ఉద్యోగాల ఊసేది?
ఉద్యోగ ప్రకటనల జారీలో జాప్యంపై ఓయూలో ఆందోళన
హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ ప్రకటనల జారీలో జాప్యంపై ఓయూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. గురువారం ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ కోటూరి మానవతరాయ్ ఆధ్వర్యంలో లైబ్రరీని బహిష్కరించి ఆర్ట్స్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మానవ హారం చేపట్టారు. ఈ సందర్భంగా మానవతరాయ్ మాట్లాడుతూ జూలైలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేస్తామని కేసీఆర్ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో ప్రకటించినా భర్తీ ఊసే లేదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటిస్తున్న ప్రభుత్వం.. నిరుద్యోగుల డొక్కల గురించి ఆలోచించడం లేదన్నారు. హరిత హారానికి ప్రతీకగా నిరుద్యోగ హారం చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రకటించినట్లు 25 వేల ఉద్యోగాలు కాకుండా.. లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలని, గ్రూప్-2, 3, ఎస్సై ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు బండి నరేష్, పెద్దిబాబు, జగన్, తిరుపతి, మహిపాల్‌రెడ్డి, తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.