చేపల విక్రయం @ రూ. కోటి | Fish sale @ Rs. Coty | Sakshi
Sakshi News home page

చేపల విక్రయం @ రూ. కోటి

Published Mon, Jun 9 2014 4:38 AM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM

చేపల విక్రయం @ రూ. కోటి

చేపల విక్రయం @ రూ. కోటి

  • రూ.650 ధర పలికిన కొర్రమీను
  •  రేట్లు పెంచిన చేపల కట్టర్స్
  •  ఆదివారం కావడంతో భారీగా విక్రయాలు
  •  కిక్కిరిసిన ముషీరాబాద్ చే పల మార్కెట్
  • భోలక్‌పూర్, న్యూస్‌లైన్ : మృగశిర కార్తె సందర్భంగా ఆదివారం కొర్రమీను ధర చుక్కలనంటింది. కిలో కొర్రమీను ధర ఏకంగా 650 పలికింది. మిగతా చేపల ధరలూ రెండు రెట్లు పెరిగాయి. మొత్తంగా ఈ ఒక్కరోజే 30 టన్నుల చేపల విక్రయాలు జరిగాయి. రూ. కోటికి పైగా వ్యాపారం జరిగినట్లు అంచనా. నగరంలోకెల్లా పెద్దదైన ముషీరాబాద్ చేపల మార్కెట్ వినియోగదారులతో కిటకిటలాడింది.

    శనివారం అర్ధరాత్రి నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో డీసీఎం, లారీల్లో చేపలను దిగుమతి చేసుకున్నారు. గత ఏడాది శనివారం కావడంతో మాంసాహారులు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ ఈసారి మాంసప్రియులకు ఇష్టమైన ఆదివారం రోజున మృగశిర కార్తె రావడంతో ఎప్పుడూ లేనంతగా జనాలు కనబడ్డారు. దీంతో చేపల మార్కెట్ నుంచి రాంనగర్ వైపు అరకిలోమీటరు వరకు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
     
    కొండెక్కిన కొర్రమీను

    ఆదివారం ముషీరాబాద్ చేపల మార్కెట్‌లో కొర్రమీను ధర సామాన్య రోజులతో పోల్చితే రెండింతలు పెరిగింది. కిలోకు రూ.600 నుంచి రూ.650 వరకు కొర్రమీను చేపలు అమ్ముడుపోయాయి. రవ్వలు కిలోకు రూ.110 ధర పలుకగా, బొచ్చలు రూ.100 ధరకు అమ్ముడు పోయాయి. టైగర్ రొయ్యలు కిలో.రూ.300 నుంచి రూ.350 వరకు ధర పలికాయి. బంగారుతీగ రూ.110, మర్తగుంజ చేపలు రూ.210 చొప్పున అమ్ముడయ్యాయి. వీటితో పాటు పీతలు, రొయ్యలు, సీ ఫిష్‌లను విక్రయదారులు అధికంగా కొనుగోలు చేశారు.
     
    30 టన్నుల చేపలు దిగుమతి
     
    ముషీరాబాద్ చేపలమార్కెట్‌లో ఆదివారం ఒక్కరోజే రూ.కోటికిపైగా వ్యాపారం జరిగిందని నగర గంగపుత్ర సంఘం ఉపాధ్యక్షులు జి.ప్రసాద్ న్యూస్‌లైన్‌కి తెలిపారు. 30 టన్నుల చేపలు దిగుమతి అయ్యాయని, గతేడాది కంటే ఈసారి ఎక్కువ అమ్మకాలు జరిగాయని వ్యాపారులు పేర్కొన్నారు. ఇక చేపల్ని ముక్కలుగా కత్తిరించే వారికీ డిమాండ్ పెరిగింది. దీంతో ఒక్కసారిగా రేట్లు పెంచారు. సాధారణ రోజుల్లో చేపలను కట్ చేసి ఇవ్వడానికి రూ.10లు తీసుకుంటే, ఆదివారం మాత్రం కిలోకు రూ.20ల చొప్పున తీసుకున్నారు. ఆదివారం జరిగిన చేపల విక్రయాలతో వాటి వ్యర్ధాలు, మురుగునీరు మార్కెట్ నుంచి రాంనగర్ వైపు వెళ్లే దారిలో శాస్త్రినగర్ వరకు రోడ్డుపై పారాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement