kunja satyavati
-
ముంపు ప్రాంతాన్ని వదులుకునేది లేదు
భద్రాచలం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపటంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఇంటిని ముట్టడించారు. సుమారు రెండు గంటలకు పైగా అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. మూడు రహదారులను దిగ్బంధించి వాహనాలను రానివ్వకుండా అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయాలని, దీనిపై ఎమ్మెల్యే కుంజా సత్యవతి వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. గేటుకు అడ్డంగా కూర్చొని ఇంట్లో నుంచి ఏ ఒక్కరనీ బయటకు రానివ్వలేదు. ఆ సమయంలో ఎమ్మెల్యే భర్త కుంజా ధర్మారావు కారులో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడగా ఆందోళనకారులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే వచ్చేంత వరకూ కదలబోమంటూ మండుటెండను సైతం లెక్క చేయకుండా అక్కడే కూర్చొన్నారు. ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు సున్నం వెంకటరమణ, ముర్ల రమేష్ మాట్లాడుతూ ఆదివాసీలను ముంచే తెలంగాణ రాష్ట్రం తమకు వద్దన్నారు. పోలవరం ప్రాజెక్టుపై పార్టీల వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. దీని కోసం ఆందోళన ఉధృతం చేస్తామని, ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం డివిజన్ బంద్ చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా, పట్టణంలోని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే సత్యవతి ఆందోళన విషయం తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చారు. పోలవరం ఎత్తు తగ్గించాలని తాను కూడా పోరాడుతున్నానని, ఇక ముందు కూడా ఉద్యమిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు మడివి నెహ్రూ, సోడె మురళి తదితరులు పాల్గొన్నారు. డివిజన్ విభజనకు కాంగ్రెస్సే కారణం... భద్రాచలం డివిజన్ విభజన జరుగడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కోసమే గిరిజనులను జలసమాధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందన్నారు. పోలవరం నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడింది సీపీఎం ఒక్కటేనని అన్నారు. ఆదివాసీలను ముంచే తెలంగాణ వద్దు... పోలవరం ప్రాజెక్టు పేరుతో ఆదివాసీలను ముంచే తెలంగాణ రాష్ట్రం వద్దని ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు గొంది వె ంకటేశ్వర్లు అన్నారు. శనివరం భద్రాచలం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపైనే తప్ప ఆదివాసీలపై రాజకీయ పార్టీలకు ఏమాత్రం శ్రద్ధ లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. డివిజన్ బంద్‌కు వైఎస్ఆర్సీపీ మద్దతు... ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచాలనే డిమాండ్‌తో జేఏసీ చేపడుతున్న భద్రాచలం డివిజన్ బంద్‌కు వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని పార్టీ నియోజకవర్గ క న్వీనర్ డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు. బంద్‌లో పార్టీ కేడర్ అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల పక్షాన తమ పార్టీ నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కడియం రామాచారి, మంత్రిప్రగడ నర్సింహారావు, గంటా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఇద్దరి భవితవ్యం ఏమిటో?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని అధికారపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నికల వేళ తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. ఇంటిపోరుతో సతమతమవుతున్న కుంజా సత్యవతి (భద్రాచలం), రేగా కాంతారావు (పినపాక) తమ రాజకీయ భవితవ్యంపై గందరగోళంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండే వర్గపోరును సరిగా అంచనా వేయలేకపోయిన వీరు ఇప్పుడు వారి వారి నియోజకవర్గాల్లో గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారని చెప్పాలి. అసమ్మతి ఉన్నా సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినా... టికెట్ రాకుండా ఉండేందుకుగాను స్థానిక నాయకులు, సీనియర్లు చేస్తున్న ప్రయత్నాలు వీరికి గుబులు పుట్టిస్తున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో టికెట్ వస్తుందో రాదో... వచ్చినా విజయానికి స్థానిక కేడర్ ఏ మేరకు సహకరిస్తుందో అనే ఆందోళన వీరి అనుయాయుల్లో వ్యక్తమవుతోంది. వర్గపోరు ప్రభావం... