ఫిబ్రవరిలో ముంబ్రాకు ఎంపీ అసదుద్దీన్ | Asaduddin Owaisi in mumbai | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో ముంబ్రాకు ఎంపీ అసదుద్దీన్

Published Fri, Jan 10 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM

Asaduddin Owaisi in mumbai

సాక్షి, ముంబై: ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తేహాదుల్ ముస్లిం (ఎంఐఎం) అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫిబ్రవరి రెండో తేదీన ఠాణే సమీపంలోని ముంబ్రాకు వస్తున్నారు. ‘ముస్లింలు రాజకీయాల్లో ఎందుకు వెనకబడ్డారు’ అనే అంశంపై ముంబ్రాలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరై ప్రసంగించనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.  ఆయన పర్యటనవల్ల ముంబ్రాలోని రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలుచోట్ల రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంవల్ల ఆయన తెరమీదకు వచ్చారు. హైదరాబాద్‌తోపాటు నాందేడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ఎంఐఎం పార్టీని మరింత విస్తరించాలనే యోచనలో ఆయన ఉన్నారు.
 
 ఆయన చే సిన ప్రసంగం ముస్లిం యువకుల్లో నూతనోత్తేజం నింపింది. ముంబ్రా, కల్వా ప్రాంతాల్లో ముస్లింలకు మంచి పట్టు ఉంది. ఇక్కడ వారి సంఖ్య అధికంగా ఉంది. దీంతో ముంబ్రాలో ఒవైసీ బహిరంగ సభ జరగడం ఇదే తొలిసారి కావడంతో భారీగా జనం వచ్చే అవకాశాలున్నాయి. కాగా, ఎన్సీపీ కార్పొరేటర్ అబ్దుల్ రవూఫ్ లాల్‌కు చెందిన మై ముంబ్రా ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. లాల్ ప్రస్తుతం ఎన్సీపీలో అసంతృప్తితో ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ఆయన ఒవైసీని ముంబ్రాకు తీసుకొచ్చి ఎంఐఎంకి వాతావరణం అనుకూలంగా చేయాలనే ఉద్దేశంతో లాల్ ఉన్నట్లు రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌కు చెందిన ఓవైసీతోపాటు అస్సాంలోని ఆల్ ఇండియా యునెటైడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ చీఫ్, ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్, డాక్టర్ కాసిం రసూల్, మాలేగావ్‌కు చెందిన జనసురాజ్య శక్తి పార్టీ ఎమ్మెల్యే ముఫ్తీ మహ్మద్ తదితర నాయకులను కూడా ఆహ్వానించారు. వీరిలో ఇప్పటివరకు ఒవైసీ మాత్రమే ఈ కార్యక్రమానికి వచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement