L. Black
-
వాస్తు బాగాలేదు.. జర చూసుకో..
చంద్రబాబుకు కేసీఆర్ సూచన సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో అత్యంత అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన కార్యాలయం కూడా వాస్తుకు అనుగుణంగా లేదట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు. గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనేటి విందు సందర్భంగా చర్చల్లో ఎల్ బ్లాక్ వాస్తు విషయాన్ని కేసీఆర్ చంద్రబాబు చెవిలో వేశారు. ఎల్ బ్లాక్‌లో మీకోసం ఏర్పాటు చేసిన కార్యాలయం ఏమాత్రం వాస్తుకు అనుగుణంగా లేదని, మరోసారి పరిశీలించుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాలకు సచివాలయంలో భవనాల విభజన జరిగిన తర్వాత ఏపీ సీఎంకు సౌత్ హెచ్ బ్లాక్ కేటాయించారు. అందుకోసం కోట్ల రూపాయలు కూడా వెచ్చించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సౌత్ హెచ్ బ్లాక్ ఏమాత్రం వాస్తుకు అనుగుణంగా లేదని వాస్తు నిపుణులు చెప్పడంతో సీఎం పేషీని ఎల్ బ్లాక్‌లో ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించారు. రూ.20 కోట్లలకు పైగా ఖర్చు చేశారు. దసరా రోజున బాబు కార్యాలయంలో ప్రవేశించారు. ఇంత చేసుకున్న తర్వాత గవర్నర్ తేనీటి విందు సందర్భంగా కేసీఆర్ వాస్తుకు అనుగుణంగా లేదని చెప్పడంతో మళ్లీ తర్జనభర్జన మొదలైనట్టు తెలిసింది. వాస్తు విషయాన్ని మరోసారి పరిశీలించాలని బాబు తన సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం. -
కొత్త కార్యాలయంలో బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయదశమి (శుక్రవారం) రోజున సచివాలయం ఎల్ బ్లాక్‌లోని కొత్త కార్యాలయంలోకి ప్రవేశించారు. వేద పండితుల మంత్రాలు, ఆశీర్వచనాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం 2.25 గంటలకు కొత్త చాంబర్లోకి అడుగు పెట్టారు. వేంకటేశ్వరస్వామి చిత్రపటానికి పూజలు చేశారు. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏడు మిషన్లలో ఒకటైన ప్రాథమిక రంగ మిషన్‌పై తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్‌బాబు, ప్రభుత్వ సమాచార సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి లంకల దీపక్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కార్యాలయం, సచివాలయ సిబ్బంది, సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ తదితరులు కూడా చంద్రబాబును అభినందించారు. ద్వితీయ విఘ్నం కలగకుండా చంద్రబాబు రెండో రోజు శనివారం తన కార్యాలయానికి వచ్చారు. 6న ప్రాథమిక రంగ మిషన్‌పై విధానపత్రం ప్రాథమిక రంగ మిషన్‌పై విధానపత్రాన్ని 6వ తేదీన అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చంద్రబాబు విడుదల చేయనున్నారు.