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో 2009 అసెంబ్లీ ఎన్నికలలో జిల్లాలో కొత్తముఖాలు టికెట్టు దక్కించుకున్నాయి. వీరిలో ఈ ఇద్దరూ ఉన్నారు. తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఐదేళ్ల పాటు పనిచేసి తమ అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు కానీ కాంగ్రెస్ పార్టీలోని వర్గపోరును సరిగా అంచనావేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీలోని సీనియర్లు వీరిపై గుర్రుగా ఉన్నారు. అందులో భాగంగానే వీరికి టికెట్లు రాకుండా కొత్త వారికి అవకాశం ఇప్పించాలని పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి చట్టసభకు వెళ్లిన పినపాక ఎమ్మెల్యే రేగకాంతారావు అంటేనే పార్టీలోని సీనియర్లు మండిపడుతున్నారు. ఇటీవల మహబూబాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశానికి పార్టీ పరిశీలకుడు వచ్చిన సందర్భంగా వారు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. కాంతారావు సీనియర్లను పట్టించుకోవడం లేదని, పార్టీ పరిశీలకునికి తమ అభిప్రాయాలు కూడా చెప్పనీయకుండా అడ్డుకున్నారని పార్టీ జిల్లా నాయకుడు కుంజా శంకర్, నాగేశ్వరరావు, గుండాల మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బారావు ఆనాడే విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కూడా టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటే తప్పేంటని వారు ప్రశ్నించారు. కాంతారావు వ్యతిరేకులంతా సుబ్బారావు అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంతారావు అభ్యర్థిత్వం ఏ మలుపు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు సుదీర్ఘకాలం సీపీఎంలో పనిచేసి అనూహ్యంగా కాంగ్రెస్‌లోకి వెళ్లి అంతే అనుహ్యం గా ఎమ్మెల్యే అయిన కుంజా సత్యవతి పరిస్థితి కూడా డోలాయమానంలోనే ఉంది. ఈమె తీరుపట్ల స్థానిక నేతల్లో అసంతృప్తి నెలకొంది. పార్టీ ఎమ్మెల్యేగా స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా సీనియర్లు మాత్రం ఆమెకు సహకరించడం లేదు. సత్యవతి లేదా ఆమె భర్త ధర్మాకు ఈసారి టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే వర్గం కోరుతుంటే మరో నాయకుడు కూడా తనకు టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. కొందరు సీనియర్లయితే ఈసారి సత్యవతి కుటుంబానికి టికెట్ ఇస్తే సహించేది లేదని, నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఆమెపై వ్యతిరేకత ఉందని అంటున్నారు. కేంద్రమంత్రి బలరాంనాయక్ సూచించే మనిషికి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కాంతారావు, సత్యవతికి మళ్లీ టికెట్ వస్తుందా? వచ్చినా స్థానిక కేడర్ సహకరిస్తుందా? కొత్త ముఖాలు తెరపైకి వస్తాయా? అనేది చర్చనీయాంశమవుతోంది. -
భద్రాద్రిని విడదీయొద్దని.. రిలే దీక్షలు ప్రారంభం
భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రాచలం ప్రాంతాన్ని తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ టీజేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు సమయంలో భద్రాచలంపై కిరికిరి పెట్టడం సరైంది కాదన్నారు. తెలంగాణవాదుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు వెలువడినా అంగీకరించబోమని చెప్పారు. జైరామ్మ్రేష్, ఆంటోనీ కమిటీల నివేదికలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఏసీ గదుల్లో కూర్చొని నివేదికలు పొందుపరిస్తే ఇక్కడి సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలోనే ఉంచాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్న సహించేది లేదని హెచ్చరించారు. భద్రాచలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని, అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. దీక్షలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే కుంజా సత్యవతి మాట్లాడుతూ.. భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రుల అడగటం అవివేకమన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసమే భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రలో విలీనం చేయాలని చూస్తున్నార ని, ఇదే జరిగితే ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీజేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య దీక్షలను సందర్శించి మద్దతు తెలిపారు. తొలిరోజు దీక్షలో టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి ఎస్కే గౌసుద్ధీన్, రేగలగడ్డ ముత్తయ్య, వెక్కిరాల శ్రీనివాస్, కిశోర్, సోమశేఖర్, హనుమాన్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులు కుంజా సీతారాములు తదితరులు కూర్చొన్నారు. ఆదివారం నాటి దీక్షలను భద్రాచలం సర్పంచ్ భూక్యా శ్వేత నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. దీక్ష శిబిరాన్ని వివిధ పార్టీల నాయకులు బొలిశెట్టి రంగారావు, రమేష్‌గౌడ్, తాండ్ర నర్సింహారావు, రాజేష్, నక్కా ప్రసాద్, కుంచాల రాజారామ్, టీవీ, కల్లూరి వెంకటేశ్వరరావు, ఆవుల సుబ్బారావు, కెచ్చెల కల్పన, సోందె వీరయ్య, మడివి నె హ్రూ, పడిసిరి శ్రీనివాస్, వర్తక సంఘం నాయకులు వాసిరెడ్డి అజేయ్‌కుమార్ సందర్శించి మద్దతు పలికారు.