ఠాణే: తందూల్‌వాడి అటవీప్రాంతంలో కృష్ణజింకను వేటాడి చంపిన 9 మందికి షోలాపూర్ కోర్టు శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు, రూ. 2 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. వివరాలిలా ఉన్నాయి.. 2011 మార్చి 21వ తేదీన తందూల్‌వాడి అటవీప్రాంతంలో కొందరు వ్యక్తులు కృష్ణ జింకను వధించి, మాంసం వండుకుని తింటున్నారని షోలాపూర్ ఫారెస్టు అధికారులకు సమాచారం అందింది.
వెంటనే ఫారెస్టు అధికారుల బృందం అటవీ ప్రాంతంలోనే ఉన్న సదరు వ్యక్తులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకుంది. వారి వద్దనుంచి కొంత మాంసాన్ని, జంతు చర్మంతోపాటు వేటకు పనికివచ్చే మారణాయుధాలు, బైనాక్యులర్లు, వంటకు వాడే సామగ్రి, ఐస్ బాక్స్ వంటి పలు రకాల ఆయుధాలు, పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మాంసాన్ని, చర్మాన్ని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపగా, అవి కృష్ణజింకకు సంబంధించినవేనని నివేదిక అందింది. కాగా, కోర్టులో నిందితుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ తమ క్లయింట్లపై ఫారెస్టు అధికారులు తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు.
తమ క్లయింట్లు స్థలం కొనేందుకు ఆ రోజు ముంబై నుంచి షోలాపూర్ వెళ్లారని వాదించారు. కాగా న్యాయమూర్తి అర్చనా ఎస్. నల్గే వారి వాదనను తిరస్కరించారు. నిందితులు నిజంగా స్థలం కొనడానికే షోలాపూర్ వెళితే అడవిలో అంత అర్ధరాత్రి సమయంలో ఆగాల్సిన పనేంటని ప్రశ్నించారు. అక్రమంగా కేసు బనాయించారనుకున్నా వారి వద్ద ఆ సమయంలో వేటకు పనికివచ్చే మారణాయుధాలు, పరికరాలు ఎందుకు ఉన్నాయని అడిగారు. అలాగే ఆ రోజు వేరే స్థలంలో ఉన్నారనడానికి సరిపడా సాక్ష్యాధారాలను అందజేయడంలో విఫలమయ్యారని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
లేబొరేటరీ నుంచి వచ్చిన నివేదికలు సైతం నిందితుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న మాంసం కృష్ణ జింకదేనని తేల్చాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినం మార్చి 21న ఈ సంఘటన జరగడం యాదృచ్ఛికమే అయినా, అటవీ జంతువులను కాపాడాలని నినదించే రోజునాడే వారు ఒక అడవి జంతువును సంహరించడం క్షమార్హం కాదని ఆమె స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆమె నిందితులకు మూడేళ్ల జైలు శిక్షతోపాటు, నిందితుల స్థాయిలను బట్టి రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. నిందితులను అరెస్టు చేసిన అటవీ అధికారులకు ఈ సందర్భంగా న్యాయమూర్తి ఒక్కొక్కరికీ రూ. 5 వేల రివార్డును ఇవ్వాలని ఆదేశించారు. కాగా, తమ ఆయుధాలను వాపసు చేయాలని నిందితులు పెట్టుకున్న అర్జీలను కోర్టు తిరస్కరించింది.
కృష్ణ జింకను చంపిన 9 మందికి జైలు
Published Fri, Dec 6 2013 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM
Advertisement
Advertisement