33 మంది ‘ఎర్ర’ కూలీల అరెస్ట్
చిత్తూరు (క్రైమ్),న్యూస్‌లైన్: శేషాచల అడవుల నుంచి ఎర్రచందనాన్ని తరలిస్తున్న 33 మంది కూలీలను చిత్తూరు ఒకటవ పట్టణ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అలాగే 15 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. శేషాచల అడవుల నుంచి ఎర్రచందనం తరలిస్తున్నట్లు చిత్తూరు ఒకటవ పట్టణ పోలీసులకు సమాచారం అందింది. డీఎస్పీ కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వన్‌టౌన్ సీఐ సాదిక్ అలీ, ఎస్ఐ లక్ష్మీకాంత్ రెడ్డిగుంట వద్ద శనివారం కాపుకాశారు. ఈ నేపథ్యంలో ఇరవై మందికిపైగా కూలీలు తమిళనాడు వైపు వెళుతున్న వాహనాలను ఆపి పారిపోవడానికి సిద్ధమయ్యారు.
సీఐ సాదిక్ అలీ హుటాహుటిన దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశా యి. శేషాచల అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను నరికి చెన్నైకి తరలిస్తున్నామని నిందితులు తెలిపారు. ఒకే వాహనంలో వెళితే పట్టుబడతామని ఎర్రచందనం దుంగలను రెడ్డిగుంట సమీపంలోని విజయా డెయిరీ పక్కన ఉన్న చెట్లపొదల్లో దాచి పెట్టామన్నారు.
నిందితులు తెలిపిన వివరాల ప్రకారం రెడ్డిగుంట సమీపంలో చెట్లపొదల్లో ఉన్న 15 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మరికొందరు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద 33 మంది కూలీలను అరెస్ట్ చేశారు. పట్టుబడిన కూలీలందరూ విల్లుపురం జిల్లాకు చెందిన వారేనని విచారణలో తేలింది. స్మగ్లర్‌ను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు.