కళాశాల టాపర్... పరీక్ష రాయలేని దుస్థితి
జోగిపేట (మెదక్): ఆ విద్యార్థిని కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం టాపర్. కానీ కాలేజీ నిర్వాకం వల్ల ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష రాయలేని దుస్థితి ఎదురైంది. విద్యార్థులు సకాలంలో ఫీజులు చెల్లించినా యాజమాన్యం సకాలంలో స్పందించకపోవడం వల్ల హాల్ టికెట్లు జారీ కాలేదు. దీంతో మెదక్ జిల్లా జోగిపేటలోని క్రాంతి జూనియర్ కళాశాలకు చెందిన పది మంది విద్యార్థులు మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాయలేకపోయారు.
మంగళవారం హాల్‌టికెట్ల కోసం కళాశాలకు వద్దకు చేరుకున్న విద్యార్థులు విషయం తెలిసి భోరున విలపించారు. ఫస్ట్‌ఇయర్‌లో 403 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచిన స్వాతి రెండో సంవత్సరం పరీక్షలు రాయలేని పరిస్థితి ఏర్పడడంతో కన్నీరు మున్నీరైంది. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కాగా, మొదటి సంవత్సరం విద్యార్థులకు సకాలంలో హాల్‌టికెట్లు ఇవ్వని కారణంగా 60 మంది విద్యార్థులు సోమవారం నాటి పరీక్షను రాయలేక పోయారు. కళాశాలకు ఫోన్ చేసినా ఎవరూ స్పందించకపోవడం.. విద్యార్థులకు సమాచారం అందించక పోవడం వల్ల మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లింది.