kribco works
-
క్రిభ్కో పనుల అడ్డగింత
వెంకటాచలం: సర్వేపల్లి పంచాయతీ ముత్యాలగుంట క్రిభ్కో నిర్మాణ పనులను స్థానికులు బుధవారం అడ్డుకున్నారు. గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మా అనుమతి లేకుండా నిర్మాణాలు చేస్తూ మాపై కేసులు పెడతారా అంటూ మహిళలు మండిపడ్డారు. గ్రామంలో ఇళ్ల స్థలాలు లేనివారికి, ఇతర అవసరాలకు కొంత స్థలం వదిలి ప్రహరీ నిర్మించుకోవాలని అధికారులకు తెలియజేస్తే పట్టించుకోలేదన్నారు. ప్రహరీ నిర్మాణ పనులు జరక్కుండా అడ్డంగా కూర్చున్నారు. మహిళా పోలీసుల చేత మహిళలను పక్కకు లాగే ప్రయత్నం చేశారు. వారు ప్రతిఘటించడంతో తోపులాట జరిగింది. సీఐ శ్రీనివాసరెడ్డి ఫోన్లో ఆర్డీవో కాసా వెంకటేశ్వర్లుతో చర్చించారు. క్రిభ్కో ప్రతిని«ధులతో మాట్లాడి ఇళ్ల స్థలాలకు స్థలం కేటాయించేందుకు చర్యలు చేపడతామని ఆర్డీవో చెప్పడంతో ఆందోళన విరమించారు. -
క్రిభ్కో పనులు అడ్డగింత
కంపెనీ ప్రతినిధులతో పనబాక కృష్ణయ్య చర్చలు వెంకటాచలం: మండలంలోని ముత్యాలగుంటలో జరుగుతున్న క్రిభ్కో నిర్మాణ పనులను గ్రామస్తులు శనివారం ఉదయం అడ్డుకున్నారు. నివాసాల సమీపంలో క్రిభ్కో ప్రహరీ నిర్మించవద్దని గత వారం రోజులుగా గ్రామస్తులు పనులను అడ్డుకోవడంతో శుక్రవారం పోలీసు బందోబస్తుతో పనులు ప్రారంభించారు. అడ్డుకుంటే కేసులు నమోదు చేయిస్తామని భయపెట్టడంతో స్థానికులు డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన శనివారం ఉదయం ముత్యాలగుంటకు వచ్చి మహిళలతో పనులను అడ్డుకుని నిలిపి వేయించారు. ఆయన క్రిభ్కో ప్రతినిధులతో మాట్లాడారు. 288 ఎకరాల్లో క్రిభ్కో పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటూ గ్రామస్తులు అడిగిన కొద్దిమేర స్థలాన్ని వదులు కోలేరా అని ప్రశ్నించారు. భవిష్యత్లో గ్రామ అవసరాల కోసం స్థలాన్ని వదలకుండా మొత్తం భూమిని రెవెన్యూ అధికారులు క్రిభ్కోకు కేటాయించడం సరికాదన్నారు. ఈ సమస్యను తాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. క్రిభ్కో ప్రతినిధులు తాత్కాలికంగా పనులు నిలపివేయాలని సూచించారు. కొందరికి పరిహారం ఇవ్వకుండానే పనులు చేస్తున్నారని వాపోయారు. ఆయన వెంట కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సీతారాంబాబు, సేవాదళ్ అధ్యక్షుడు శివప్రసాద్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆర్వీ రమణయ్య, వెంకటాచలం మండల అధ్యక్షుడు నక్కా ఈశ్వరయ్య పాల్గొన్నారు.