మీ పండుగ పాడుగాను..!
సాక్షి: 'పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి' అంటారు. కొన్ని చోట్ల జరిగే వెరైటీ ఫెస్టివల్స్ చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. కొంత మంది బుర్రలో తట్టిన వింత ఆలోచనల కారణంగానే ఇలాంటి పండుగలు పుట్టుకొచ్చాయి. సాధారణంగా పండుగల వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం, ప్రాధాన్యం ఉంటాయి. కానీ ఇలాంటివేమీ లేకుండా వేలం వెర్రిగా జరుపుకునే కొన్ని వెరైటీ ఫెస్టివల్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం.. !
స్పెయిన్‌లో జరిగే టమోటాల పండుగనే 'టమోటా యుద్ధం' అని కూడా అంటారు. దీన్ని ఆగస్టు చివరి బుధవారం జరుపుకుంటారు. ఇది 1945లో ప్రారంభమైంది. ఈ పండుగ రోజున అక్కడికి చేరుకునే జనం ఒక గంట పాటు ఒకరిపై ఒకరు టమోటాలు విసురుకుని ఆనందిస్తారు. అయితే ఇందులో పాల్గొన్న ప్రజలు గాయపడకుండా ఉండేందుకు టమోటాలను విసిరే ముందు నలిపేయాలనే షరతు కూడా ఉంది.
ఎలామొదలైంది..
టమోటా యుద్ధం మొదలైన తీరు హాస్యాస్పదంగా అనిపిస్తుంది. 1945 ఆగస్టు చివరి బుధవారం అక్కడ సంప్రదాయం ప్రకారం 'జెయింట్స్ అండ్ బిగ్ హెడ్స్' పెరేడ్ జరుగుతోంది. ఇందులో ఉత్సాహంగా పాల్గొన్న వారిలో ఒక యువకుడు కింద పడిపోయాడు. అతనికి కోపం వచ్చి చేతికి అందిన వస్తువునల్లా జనం మీదకు విసరడం మొదలు పెట్టాడు. ఇంతలో అటుగా వెళ్తున్న టమోటా బండి కనపడింది. అతను ఆ టమోటాలను కూడా విసరడం మొదలు పెట్టాడు.
తర్వాత అతనితో పాటు మిగిలిన జనం కూడా ఇలా చేయడం ప్రారంభించారు. పోలీసులు వచ్చే వరకు ఈ తంతు అలానే కొనసాగింది. ఈ పండుగ ఆరంభానికి ప్రారంభ సంఘటన ఇదే. ఇదేదో బావుంది కదా అని కొంత మంది యువత తర్వాత సంవత్సరం కూడా ఉత్తుత్తిగా గొడవపడి టమోటాలతో కొట్టుకున్నారు. ప్రతి ఏటా యువత ఇలా చేయడం ఇష్టపడుతుండటంతో ప్రభుత్వమే దీన్ని అధికారికంగా నిర్వహించడం మొదలు పెట్టింది. పర్యాటకులకు ఇది ప్రధాన ఆకర్షణగా మారింది.
జర్మనీలో ప్రతి ఏటా అక్టోబర్ 6న బాతుల పండుగను నిర్వహిస్తారు. అయితే ఇందులో నిజమైన బాతులను ఉపయోగించరు. పసుపుపచ్చ రంగులో ఉండే రబ్బరు బాతు బొమ్మలను ఈ పందెంలో ఉంచుతారు. బొమ్మలు తిరగబడకుండా ఉండేందుకు బాతు బొమ్మకు చిన్న ఇనుపముక్క కడతారు. ఈ పందెంలో వందలాది మంది పాల్గొంటారు. ఈ బొమ్మల మీద పేర్లు రాసుకుంటారు. ఎవరి బాతు ఎక్కువ దూరం ప్రయాణిస్తే వారు పందెంలో గెల్చినట్టు లెక్క. గెల్చిన వారికి 10,000 యూరోల బహుమతి (సుమారు రూ. 7 లక్షలు) లభిస్తుంది.
ఈ పండుగలో అందరూ ఒక చోట గుమికూడి రెడ్‌వైన్‌ను ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. జూన్ చివరి మూడు రోజుల్లో ఈ ఫెస్టివల్‌ను జరుపుకుంటారు. దక్షిణ స్పెయిన్‌లోని హారో అనే పట్టణంలో విదేశీయులతో కలిసి సుమారు 10,000 మంది ఇందులో పాల్గొంటారు. వీరంతా జగ్గులు, బకెట్స్, వాటర్ పిస్టల్స్‌తో సుమారు 1,30,000 లీటర్ల రెన్వైన్ చల్లుకుని తడిసిముద్దవుతారు.
ప్రత్యేకతలు..
బ్యాటిల్ ఆఫ్ వైన్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు వచ్చేవారు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకుని, వివరాలు నమోదు చేసుకోవాలి. ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే ఈ పండుగకి ఒక గంట ముందే చేరుకోవాలి.
ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరు కచ్చితంగా తెల్ల దుస్తులు ధరించాలి.
చిన్న పిల్లలకు ప్రవేశం లేదు. ఎవరి మీద ఎవరికీ కోపం ఉండకూడదు. కేవలం ఎదుటి వారి తెల్ల దస్తులను వైన్‌తో తడిపి రెడ్‌గా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం.
ఉదయం మొదలైన పండుగ సాయంత్రం వరకు కొనసాగుతుంది.