కృష్ణజింక సాధుజీవి. అరుదైన జీవి. ఇప్పుడైతే అంతరించిపోతున్న జీవి. రావణుడి దుర్గతికి, సల్మాన్‌ఖాన్ దుస్థితికీ కృష్ణజింకే కారణం అని నిన్నామొన్న వాట్సాపుల్లో తిరిగింది. ఒకవేళ అది నిజమే అయినా... జింక కారణంగా వాళ్లకా గతీ స్థితీ పట్టిందనడం సరికాదు. గతీ స్థితీ పట్టాకే జింక ఒక కారణం అయింది. కృష్ణజింక వందల ఏళ్లుగా మనుషులతో కలిసి ఉంటోంది. మరీ ఇళ్లల్లో తిరుగుతోందని కాదు. గ్రామాల్లోని ఇళ్లకు అనుకుని ఉండే అడవుల్లో వాటి నివాసం, విహారం!
అడవులకు గ్రామాలు అనుకుని ఉండే రోజుల్లో కృష్ణజింకలు కళ్లనిండుగా ఉండేవి. ఇప్పుడు గ్రామాలకే అడవులు ఆనుకుని ఉంటున్నాయి కనుక, అడవులతో పాటే కృష్ణజింకలూ అంతరించిపోయే ‘సంఖ్య’కు చేరుకున్నాయి. అంతరించిపోయే ‘స్థితి’ అనలేం. ‘స్థితి’ అంటే అవి తెచ్చిపెట్టుకున్నది. ‘సంఖ్య’ అంటే వాటికి మనిషి తెచ్చిపెట్టింది. నిజానికి ఏ వన్యప్రాణి సంరక్షణ చట్టమూ లేకుండానే స్వేచ్ఛగా బతకనివ్వగలిగినంత భక్తి భావం కృష్ణజింకపై ఉంది భారతీయులలో! శ్రీకృష్ణుడికి కృష్ణజింక ప్రియమైన ప్రాణి. చంద్రుని వాహనం. వాయుదేవునికి కూడానంటారు.
సల్మాన్ వేటాడిన ప్రాంతంలోనైతే కృష్ణజింక సాక్షాత్తూ దైవసమానం. అక్కడి కృష్ణభక్తులు, కర్ణిమాత పుత్రులు, బిష్ణోయ్ తెగలవాళ్లు కృష్ణజింకను పూజిస్తారు. చట్ట ప్రకారం చూస్తే సల్మాన్ చేసింది ఒకటే తప్పు. చట్టాన్ని ఉల్లంఘించడం. అయితే ఇక్కడ భక్తివిశ్వాసాల భంగం కూడా జరిగింది! అది రెండో తప్పు. చట్టంలో వాదనలుంటాయి. ప్రతివాదనలు ఉంటాయి. జైళ్లు, బెయిళ్లు ఉంటాయి. చివరికి నిందితుడు ‘కన్విక్టెడ్’గా లోపలికైనా వెళ్తాడు. ‘అక్విటెడ్’గా బయటైనా పడిపోతాడు.
కృష్ణజింకను ఆరాధించేవారి దృష్టిలో మాత్రం అతడు ఎప్పటికీ అపరాధే. ‘అక్విటెడ్’ అయినా సరే, అపరాధే. మరి ఏమిటి శిక్ష? ఏమిటి పరిహారం? ఒక చెట్టును నరికేముందో, నరికే శాకో వంద మొక్కల్ని నాటినట్లు... కృష్ణజింకల్ని కానీ, మరే మూగప్రాణుల్ని గానీ నాటే సౌలభ్యం లేనప్పుడు... ఒకసారి చెంపలు వేసుకుని, ఇకనుంచీ కంచెగానైనా ఉంటాను అనే కట్టుబాటు విధించుకోవడం ఒక నివృత్తి. ఒక పాపహరణ.
1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చింది. అప్పటికి మన దేశంలో ఉన్న కృష్ణజింకలు పాతికవేలు! చట్టం వల్ల 2000 సంవత్సరం నాటికి అవి యాభైవేలయ్యాయి. అవి ఇంకా పెరిగేందుకు చట్టం తను చేయాల్సింది చేస్తోంది. సల్మాన్‌లాంటి వాళ్లు కూడా చేయొచ్చు. రెండు కృష్ణజింకల్ని చంపినందుకు పరిహారంగా ఉన్న కృష్ణజింకల సంరక్షణకు ఏదైనా చెయ్యొచ్చు. (పరివర్తన చెందిన ఖైదీల్లా). సల్మాన్‌కన్నా ముందు క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ 2005లో ఒక కృష్ణజింకను చంపాడు. ఘోరం ఏంటంటే.. ఆ రోజు జూన్ 5. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినం! అన్నీ తెలిసే జరుగుతాయనేం లేదు. జరిగాక తెలిసినప్పుడైనా మనిషి తనలో అంతరించిపోతున్నదేదో గమనించుకోవాలి.
– మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment