చీటింగ్ కేసులో ‘డీసీ’ వెంకట్రామిరెడ్డి అరెస్టు
ఆయన సోదరుడు వినాయక్ కూడా..
సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో బ్యాంకుకు వందల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టారనే ఆరోపణలపై ‘దక్కన్ క్రానికల్’ ఆంగ్ల దినపత్రిక చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్ టి.వినాయక్ రవి రెడ్డిలను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. బెంగళూరుకు చెందిన సీబీఐ ‘బ్యాంకు సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ యూనిట్’కు సంబంధించిన దర్యాప్తు అధికారులు శనివారం వెంకట్రామిరెడ్డితో పాటు మరో ఇద్దరు ప్రమోటర్ల నివాసాలు, సికింద్రాబాద్లోని దక్కన్ క్రానికల్ పత్రికా కార్యాలయంపై ఏకకాలంలో దాడులు జరిపి సోదాలు నిర్వహించారు.
డీసీ చైర్మన్ వెంకటరామిరెడ్డి, ఆయన సోదరుడు వినాయక్ రవి రెడ్డిలను అదుపులోకి తీసుకుని కోఠిలోని సీబీఐ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. కెనరా బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు వెంకటరామిరెడ్డి, వినాయక్ రవి రెడ్డి, వైస్ చైర్మన్ పి.కె అయ్యర్లపై ఐపీసీ సెక్షన్ 120బీ, 420 , 468, 471 ల కింద కేసులు నమోదు చేసింది. తప్పుడు పత్రాలను తనఖా పెట్టి రూ.357.77 కోట్ల రుణం పొందారని కెనరా బ్యాంకు చేసిన ఫిర్యాదుపై 2013 జూలైలో ఈ కేసు నమోదైంది.
విచారణ అనంతరం సీబీఐ అధికారులు నిందితులకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మళ్లీ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తరలించారు. శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం ఆయన్ను సీబీఐ కోర్టుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశముంది. కాగా, 2008-2012 మధ్య మోసం, కుట్రపూరిత చర్యలతో కెనరా బ్యాంకుకు రూ.1,230 కోట్ల నష్టాన్ని కలిగించారని దక్కన్ క్రానికల్ యాజమాన్యంపై ఆరోపణలున్నాయి.