయ్యాయని, గతేడాది కంటే ఈసారి ఎక్కువ అమ్మకాలు జరిగాయని వ్యాపారులు పేర్కొన్నారు. ఇక చేపల్ని ముక్కలుగా కత్తిరించే వారికీ డిమాండ్ పెరిగింది. దీంతో ఒక్కసారిగా రేట్లు పెంచారు. సాధారణ రోజుల్లో చేపలను కట్ చేసి ఇవ్వడానికి రూ.10లు తీసుకుంటే, ఆదివారం మాత్రం కిలోకు రూ.20ల చొప్పున తీసుకున్నారు. ఆదివారం జరిగిన చేపల విక్రయాలతో వాటి వ్యర్ధాలు, మురుగునీరు మార్కెట్ నుంచి రాంనగర్ వైపు వెళ్లే దారిలో శాస్త్రినగర్ వరకు రోడ్డుపై పారాయి. -
కొండెక్కిన కొర్రమీను
ముషీరాబాద్, న్యూస్‌లైన్ : మృగశిర కార్తెకు ముందే చేపల ధరలకు రెక్కలొచ్చాయి. కొర్రమీను కొండెక్కింది. మృగశిర కార్తె ఆదివారం కావడంతో చేపల రేట్లు గతంలో ఉన్నదాని కంటే అమాంతం పెరిగిపోయాయి. ముషీరాబాద్ చేపల మార్కెట్లో కేజీ కొర్రమీను ధర శుక్రవారం హోల్‌సేల్ మార్కెట్లో రూ. 400 పలుకగా.. అది రిటైల్‌కు వచ్చేసరికి 450 రూపాయల వరకు వెళ్లింది. అదే మామూలు రోజుల్లో అయితే కిలో ధర రూ. 300 నుంచి రూ. 350 వరకు పలుకుతుంది. ఇక బొచ్చ, రవ్వ ధరలు మామూలు రోజుల్లో 70 నుంచి 80 రూపాయలుండగా.. శుక్రవారం 100 నుంచి 110 రూపాయలు వరకు పలికాయి. మృగశిర కార్తెకు ఈ చేపల ధరలు ఎంతవరకు పోతాయో అంతు చిక్కడం లేదు. కేజీ కొర్రమీను ధర రూ. 450 నుంచి రూ. 500 వరకు బొచ్చ, రవ్వ వంటి చేపలు రూ. 120 వరకు పలుకుతాయని వ్యాపారస్తులు అంచనా వేస్తున్నారు.