కోదండ రాముడి ఉత్సవాలు
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి 8.58 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. హనుమంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపజేశారు. దీనికి ముందు ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులు, ధ్వజపటము, చక్రత్తాళ్వారుతో సహా తిరువీధుల ఉత్సవం నిర్వహించారు. అనంతరం 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం జరిగింది. రాత్రి 8గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ మాట్లాడుతూ నగరవాసులు, పరిసరప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున వాహన సేవల్లో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయ నాలుగు మాడవీధుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా స్థానికులు సహకరించాలని కోరారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మహతి కళాక్షేత్రం, రామచంద్రపుష్కరిణిలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.
టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు మాట్లాడుతూ ధ్వజారోహణంతో సకలదేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్లు తెలిపారు. రాముడు ధర్మస్వరూపుడని, ఆయన ఆదర్శాలను భక్తులు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి రఘునాథ్, వీఎస్వో హనుమంతు, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్, శ్రీధర్, కంకరణభట్టార్, సీతారామాచార్యులు, ఏఈవో ప్రసాదమూర్తిరాజు పాల్గొన్నారు.