సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని అధికారపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నికల వేళ తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. ఇంటిపోరుతో సతమతమవుతున్న కుంజా సత్యవతి (భద్రాచలం), రేగా కాంతారావు (పినపాక) తమ రాజకీయ భవితవ్యంపై గందరగోళంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండే వర్గపోరును సరిగా అంచనా వేయలేకపోయిన వీరు ఇప్పుడు వారి వారి నియోజకవర్గాల్లో గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారని చెప్పాలి.
అసమ్మతి ఉన్నా సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినా... టికెట్ రాకుండా ఉండేందుకుగాను స్థానిక నాయకులు, సీనియర్లు చేస్తున్న ప్రయత్నాలు వీరికి గుబులు పుట్టిస్తున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో టికెట్ వస్తుందో రాదో... వచ్చినా విజయానికి స్థానిక కేడర్ ఏ మేరకు సహకరిస్తుందో అనే ఆందోళన వీరి అనుయాయుల్లో వ్యక్తమవుతోంది.
వర్గపోరు ప్రభావం...
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో 2009 అసెంబ్లీ ఎన్నికలలో జిల్లాలో కొత్తముఖాలు టికెట్టు దక్కించుకున్నాయి. వీరిలో ఈ ఇద్దరూ ఉన్నారు. తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఐదేళ్ల పాటు పనిచేసి తమ అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు కానీ కాంగ్రెస్ పార్టీలోని వర్గపోరును సరిగా అంచనావేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీలోని సీనియర్లు వీరిపై గుర్రుగా ఉన్నారు. అందులో భాగంగానే వీరికి టికెట్లు రాకుండా కొత్త వారికి అవకాశం ఇప్పించాలని పావులు కదుపుతున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి చట్టసభకు వెళ్లిన పినపాక ఎమ్మెల్యే రేగకాంతారావు అంటేనే పార్టీలోని సీనియర్లు మండిపడుతున్నారు. ఇటీవల మహబూబాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశానికి పార్టీ పరిశీలకుడు వచ్చిన సందర్భంగా వారు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. కాంతారావు సీనియర్లను పట్టించుకోవడం లేదని, పార్టీ పరిశీలకునికి తమ అభిప్రాయాలు కూడా చెప్పనీయకుండా అడ్డుకున్నారని పార్టీ జిల్లా నాయకుడు కుంజా శంకర్, నాగేశ్వరరావు, గుండాల మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బారావు ఆనాడే విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కూడా టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటే తప్పేంటని వారు ప్రశ్నించారు. కాంతారావు వ్యతిరేకులంతా సుబ్బారావు అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంతారావు అభ్యర్థిత్వం ఏ మలుపు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
మరోవైపు సుదీర్ఘకాలం సీపీఎంలో పనిచేసి అనూహ్యంగా కాంగ్రెస్‌లోకి వెళ్లి అంతే అనుహ్యం గా ఎమ్మెల్యే అయిన కుంజా సత్యవతి పరిస్థితి కూడా డోలాయమానంలోనే ఉంది. ఈమె తీరుపట్ల స్థానిక నేతల్లో అసంతృప్తి నెలకొంది. పార్టీ ఎమ్మెల్యేగా స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా సీనియర్లు మాత్రం ఆమెకు సహకరించడం లేదు. సత్యవతి లేదా ఆమె భర్త ధర్మాకు ఈసారి టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే వర్గం కోరుతుంటే మరో నాయకుడు కూడా తనకు టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు.
కొందరు సీనియర్లయితే ఈసారి సత్యవతి కుటుంబానికి టికెట్ ఇస్తే సహించేది లేదని, నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఆమెపై వ్యతిరేకత ఉందని అంటున్నారు. కేంద్రమంత్రి బలరాంనాయక్ సూచించే మనిషికి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కాంతారావు, సత్యవతికి మళ్లీ టికెట్ వస్తుందా? వచ్చినా స్థానిక కేడర్ సహకరిస్తుందా? కొత్త ముఖాలు తెరపైకి వస్తాయా? అనేది చర్చనీయాంశమవుతోంది.
ఆ ఇద్దరి భవితవ్యం ఏమిటో?
Published Wed, Feb 5 2014 5:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
Advertisement
Advertisement