
వాస్తు బాగాలేదు.. జర చూసుకో..
- చంద్రబాబుకు కేసీఆర్ సూచన
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో అత్యంత అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన కార్యాలయం కూడా వాస్తుకు అనుగుణంగా లేదట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు. గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనేటి విందు సందర్భంగా చర్చల్లో ఎల్ బ్లాక్ వాస్తు విషయాన్ని కేసీఆర్ చంద్రబాబు చెవిలో వేశారు.
ఎల్ బ్లాక్‌లో మీకోసం ఏర్పాటు చేసిన కార్యాలయం ఏమాత్రం వాస్తుకు అనుగుణంగా లేదని, మరోసారి పరిశీలించుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాలకు సచివాలయంలో భవనాల విభజన జరిగిన తర్వాత ఏపీ సీఎంకు సౌత్ హెచ్ బ్లాక్ కేటాయించారు. అందుకోసం కోట్ల రూపాయలు కూడా వెచ్చించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సౌత్ హెచ్ బ్లాక్ ఏమాత్రం వాస్తుకు అనుగుణంగా లేదని వాస్తు నిపుణులు చెప్పడంతో సీఎం పేషీని ఎల్ బ్లాక్‌లో ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించారు.
రూ.20 కోట్లలకు పైగా ఖర్చు చేశారు. దసరా రోజున బాబు కార్యాలయంలో ప్రవేశించారు. ఇంత చేసుకున్న తర్వాత గవర్నర్ తేనీటి విందు సందర్భంగా కేసీఆర్ వాస్తుకు అనుగుణంగా లేదని చెప్పడంతో మళ్లీ తర్జనభర్జన మొదలైనట్టు తెలిసింది. వాస్తు విషయాన్ని మరోసారి పరిశీలించాలని బాబు తన సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం.