కొండెక్కిన కొర్రమీను
ముషీరాబాద్, న్యూస్‌లైన్ : మృగశిర కార్తెకు ముందే చేపల ధరలకు రెక్కలొచ్చాయి. కొర్రమీను కొండెక్కింది. మృగశిర కార్తె ఆదివారం కావడంతో చేపల రేట్లు గతంలో ఉన్నదాని కంటే అమాంతం పెరిగిపోయాయి. ముషీరాబాద్ చేపల మార్కెట్‌లో కేజీ కొర్రమీను ధర శుక్రవారం హోల్‌సేల్ మార్కెట్లో రూ. 400 పలుకగా.. అది రిటైల్‌కు వచ్చేసరికి 450 రూపాయల వరకు వెళ్లింది. అదే మామూలు రోజుల్లో అయితే కిలో ధర రూ. 300 నుంచి రూ. 350 వరకు పలుకుతుంది.
ఇక బొచ్చ, రవ్వ ధరలు మామూలు రోజుల్లో 70 నుంచి 80 రూపాయలుండగా.. శుక్రవారం 100 నుంచి 110 రూపాయలు వరకు పలికాయి. మృగశిర కార్తెకు ఈ చేపల ధరలు ఎంతవరకు పోతాయో అంతు చిక్కడం లేదు. కేజీ కొర్రమీను ధర రూ. 450 నుంచి రూ. 500 వరకు బొచ్చ, రవ్వ వంటి చేపలు రూ. 120 వరకు పలుకుతాయని వ్యాపారస్తులు అంచనా వేస్తున్నారు.