ఇంతింతై అన్నట్టుగా ఎదిగిన సల్మాన్(Salman Khan) తొలి సినిమా ఏది? అని అడిగితే వెంటనే ఠక్కున మైనే ప్యార్ కియా అని చెప్పేస్తారు. కానీ చాలా మందికి తెలీని విషయం బీవీ హోతో ఐసీ (భార్య అంటే ఇలా ఉండాలి) అనే సినిమా సల్మాన్ తొలిసినిమా. 1988లో విడుదలైన ఈ సినిమాలో సల్మాన్ సహాయనటుడి పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత చేసిన మైనే ప్యార్ కియా సూపర్ డూపర్ హిట్ అవడంతో తొలి సినిమా తెరమరుగైపోయింది.. సల్లూభాయ్‌కి లవర్ బాయ్ ఇమేజ్ కూడా వచ్చేసింది.
భార్య అంటే ఇలా ఉండాలి అనే అర్ధం వచ్చేలా టైటిల్‌తో తొలిసినిమా ఎలాగైతే సల్మాన్ కెరీర్‌లో అస్పష్టం ఉండిపోయిందో...సల్మాన్ వివాహం కూడా అలాగే ఉండిపోయింది. అదలా ఉంచితే... బాలీవుడ్‌లో అత్యంత ఎలిజబుల్ బ్యాచిలర్ అయిన సల్మాన్‌ఖాన్‌కి దేశవ్యాప్తంగా అసంఖ్యాక అభిమానుల్ని అందించిన తొలి సినిమా మైనే ప్యార్ కియా కాగా దానికి దర్శకుడు సూరజ్ బర్జాత్యా(Sooraj Barjatya). హమ్ ఆప్ కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై వంటి సూపర్ డూపర్ హిట్స్ తో టాప్ డైరెక్టర్‌గా మారారు.
పై చిత్రాలతో పాటు ప్రేమ్ రతన్ ధన్‌పాయో కూడా సల్మాన్‌ఖాన్‌తోనే రూపొందించారీ కుటుంబ చిత్రాలకు పేరొందిన ఈ దర్శకుడు. సల్మాన్‌తో అత్యధిక హిట్స్ తీశాడు. అలాగే ఆయన త్వరలో తన అభిమాన హీరో సల్మాన్ ఖాన్‌తో మరో చిత్రంలో మళ్లీ చేయబోతున్నాడు, అయితే కెరీర్ ప్రారంభం నుంచీ వరుసగా సల్మాన్‌తో చిత్రాలు తీస్తూ వచ్చిన ఆయన ప్రేమ్ రతన్ ధన్‌పాయోకి ముందు వివాహ్(Vivah) పేరిట ఒక సినిమాని రూపొందించినప్పుడు ఆ సినిమాలో షాహిద్ కపూర్‌ని హీరోగా ఎంచుకున్నారు.
సల్మాన్ ఖాన్ తో త్వరలో మరో చిత్రంలో మళ్లీ జతకట్టబోతున్న సూరజ్ బర్జాత్యా... వివాహ్ సినిమా కు హీరో ఎంపిక విషయంలో సల్మాన్‌ని దూరంగా పెట్టడానికి కారణం ఏమిటి? అనే విషయంపై బాలీవుడ్‌లో అప్పట్లో చర్చోపచర్చలు జరిగాయి. ఈ నేపధ్యంలో సూరజ్ బర్జాత్యా ఇటీవల ఆ విషయం గురించి మాట్లాడాడు.
‘‘ అప్పట్లో మీరట్‌కు చెందిన ఒక టైలర్, కాలిన గాయాలతో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్త గురించి చెప్పి, మా నాన్న నాకు ఆ వార్తాపత్రిక కటింగ్‌ను చూపించారు. ప్రేమ మానవత్వం ఆధారంగా సినిమాను రూపొందించాలని అనుకున్నాం. ఆ సినిమా కథ కొత్తగా కనపడే ఒక అమాయకుడికి నప్పుతుంది. కాబట్టి సల్మాన్ ఖాన్ ఆ సినిమాకి నప్పే సరైన హీరో కాదు. అందుకే షాహిద్ ను ఎంచుకున్నా’’ అంటూ చెప్పారు సూరజ్ బర్జాత్యా. మొత్తానికి ఇంత కాలమైనా ప్రేమలు, అనుబంధాలకు దగ్గరగా అదే సమయంలో వివాహానికి దూరంగా ఉంంటూ వివాహ వ్యవస్థలో ఒదగలేకపోతున్న సల్మాన్... వివాహ్ అనే సినిమా లో పాత్రలో సైతం నప్పకపోవడం... విచిత్రం.
Comments
Please login to add a commentAdd a comment