పాత విద్యుత్కేంద్రాలు మూసేయండి
* టీఎస్ జెన్కోకు కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశం
* 720 మెగావాట్ల 8 యూనిట్లు మూసేయాలని స్పష్టీకరణ
* 60, 120 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు కూడా...
* 2019 వరకు గడువు ఇచ్చిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాలం చెల్లిన థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసివేయాలని తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీఎస్జెన్కో)కు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. పాత సాంకేతిక పరిజ్ఞానంతో దశాబ్దాల కింద నిర్మించిన 60 మెగావాట్లు, 120 మెగావాట్ల థర్మల్ విద్యుత్ యూనిట్లను దశల వారీగా 2018-19 లోపు మూసేయాలని స్పష్టం చేసింది.
ఖమ్మం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ విద్యుత్కేంద్రం (కేటీపీఎస్) ఏడో దశ విస్తరణలో భాగంగా 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త యూనిట్ నెలకొల్పేందుకు పర్యావరణ అనుమతులు జారీ చేస్తూనే, 720 మెగావాట్ల సామర్థ్యం గల 8 పాత కేటీపీఎస్ యూనిట్లను 2018-19 లోగా మూసివేయాలని మెలిక పెట్టింది.
కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పట్టుబట్టడంతో కేటీపీఎస్ పాత ప్లాంట్ల మూసివేతపై జెన్కో తలొగ్గక తప్పలేదు. రాష్ట్రంలో విద్యుత్ కొరత నేపథ్యంలో 2019 చివరి నాటికి ఈ ప్లాంట్లను మూసివేస్తామని తెలంగాణ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు గత నెల 2న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు హామీ పత్రం రాసిచ్చారు. దీంతో గత నెల 19, 20 తేదీల్లో సమావేశమైన కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ కేటీపీఎస్ ఏడో దశ విస్తరణకు మరికొన్ని షరతులతో అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేసింది. ఈ మేరకు వారం రోజుల్లో పర్యావరణ అనుమతుల ఉత్తర్వులు వెల్లడి కానున్నాయి.
ప్రస్తుతం కేటీపీఎస్ విద్యుత్కేంద్రం పూర్తి సామర్థ్యం 1,720 మెగావాట్లు. మరో 800 మెగావాట్లతో ఏడో దశ విస్తరణకు జెన్కో రెండేళ్లుగా పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది. తొలుత 1966-67లో ఒక్కొక్కటి 60 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లను నిర్మించి మొత్తం 240 మెగావాట్లతో జెన్కో కేటీపీఎస్‌ను నెలకొల్పింది. ఆ తర్వాత 1974-78 మధ్య కాలంలో ఒక్కొక్కటి 120 మెగావాట్లతో మరో 4 యూనిట్లను నిర్మించి 480 మెగావాట్లను జత చేసింది. తదనంతరం ఈ విద్యుత్కేంద్రం ఐదు, ఆరు దశల విస్తరణలో భాగంగా మరో 1,000 మెగావాట్లతో మూడు యూనిట్లను నిర్మించడంతో కేటీపీఎస్ సామర్థ్యం 1,720 మెగావాట్లకు పెరిగింది.
1998-2004 మధ్యలో కాలం చెల్లిన 60 మెగావాట్లు, 120 మెగావాట్ల పాత యూనిట్ల ఆధునికీకరణ కోసం రూ.604 కోట్లను జెన్కో ఖర్చు చేసింది. భారీ పెట్టుబడి పెట్టినందున 60 మెగావాట్ల యూనిట్లను 2023-24 వరకు, 120 మెగావాట్ల యూనిట్లను 2018-19 వరకు నడపాలని జెన్కో భావించింది. ఏడో దశ విస్తరణ ప్రతిపాదనల్లో సైతం ఇదే అంశాన్ని పర్యావరణ శాఖకు తెలియజేసింది. కానీ, పర్యావరణ శాఖ ఒప్పుకోకపోవడంతో పాత యూనిట్ల మూసివేతకు జెన్కో సంసిద్ధత వ్యక్తం చేయక తప్పలేదు.
కాలుష్యంపై ఆందోళన..
కేటీపీఎస్ విద్యుత్కేంద్రం నుంచి ఉత్పత్తి అవుతున్న బూడిద వ్యర్థాలపై పర్యావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడి బూడిదలో 15.89 శాతాన్ని మాత్రమే ఇటుకలు, సిమెంట్ తయారీకి వినియోగిస్తున్నారని, 2020-21 నాటికి 100 శాతం బూడిదను వినియోగంలోకి తేవాలని స్పష్టం చేసింది. ఆ మేరకు సిమెంటు, ఇటుకల పరిశ్రమలను ప్రోత్సహించాలని సిఫారసు చేసింది. కొత్త యూనిట్ నుంచి ఉత్పత్తి అయ్యే బూడిద కోసం కొత్త యాష్ పాండ్ ఏర్పాటును వ్యతిరేకించింది. పాత యూనిట్ల యాష్ పాండ్లనే కొత్త యూనిట్‌కూ వినియోగించుకోవాలని కోరింది. బూడిద కోసం కొత్తగా స్థలాలను సేకరించరాదని ఆంక్షలు విధించింది. కాలుష్య నివారణ చర్యలపై ప్రతి 6 నెలలకు ఒకసారి తెలంగాణ పీసీబీతో కలిసి పర్యవేక్షణ జరపాలని తమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదేశించింది.