పనాజి: పేరులో ఏముందిలే అనుకుంటాం కానీ, కొన్నిసార్లు పేరు చుట్టూ చాలా వింతలు విశేషాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈసారి గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పొరియె నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో అందరూ రాణె ఇంటి పేరు ఉన్నవారే ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు, గోవాకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రతాప్ సింగ్ రాణె గత అయిదు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గానికి రారాజు. ఇప్పుడు మాత్రం ఆయన పొరి యె రేసు నుంచి తప్పుకున్నారు. రాణెకోడలు దేవియ రాణె బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉండడంతో కుమారుడు తీసుకువచ్చిన ఒత్తిడికి తలొగ్గి ప్రతాప్ సింగ్ తన నియోజకవర్గాన్ని మార్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రంజిత్ సింగ్ రాణెని అభ్యర్థిగా రంగంలోకి దింపింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విశ్వజిత్ కృష్ణారావు రాణె ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో జరిగే ఎన్నికల ప్రచారంలో రాణె అన్నపేరు మారు మోగిపోతోంది.
చదవండి: (Punjab Assembly Election 2022: మాల్వా చిక్కితే అసెంబ్లీ అందినట్టే)
ఎవరీ రాణెలు?
రాణెలు అంటే ప్రాచీన కాలంలో వివిధ రాజవంశాల్లోని సైనికులుగా కిరాయికి పని చేసేవారు. వీరిలో దయాదాక్షిణ్యం మచ్చుకైనా ఉండేవి కావు. రాజు చెప్పిందే వేదం. పన్నులు వసూలు చేయాలన్నా, శత్రువుల ప్రాణాలు తీయాలన్నా రాణెలకే ఆ పనులు అప్పగించేవారు. ప్రతాప్ సింగ్ రాణె పూర్వీకులు మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ సైన్యంలో పని చేసేవారు. కొన్ని తరాలుగా పన్నులు వసూలు చేసే పనుల్లో ఉన్న వీరంతా పోర్చుగీసుల హయాంలో పాలకులపై తిరగబడ్డారు. భూ హక్కులు కావాలంటూ ఒక విప్లవమే తీసుకువచ్చారు. చేసేదేమి లేక పోర్చుగీసు ప్రభుత్వం రాణెలకు భూములపై హక్కులు కల్పిస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో నేటి మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లో గ్రామాలకు గ్రామాలే వారి వశం అయ్యాయి. అప్పట్నుంచి సమాజంలో వీరి ప్రాబల్యం పెరిగిపోయింది.
చదవండి: (ఆరునెలల్లోనే సీఎం అభ్యర్థి రేంజ్‌కి.. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ)
అలా గోవాలో ఇప్పుడు రాణెలు ఎక్కువ మందే కనిపిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న ప్రతాప్ సింగ్ రాణె (80) 16వ తరానికి చెందిన నాయకుడు. ఈసారి పొరియె నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. 1972 నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చిన ప్రతాప్ సింగ్ రాణెకు ఈ నియోజకవర్గంపై బాగా పట్టు ఉంది. అయితే పొరియె కాంగ్రెస్‌కు కంచుకోటగానే ముద్ర పడింది. ఈ ఎన్నికల్లో ఆయన కోడలు ప్రత్యర్థి పార్టీ బీజేపీ నుంచి రంగంలోకి దిగడంతో ఓటర్లలో కొంతవరకు గందరగోళం నెలకొంది. రాణె తన కుమారుడి కోసం నియోజకవర్గం నుంచి తప్పుకోవడంపై ఓటర్లు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment