గోవాడ క్రషింగ్‌కు మళ్లీ అంతరాయం
కేఎస్ఎన్ నామినేషన్ కోసం పాలకవర్గం నిర్వాకమని రైతుల ఆందోళన
కాటాల వద్ద 450 టన్నుల చెరకు
ఎండిపోతోందంటూ రైతుల ఆగ్రహం
బుచ్చెయ్యపేట/చోడవరం,న్యూస్‌లైన్: గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి మళ్లీ క్రషిం గ్‌కు బ్రేక్ పడింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు క్రషింగ్ పునరుద్ధరించారు. పది హేను రోజుల కాలంలో క్రషింగ్ నిలిచిపోవడం ఇది ఏడోసారి. క్రషింగ్ నిలిచిపోవడంతో కాటా ల వద్ద దాదాపు 450 టన్నుల చెరకు పేరుకుపోయింది. మండే ఎండల్లో చెరకు ఎం డిపోతోందని, దీనివల్ల దిగుబడి తగ్గిపోతుం దని రైతులు ఆందోళన చెందుతున్నారు.
టీడీపీ అభ్యర్థి నామినేషన్ ఉండడంతో పాలకవర్గమే ఈ తతంగానికి తెరతీసిందని రైతులు ఆరోపిస్తున్నారు. ‘లాభాల్లో ఉన్న సుగర్స్‌ను నష్టాలపాల్జేసే లక్ష్యంతోనే యాజమాన్యం, అధికారులు కలిసి పనిచేస్తున్నారన్న అనుమానం కలుగుతోంది’ అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అసలే వేసవి కాలం, పది నిమిషాలు ఎండలో నిలబడలేకపోతున్నాం, అలాంటిది రెండు మూడురోజుల పాటు రాత్రి, పగలు నిద్రాహారం లేక చెరకు కాటాల వద్ద పశువులు, మేము నిరీక్షించాల్సి వస్తోంది’ అని రైతులు అద్దెపల్లి అప్పారావు, రామారావు, గొంప పెదబాబు, పిళ్లా వెంకటరమణ, మాణిక్యం, ఒంటెద్దు రమ ణ, సయ్యపురెడ్డి రమణ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డాది, బుచ్చెయ్యపేట చెరకు కాటాల వద్ద టన్నుల కొద్ది చెర కు అన్లోడింగ్ అవ్వక ఎండుతోంది. దీంతో బుచ్చెయ్యపేట, వడ్డాది కాటాల పరిధిలోని 20 గ్రామాల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ అభ్యర్థి నామినేషన్ కోసమా?
గురువారం చోడవరం ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి కె.ఎస్.ఎన్.ఎస్.రాజు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి లారీల ద్వారా జనాన్ని తరలించాలని నిర్ణయించారని, జనసమీకరణ కోసం వ్యూహాత్మకంగానే క్రషింగ్ నిలిపివేశారని పలు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు నామినేషన్‌కు రావాలని పథకం ప్రకారమే బుధవారం రాత్రి నుంచి లారీలను చెరకు కాటాలకు పంపించలేదని ధ్వజమెత్తారు. ‘ఫ్యాక్టరీకి టీడీపీకి చెందిన పాలకవర్గం వచ్చినప్పటి నుంచి రైతులకు పాట్లు తప్పడం లేదు. సక్రమంగా కటింగ్ ఆర్డర్లు ఇవ్వడం లేదు.
పలుమార్లు క్రషింగ్‌కు అంతరాయం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం’ అని బుచ్చెయ్యపేట, వడ్డాది, ఎల్.బి.పురం, పేట, దిబ్బిడి, అయితంపూడి, లోపూడి, వీరవల్లి, పోతనపూడి తదితర గ్రామాల చెరకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరకు కాటాలకు లారీలు తిరగకపోవడం, చెరకు తరలింపు ఎక్కడికక్కడ నిలిచిపోవడంపై ఫ్యాక్టరీ సిబ్బందిని వివరణ కోరగా క్రషింగ్‌లో అంతరాయం వల్లేనని, మరమ్మతులు అనంతరం చెరకు తరలిస్తామని తెలిపారు.