lack of supervision
-
నాగార్జునసాగర్‌లో జరిగిన ప్రమాదాలు
సాక్షి, నాగార్జునసాగర్: శ్రీశైలం ఎడమ భూగర్భ జల విద్యుదుత్పాదన కేంద్రంలో గురువారం రాత్రి విద్యుత్ ప్రమాదం జరిగి పలువురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి కారణంఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, తప్పు జరిగిన చోట పైరవీలకు తావిచ్చి వారిపై చర్యలు తీసుకోకపోవడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ప్రధానమైన విద్యుదుత్పాదన కేంద్రాల్లో నాగార్జునసాగర్ ఒకటి. ఇందులో గతంలో పలు ప్రమాదాలు జరిగాయి. (డ్యూటీ ముగిసినా.. విధుల్లోకి వెళ్లి..) సాగర్‌లో జరిగిన ప్రమాదాలు.. నాగార్జునసాగర్‌లోని ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రంలో.. సాగర్ జలాశయం నుంచి విద్యుదుత్పాదన చేయడంతో పాటు ఆ టర్బైన్లనే పంపులుగా వాడి నీటిని తిరిగి జలాశయంలోకి ఎత్తిపోస్తుంటారు. ఈ క్రమంలో టర్బైన్‌లోకి నీరు రాకుండా పెన్‌స్టాక్ ఉంటుంది. దానికి గేట్ ఉంటుంది. ఆ పెన్‌స్టాక్ గేటును తెరవకుండానే ఇంజనీర్లు నిర్లక్ష్యంగా18 ఫిబ్రవరి 2019న 7వ యూనిట్ టర్బైన్‌పై లోడ్ వేయడంతో.. టెయిల్‌పాండ్‌లో నుంచి తోడిన నీరంతా 50 మీటర్ల ఎత్తున ఉన్న ఎయిర్‌మెంట్‌వాల్‌లో నుంచి బయటకు వచ్చి స్విచ్ యాడ్ నిండింది. ఆ నీరు పడగానే కండక్టు, గవర్నర్లు తగలబడి మూడు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. దీంతో రెండు ఫీడర్లలో నుంచి వెళ్లే విద్యుత్ నిలిచిపోయింది. అలాగే 8వ యూనిట్లో షార్ట్‌సర్క్యూట్‌తో ఎలక్ట్రిక్ ప్యానెళ్లు తగలబడి నేటికి మరమ్మతులకు నోచుకోలేదు. (విషాదం: లోపలున్న 9 మందీ మృతి) మూడో యూనిట్ పరిస్థితి అలాగే ఉంది. గతంలో పాడైపోయి సర్వీసింగ్ పనులు జరుగుతున్న మూడో యూనిట్ నడవడం లేదు. వీటి మరమ్మతులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. గతంలో ఎడమ కాల్వపై ఉన్న విద్యుదుత్పాదన కేంద్రంలో ఒకటో టర్బైన్ పెన్‌స్టాక్ పాడైపోయి ఓపెన్ వెల్ నుంచి టర్బైన్‌లోకి నీరు చొచ్చుకు వచ్చి రెండు యూనిట్లు మునిగి పోయాయి. కోట్ల రూపాయలతో మరమ్మతులు చేశారు. ఇలాంటి సంఘటనలు జరిగినా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారని పలువురు విమర్శిస్తున్నారు. -
లేజీఎస్!
రాయికోడ్(అందోల్): ఈజీఎస్ (ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీం) పనులు జిల్లాలోని ఆయా మండలాల్లో నత్తనడకన సాగుతున్నాయి. చేసిన పనులకు సంబంధించి కూలీల వేతనాలు, మెటీరియల్ కాంపోనెంట్ నిధులు సక్రమంగా విడుదల కావడం లేదు. నాడెం కంపోస్టు పిట్స్, పాఠశాలల కిచెన్ షెడ్స్, ఇంకుడు గుంతలు, పశువుల పాకలు, సేద్యపు నీటి గుంతలు, డంపింగ్ యార్డులు తదితర పనులు మందకొడిగా సాగుతున్నాయి. 2016 నుంచి ఆయా రకాల పనులు మంజూరైనా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేక, గ్రామీణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అవగాహన లేక, బిల్లులు సకాలంలో అందుతాయనే భరోసా లేక మంజూరైన పనులు నిదానంగా నడుస్తున్నాయి. సేద్యపు నీటి గుంతలు.. జిల్లాలో 3,031 సేద్యపు నీటి గుంతలకు 777 గుంతలే వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే సేద్యపు నీటి గుంతలను నిర్మింపజేసి పంటల సాగులో రైతులు ఎదుర్కొనే నీటి ఇబ్బందులను తీర్చాల్సి ఉండగా పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడంలేదు. పూర్తికాని పశువుల పాకలు.. జిల్లాలోని ఆయా మండలాల్లో 558 నిర్మించాల్సి ఉండగా 55 పశువుల పాకలు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. పశువుల పాకలు లేక పోషకులు తాము పోషిస్తున్న పశువులను ఆరుబయట కట్టేస్తున్నారు. ఈ దశలో పశువులు, పోషకుల ప్రయోజనం కోసం మంజూరు చేసిన పాకలు పూర్తి చేయడంలో క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు, సిబ్బందికి చిత్తశుద్ధి కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. 306 మాత్రమే పూర్తయిన కంపోస్ట్ పిట్స్.. 1,333 నాడెం కంపోస్టు పిట్స్ మంజూరు కాగా 306 మాత్రమే ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇంకుడు గుంతలు అంతంతే.. 53,138 ఇంకుడు గుంతలు మంజూరవగా ఇప్పటివరకు 22,013 ఇంకుడుగుంతలు మాత్రమే పూర్తి చేశారు. ప్రస్తుతం ఎక్కడా ఇంకుడుగుంతల నిర్మాణం చురుగ్గా సాగుతున్న పరిస్థితులు లేవు. ఇంకుడుగుంతలు నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఈ పనులు చేపట్టడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. పూర్తికాని డంపింగ్ యార్డులు.. జిల్లాకు 330 డంపింగ్ యార్డులు మంజూరయ్యాయి. ఇందులో 142 డంపింగ్ యార్డులు మాత్రమే ప్రారంభమయ్యాయి. డంపింగ్ యార్డుల నిర్మాణంలో అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదనే వాదనలు వినవస్తున్నాయి. పూర్తయిన కిచెన్ షెడ్లు 128 మాత్రమే.. ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు 539 కిచెన్ షెడ్లు మంజూరు చేయగా 128 మాత్రమే పూర్తయినట్లు ఈజీఎస్ అధికారులు వెల్లడించారు. శ్మశాన వాటికల అభివృద్ధి పనులు సైతం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. వివిధ రకాల పనులు మంజూరవుతున్నా వాటిని పూర్తి చేయడంలోనే లోపాలు కనిపిస్తున్నాయి. కొరవడిన పర్యవేక్షణ.. ఈజీఎస్ పనులపై పర్యవేక్షణ లేక ఆశించిన స్థాయి లో పనుల్లో పురోగతి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా, మండల స్థాయిలోని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ప్రాధాన్యతనిచ్చి ప్రజల్లో ఈజీఎస్ పనులపై సరైన అవగాహన కల్పిస్తే ఆశిం చిన లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా గ్రామాల్లో పనుల పురోగతి అందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పటికైనా పటిష్ట ప్రణాళికలు వేసి మంజూరైన అన్నిరకాల ఈజీఎస్ పనులను పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. -
మధ్యాహ్నం.. అధ్వానం
⇒ మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయం ⇒ మెత్తని అన్నం.. నీళ్లచారే దిక్కు ⇒ ఇంటి నుంచి తెచ్చుకుని తింటున్న విద్యార్థులు ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యా హ్న భోజనం పథకం అధ్వానంగా మారుతోంది. ఉడికీఉడకని మెత్తటి అన్నం.. నీళ్లచారుతో విద్యార్థులు కడుపు నింపుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. వారానికి మూడు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నిర్వాహకులు ఒక గుడ్డు ఇవ్వడానికే పరిమితమవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో లక్ష్యం నీరుగారుతోంది. జిల్లాలోని చాలా ఏజెన్సీలు మెనూ పాటించడం లేదు. నీళ్లచారు, మెత్తటి అన్నంతో సరిపెడుతున్నారు. దీంతో సగం మంది విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని తింటున్నారు. మరికొంత మంది నాణ్యతలేని భోజనం చేస్తూ అవస్థలు పడుతున్నారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, పాఠశాలలో ఉపాధ్యాయులు పట్టించుకోక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 1172 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలున్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 954 ఉండగా, 44,064 మంది విద్యార్థులు చదువుతున్నారు. 112 ప్రాథమికోన్నత పాఠశాలుండగా ఇందులో 18,073 మంది, 106 ఉన్నత పాఠశాలల్లో 10,304 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 72,441 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి రూ.4.13 పైసలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి రూ.6.18పైసల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. అలాగే ఒక్కో విద్యార్థికి వారానికి మూడు కోడిగుడ్లు పెట్టాలి. ఒక్కో గుడ్డుకు రూ.4 చొప్పున నిధులు విడుదల చేస్తోంది. నాణ్యతలేని భోజనమే దిక్కు.. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు కేటాయిస్తోంది. బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. ప్రతీరోజు విద్యార్థులకు అన్నం, సాంబార్, పప్పు వండిపెట్టాలి. కానీ చాలా ఏజెన్సీలు కక్కుర్తితో నీళ్లచారు వడ్డిస్తున్నారు. వారంలో మూడుసార్లు ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ చాలా పాఠశాలల్లో ఇది అమలు కావడం లేదు. వారంలో ఒకరోజు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు. కొన్నిచోట్ల కోడిగుడ్లకు బదులు అరటిపండ్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. సన్నరకం బియ్యం అయినప్పటికీ అన్నం మెత్తగా కావడంతో సగం మంది విద్యార్థులు తినలేకపోతున్నారు. ఇంటినుంచి టిఫిన్ బాక్సులు తెచ్చుకుని పాఠశాలల్లో భోజనం చేస్తున్నారు. కొంతమంది ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజన నిర్వాహకులతో కుమ్మక్కై భోజనం చేయని విద్యార్థుల డబ్బులు కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. లోపించిన పర్యవేక్షణ.. ఏజెన్సీల నిర్లక్ష్యం, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ప్రధాన సమస్యగా మారిం ది. విద్యార్థులకు మెరుగైన ఆహారం అందడం లేదు. ఆయా మండలాల్లోని పాఠశాలల్లో మండ ల విద్యాధికారులు కనీసం పాఠశాలలను నెలకోసారి తనిఖీ చేయాలి. కానీ ఎక్కడా అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. చాలామంది ఎంఈవోలు కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. వీరితో పాటు ఉప విద్యాధికారులు తనిఖీ చేయాల్సి ఉండగా, వారు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. వారం భోజనం సోమవారం ఉడికించిన కోడిగుడ్లు, అన్నం, సాంబార్ మంగళవారం కూరగాయలతో భోజనం బుధవారం అన్నం, పప్పు, కూరగాయలతో భోజనం, ఉడికించిన కోడిగుడ్లు గురువారం సాంబార్ పప్పు భోజనం శుక్రవారం కూరగాయలతో భోజనం, ఉడికించిన కోడిగుడ్లు శనివారం పప్పు, ఆకుకూరలతో భోజనం పకడ్బందీగా అమలు చేస్తాం మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. మెనూ ప్రకారం పాఠశాలల్లో భోజనం పెట్టాలి. వారానికి మూడు ఉడికించిన కోడిగుడ్లు విద్యార్థులకు ఇవ్వాలి. ప్రధానోపాధ్యాయులు ప్రతీరోజు మధ్యాç ßæ్న భోజనాన్ని పర్యవేక్షించాలి. కుకింగ్ కాస్ట్ కూడా పెరిగింది. నిర్వాహకులు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించా లి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. – కె.లింగయ్య, డీఈవో, ఆదిలాబాద్ గర్భిణులకు రక్త పరీక్షలు తప్పనిసరి ఉట్నూర్‌రూరల్(ఖానాపూర్): గర్భిణులు రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో వసంత్‌రావు అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందులోభాగంగా బుధవారం మండల కేంద్రంలోని సబ్సెంటర్లో ఆయన గర్భిణులకు చేస్తున్న రక్త పరీక్షలు, బీపీ పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 39 సబ్‌సెంటర్ల పరధిలోని గర్భిణులకు కూడా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆయన వెంట ఏఎంవో వెంకటేశ్వర్లు తదితరులున్నారు.