Krishna deer
-
అపరాధం.. పరిహారం
కృష్ణజింక సాధుజీవి. అరుదైన జీవి. ఇప్పుడైతే అంతరించిపోతున్న జీవి. రావణుడి దుర్గతికి, సల్మాన్‌ఖాన్ దుస్థితికీ కృష్ణజింకే కారణం అని నిన్నామొన్న వాట్సాపుల్లో తిరిగింది. ఒకవేళ అది నిజమే అయినా... జింక కారణంగా వాళ్లకా గతీ స్థితీ పట్టిందనడం సరికాదు. గతీ స్థితీ పట్టాకే జింక ఒక కారణం అయింది. కృష్ణజింక వందల ఏళ్లుగా మనుషులతో కలిసి ఉంటోంది. మరీ ఇళ్లల్లో తిరుగుతోందని కాదు. గ్రామాల్లోని ఇళ్లకు అనుకుని ఉండే అడవుల్లో వాటి నివాసం, విహారం! అడవులకు గ్రామాలు అనుకుని ఉండే రోజుల్లో కృష్ణజింకలు కళ్లనిండుగా ఉండేవి. ఇప్పుడు గ్రామాలకే అడవులు ఆనుకుని ఉంటున్నాయి కనుక, అడవులతో పాటే కృష్ణజింకలూ అంతరించిపోయే ‘సంఖ్య’కు చేరుకున్నాయి. అంతరించిపోయే ‘స్థితి’ అనలేం. ‘స్థితి’ అంటే అవి తెచ్చిపెట్టుకున్నది. ‘సంఖ్య’ అంటే వాటికి మనిషి తెచ్చిపెట్టింది. నిజానికి ఏ వన్యప్రాణి సంరక్షణ చట్టమూ లేకుండానే స్వేచ్ఛగా బతకనివ్వగలిగినంత భక్తి భావం కృష్ణజింకపై ఉంది భారతీయులలో! శ్రీకృష్ణుడికి కృష్ణజింక ప్రియమైన ప్రాణి. చంద్రుని వాహనం. వాయుదేవునికి కూడానంటారు. సల్మాన్ వేటాడిన ప్రాంతంలోనైతే కృష్ణజింక సాక్షాత్తూ దైవసమానం. అక్కడి కృష్ణభక్తులు, కర్ణిమాత పుత్రులు, బిష్ణోయ్ తెగలవాళ్లు కృష్ణజింకను పూజిస్తారు. చట్ట ప్రకారం చూస్తే సల్మాన్ చేసింది ఒకటే తప్పు. చట్టాన్ని ఉల్లంఘించడం. అయితే ఇక్కడ భక్తివిశ్వాసాల భంగం కూడా జరిగింది! అది రెండో తప్పు. చట్టంలో వాదనలుంటాయి. ప్రతివాదనలు ఉంటాయి. జైళ్లు, బెయిళ్లు ఉంటాయి. చివరికి నిందితుడు ‘కన్విక్టెడ్’గా లోపలికైనా వెళ్తాడు. ‘అక్విటెడ్’గా బయటైనా పడిపోతాడు. కృష్ణజింకను ఆరాధించేవారి దృష్టిలో మాత్రం అతడు ఎప్పటికీ అపరాధే. ‘అక్విటెడ్’ అయినా సరే, అపరాధే. మరి ఏమిటి శిక్ష? ఏమిటి పరిహారం? ఒక చెట్టును నరికేముందో, నరికే శాకో వంద మొక్కల్ని నాటినట్లు... కృష్ణజింకల్ని కానీ, మరే మూగప్రాణుల్ని గానీ నాటే సౌలభ్యం లేనప్పుడు... ఒకసారి చెంపలు వేసుకుని, ఇకనుంచీ కంచెగానైనా ఉంటాను అనే కట్టుబాటు విధించుకోవడం ఒక నివృత్తి. ఒక పాపహరణ. 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చింది. అప్పటికి మన దేశంలో ఉన్న కృష్ణజింకలు పాతికవేలు! చట్టం వల్ల 2000 సంవత్సరం నాటికి అవి యాభైవేలయ్యాయి. అవి ఇంకా పెరిగేందుకు చట్టం తను చేయాల్సింది చేస్తోంది. సల్మాన్‌లాంటి వాళ్లు కూడా చేయొచ్చు. రెండు కృష్ణజింకల్ని చంపినందుకు పరిహారంగా ఉన్న కృష్ణజింకల సంరక్షణకు ఏదైనా చెయ్యొచ్చు. (పరివర్తన చెందిన ఖైదీల్లా). సల్మాన్కన్నా ముందు క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ 2005లో ఒక కృష్ణజింకను చంపాడు. ఘోరం ఏంటంటే.. ఆ రోజు జూన్ 5. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినం! అన్నీ తెలిసే జరుగుతాయనేం లేదు. జరిగాక తెలిసినప్పుడైనా మనిషి తనలో అంతరించిపోతున్నదేదో గమనించుకోవాలి. – మాధవ్ శింగరాజు -
కృష్ణ జింకను చంపిన 9 మందికి జైలు
ఠాణే: తందూల్‌వాడి అటవీప్రాంతంలో కృష్ణజింకను వేటాడి చంపిన 9 మందికి షోలాపూర్ కోర్టు శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు, రూ. 2 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. వివరాలిలా ఉన్నాయి.. 2011 మార్చి 21వ తేదీన తందూల్‌వాడి అటవీప్రాంతంలో కొందరు వ్యక్తులు కృష్ణ జింకను వధించి, మాంసం వండుకుని తింటున్నారని షోలాపూర్ ఫారెస్టు అధికారులకు సమాచారం అందింది. వెంటనే ఫారెస్టు అధికారుల బృందం అటవీ ప్రాంతంలోనే ఉన్న సదరు వ్యక్తులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకుంది. వారి వద్దనుంచి కొంత మాంసాన్ని, జంతు చర్మంతోపాటు వేటకు పనికివచ్చే మారణాయుధాలు, బైనాక్యులర్లు, వంటకు వాడే సామగ్రి, ఐస్ బాక్స్ వంటి పలు రకాల ఆయుధాలు, పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మాంసాన్ని, చర్మాన్ని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపగా, అవి కృష్ణజింకకు సంబంధించినవేనని నివేదిక అందింది. కాగా, కోర్టులో నిందితుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ తమ క్లయింట్లపై ఫారెస్టు అధికారులు తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. తమ క్లయింట్లు స్థలం కొనేందుకు ఆ రోజు ముంబై నుంచి షోలాపూర్ వెళ్లారని వాదించారు. కాగా న్యాయమూర్తి అర్చనా ఎస్. నల్గే వారి వాదనను తిరస్కరించారు. నిందితులు నిజంగా స్థలం కొనడానికే షోలాపూర్ వెళితే అడవిలో అంత అర్ధరాత్రి సమయంలో ఆగాల్సిన పనేంటని ప్రశ్నించారు. అక్రమంగా కేసు బనాయించారనుకున్నా వారి వద్ద ఆ సమయంలో వేటకు పనికివచ్చే మారణాయుధాలు, పరికరాలు ఎందుకు ఉన్నాయని అడిగారు. అలాగే ఆ రోజు వేరే స్థలంలో ఉన్నారనడానికి సరిపడా సాక్ష్యాధారాలను అందజేయడంలో విఫలమయ్యారని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. లేబొరేటరీ నుంచి వచ్చిన నివేదికలు సైతం నిందితుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న మాంసం కృష్ణ జింకదేనని తేల్చాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినం మార్చి 21న ఈ సంఘటన జరగడం యాదృచ్ఛికమే అయినా, అటవీ జంతువులను కాపాడాలని నినదించే రోజునాడే వారు ఒక అడవి జంతువును సంహరించడం క్షమార్హం కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె నిందితులకు మూడేళ్ల జైలు శిక్షతోపాటు, నిందితుల స్థాయిలను బట్టి రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. నిందితులను అరెస్టు చేసిన అటవీ అధికారులకు ఈ సందర్భంగా న్యాయమూర్తి ఒక్కొక్కరికీ రూ. 5 వేల రివార్డును ఇవ్వాలని ఆదేశించారు. కాగా, తమ ఆయుధాలను వాపసు చేయాలని నిందితులు పెట్టుకున్న అర్జీలను కోర్టు తిరస్కరించింది.