Rane
-
Goa Assembly Polls 2022: అక్కడందరూ‘ రాణె’లే..!
పనాజి: పేరులో ఏముందిలే అనుకుంటాం కానీ, కొన్నిసార్లు పేరు చుట్టూ చాలా వింతలు విశేషాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈసారి గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పొరియె నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో అందరూ రాణె ఇంటి పేరు ఉన్నవారే ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు, గోవాకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రతాప్ సింగ్ రాణె గత అయిదు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గానికి రారాజు. ఇప్పుడు మాత్రం ఆయన పొరి యె రేసు నుంచి తప్పుకున్నారు. రాణెకోడలు దేవియ రాణె బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉండడంతో కుమారుడు తీసుకువచ్చిన ఒత్తిడికి తలొగ్గి ప్రతాప్ సింగ్ తన నియోజకవర్గాన్ని మార్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రంజిత్ సింగ్ రాణెని అభ్యర్థిగా రంగంలోకి దింపింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విశ్వజిత్ కృష్ణారావు రాణె ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో జరిగే ఎన్నికల ప్రచారంలో రాణె అన్నపేరు మారు మోగిపోతోంది. చదవండి: (Punjab Assembly Election 2022: మాల్వా చిక్కితే అసెంబ్లీ అందినట్టే) ఎవరీ రాణెలు? రాణెలు అంటే ప్రాచీన కాలంలో వివిధ రాజవంశాల్లోని సైనికులుగా కిరాయికి పని చేసేవారు. వీరిలో దయాదాక్షిణ్యం మచ్చుకైనా ఉండేవి కావు. రాజు చెప్పిందే వేదం. పన్నులు వసూలు చేయాలన్నా, శత్రువుల ప్రాణాలు తీయాలన్నా రాణెలకే ఆ పనులు అప్పగించేవారు. ప్రతాప్ సింగ్ రాణె పూర్వీకులు మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ సైన్యంలో పని చేసేవారు. కొన్ని తరాలుగా పన్నులు వసూలు చేసే పనుల్లో ఉన్న వీరంతా పోర్చుగీసుల హయాంలో పాలకులపై తిరగబడ్డారు. భూ హక్కులు కావాలంటూ ఒక విప్లవమే తీసుకువచ్చారు. చేసేదేమి లేక పోర్చుగీసు ప్రభుత్వం రాణెలకు భూములపై హక్కులు కల్పిస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో నేటి మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లో గ్రామాలకు గ్రామాలే వారి వశం అయ్యాయి. అప్పట్నుంచి సమాజంలో వీరి ప్రాబల్యం పెరిగిపోయింది. చదవండి: (ఆరునెలల్లోనే సీఎం అభ్యర్థి రేంజ్కి.. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ) అలా గోవాలో ఇప్పుడు రాణెలు ఎక్కువ మందే కనిపిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న ప్రతాప్ సింగ్ రాణె (80) 16వ తరానికి చెందిన నాయకుడు. ఈసారి పొరియె నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. 1972 నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చిన ప్రతాప్ సింగ్ రాణెకు ఈ నియోజకవర్గంపై బాగా పట్టు ఉంది. అయితే పొరియె కాంగ్రెస్కు కంచుకోటగానే ముద్ర పడింది. ఈ ఎన్నికల్లో ఆయన కోడలు ప్రత్యర్థి పార్టీ బీజేపీ నుంచి రంగంలోకి దిగడంతో ఓటర్లలో కొంతవరకు గందరగోళం నెలకొంది. రాణె తన కుమారుడి కోసం నియోజకవర్గం నుంచి తప్పుకోవడంపై ఓటర్లు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
ఫిబ్రవరిలో ముంబ్రాకు ఎంపీ అసదుద్దీన్
సాక్షి, ముంబై: ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తేహాదుల్ ముస్లిం (ఎంఐఎం) అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫిబ్రవరి రెండో తేదీన ఠాణే సమీపంలోని ముంబ్రాకు వస్తున్నారు. ‘ముస్లింలు రాజకీయాల్లో ఎందుకు వెనకబడ్డారు’ అనే అంశంపై ముంబ్రాలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరై ప్రసంగించనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన పర్యటనవల్ల ముంబ్రాలోని రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలుచోట్ల రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంవల్ల ఆయన తెరమీదకు వచ్చారు. హైదరాబాద్తోపాటు నాందేడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ఎంఐఎం పార్టీని మరింత విస్తరించాలనే యోచనలో ఆయన ఉన్నారు. ఆయన చే సిన ప్రసంగం ముస్లిం యువకుల్లో నూతనోత్తేజం నింపింది. ముంబ్రా, కల్వా ప్రాంతాల్లో ముస్లింలకు మంచి పట్టు ఉంది. ఇక్కడ వారి సంఖ్య అధికంగా ఉంది. దీంతో ముంబ్రాలో ఒవైసీ బహిరంగ సభ జరగడం ఇదే తొలిసారి కావడంతో భారీగా జనం వచ్చే అవకాశాలున్నాయి. కాగా, ఎన్సీపీ కార్పొరేటర్ అబ్దుల్ రవూఫ్ లాల్కు చెందిన మై ముంబ్రా ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. లాల్ ప్రస్తుతం ఎన్సీపీలో అసంతృప్తితో ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ఆయన ఒవైసీని ముంబ్రాకు తీసుకొచ్చి ఎంఐఎంకి వాతావరణం అనుకూలంగా చేయాలనే ఉద్దేశంతో లాల్ ఉన్నట్లు రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన ఓవైసీతోపాటు అస్సాంలోని ఆల్ ఇండియా యునెటైడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ చీఫ్, ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్, డాక్టర్ కాసిం రసూల్, మాలేగావ్కు చెందిన జనసురాజ్య శక్తి పార్టీ ఎమ్మెల్యే ముఫ్తీ మహ్మద్ తదితర నాయకులను కూడా ఆహ్వానించారు. వీరిలో ఇప్పటివరకు ఒవైసీ మాత్రమే ఈ కార్యక్రమానికి వచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. -
లంచం కేసులో ఐటీ అధికారి జైలుకి
ఠాణే: లంచం తీసుకుంటున్నాడనే ఆరోపణతో గతవారం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సీనియర్ ఆదాయపన్ను అధికారిని జనవరి 13వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ మంగళవారం స్పెషల్ జడ్జి ఆదేశాలు జారీచేశారు. వివరాలు.. పన్ను ఎగవేత కేసులో ఒక వ్యాపారికి బెయిల్ ఇప్పించేందుకు రూ.3.5 లక్షల లంచం తీసుకుంటుండగా జాయింట్ ఐటీ కమిషనర్ సంజీవ్ ఘాయ్ని సీబీఐ అధికారులు గత గురువారం అరెస్టు చేశారు. అప్పటినుంచి సీబీఐ కస్టడీలోనే ఉన్న అతడిని మంగళవారం ప్రత్యేక జడ్జి ఎం.సి.ఖాద్రే ముందు హాజరు పరచగా జనవరి 13 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేశారు. ప్రత్యేక జడ్జి ముందు సీబీఐ తరఫు న్యాయవాది విజయ్ శాలీ మాట్లాడుతూ.. నిందితుడి ఇంటి నుంచి దర్యాప్తు అధికారులు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీబీఐ అధికారుల కథనం ప్రకారం.. ఐటీ అధికారి సంజీవ్ ఘాయ్ ఇంట్లో ఎప్పుడూ రెండు డజన్లకు పైగా ఐటీ ఫైళ్లు ఉంటాయి. వాటిని పరిశీలన నిమిత్తం తనతో ఉంచుకుంటున్నట్లు అతడు చెబుతాడు. సంజయ్ నిత్యం వారాంతాల్లో ఢిల్లీ వెళ్లి వస్తుంటాడు. కాగా, ఇతర ఏ కేసుల్లోనైనా లంచం తీసుకున్నాడేమో దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
కృష్ణ జింకను చంపిన 9 మందికి జైలు
ఠాణే: తందూల్వాడి అటవీప్రాంతంలో కృష్ణజింకను వేటాడి చంపిన 9 మందికి షోలాపూర్ కోర్టు శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు, రూ. 2 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. వివరాలిలా ఉన్నాయి.. 2011 మార్చి 21వ తేదీన తందూల్వాడి అటవీప్రాంతంలో కొందరు వ్యక్తులు కృష్ణ జింకను వధించి, మాంసం వండుకుని తింటున్నారని షోలాపూర్ ఫారెస్టు అధికారులకు సమాచారం అందింది. వెంటనే ఫారెస్టు అధికారుల బృందం అటవీ ప్రాంతంలోనే ఉన్న సదరు వ్యక్తులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకుంది. వారి వద్దనుంచి కొంత మాంసాన్ని, జంతు చర్మంతోపాటు వేటకు పనికివచ్చే మారణాయుధాలు, బైనాక్యులర్లు, వంటకు వాడే సామగ్రి, ఐస్ బాక్స్ వంటి పలు రకాల ఆయుధాలు, పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మాంసాన్ని, చర్మాన్ని పరీక్షల నిమిత్తం హైదరాబాద్కు పంపగా, అవి కృష్ణజింకకు సంబంధించినవేనని నివేదిక అందింది. కాగా, కోర్టులో నిందితుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ తమ క్లయింట్లపై ఫారెస్టు అధికారులు తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. తమ క్లయింట్లు స్థలం కొనేందుకు ఆ రోజు ముంబై నుంచి షోలాపూర్ వెళ్లారని వాదించారు. కాగా న్యాయమూర్తి అర్చనా ఎస్. నల్గే వారి వాదనను తిరస్కరించారు. నిందితులు నిజంగా స్థలం కొనడానికే షోలాపూర్ వెళితే అడవిలో అంత అర్ధరాత్రి సమయంలో ఆగాల్సిన పనేంటని ప్రశ్నించారు. అక్రమంగా కేసు బనాయించారనుకున్నా వారి వద్ద ఆ సమయంలో వేటకు పనికివచ్చే మారణాయుధాలు, పరికరాలు ఎందుకు ఉన్నాయని అడిగారు. అలాగే ఆ రోజు వేరే స్థలంలో ఉన్నారనడానికి సరిపడా సాక్ష్యాధారాలను అందజేయడంలో విఫలమయ్యారని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. లేబొరేటరీ నుంచి వచ్చిన నివేదికలు సైతం నిందితుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న మాంసం కృష్ణ జింకదేనని తేల్చాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినం మార్చి 21న ఈ సంఘటన జరగడం యాదృచ్ఛికమే అయినా, అటవీ జంతువులను కాపాడాలని నినదించే రోజునాడే వారు ఒక అడవి జంతువును సంహరించడం క్షమార్హం కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె నిందితులకు మూడేళ్ల జైలు శిక్షతోపాటు, నిందితుల స్థాయిలను బట్టి రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. నిందితులను అరెస్టు చేసిన అటవీ అధికారులకు ఈ సందర్భంగా న్యాయమూర్తి ఒక్కొక్కరికీ రూ. 5 వేల రివార్డును ఇవ్వాలని ఆదేశించారు. కాగా, తమ ఆయుధాలను వాపసు చేయాలని నిందితులు పెట్టుకున్న అర్జీలను కోర్టు తిరస్కరించింది. -
ముగ్గురు పోలీసుల సస్పెన్షన్
ఠాణే: కర్తవ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై సీనియర్ ఇన్స్పెక్టర్సహా ముగ్గురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ధాయ్గఢ్ స్టేషన్కు చెందిన సీనియర్ ఇన్స్పెక్టర్ అశోక్ జగ్తాప్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్తోపాటు ఓ కానిస్టేబుల్ని గురువారం సస్పెండ్ చేశామని ఠాణే పోలీస్ కమిషనర్ తెలిపారు. ముంబ్రా-పన్వేల్ రోడ్డులోని ధాయ్గఢ్లోగల డ్యాన్స్బార్పై ముంబై పోలీసు విభాగానికి చెందిన సామాజిక భద్రతా విభాగం బుధవారం రాత్రి మెరుపుదాడి చేసి 14 మందిని అరెస్టు చేసింది. సదరు బార్లో పనిచేస్తున్న 57 మంది యువతులకు విముక్తి కలిగించింది. పోలీసులు దాడి చేసిన విషయాన్ని గమనించిన బార్ యజమాని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. పోలీసులు అరెస్టుచేసిన వారిలో బార్ మేనేజర్ రాకేశ్శెట్టికూడా ఉన్నాడు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరచగా రెండు రోజుల పోలీసు కస్టడీకి ఆదేశించింది. కాగా డ్యాన్స్బార్ కార్యకలాపాలపై ఫిర్యాదు చేసినప్పటికీ ఠాణే పోలీసులు పట్టించుకోకపోవడంతో నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ... ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఉన్నతాధికారులు పై చర్య తీసుకున్నారు.