lady maoist
-
నా భూమి ఇవ్వకపోతే మళ్లీ నక్సలైట్‌నవుతా
సూపర్‌బజార్(కొత్తగూడెం): పునరావాసం కింద తనకిచ్చిన మూడు సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని, తిరిగి తనకు ఆ భూమిని ఇప్పించాలని, లేనిపక్షంలో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్తానని జనశక్తి మాజీ మహిళా నక్సలైట్ ఇట్ల పుష్పకుమారి శుక్రవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో జనశక్తి అజ్ఞాతదళంలో పనిచేసి లొంగిపోయిన కారణంగా తనకు పునరావాసం కింద 3 సెంట్ల భూమిని మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీ రాజీవ్‌గాంధీనగర్‌లో 2010లో కేటాయించారని తెలిపారు. ఆర్థిక స్థోమత లేక అక్కడ ఇల్లు కట్టుకోలేకపోవడంతో కొందరు వ్యక్తులు ఆ స్థలాన్ని ఆక్రమించారన్నారు. రెండేళ్లుగా తన భూమిని తనకు ఇప్పించాలని మణుగూరు తహసీల్దార్‌తోపాటు భద్రాచలం ఆర్డీఓ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు విన్నవించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ వరకు వెళ్లానని, ఇటీవల కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం కూడా ఇచ్చానని చెప్పారు. భర్త లేని తనకు న్యాయం చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని, తనకు సరైన న్యాయం జరగకపోతే తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లడానికి సిద్ధమవుతానని వెల్లడించారు. పోలీసులు, కలెక్టరేట్ ఏఓ నాగేశ్వరరావు వచ్చి ప్రత్యామ్నాయంగా స్థలం చూపించడానికి చర్యలు చేపడతామని చెప్పినప్పటికీ తనకు కేటాయించిన స్థలాన్నే తనకు ఇవ్వాలి తప్ప వేరే స్థలాన్ని ఇస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేస్తూ ఆందోళనకు దిగింది. సాయంత్రం వరకు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసినప్పటికీ అధికారులు అందుబాటులో లేకపోవడంతో సరైన హామీ లభించడం లేదని పేర్కొంటూ సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా మరోసారి కలెక్టర్‌కు తన ఆవేదనను వ్యక్తం చేస్తానని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే తిరిగి నిరవధిక ఆందోళనకు సిద్ధమవుతానని నిరసన విరమించింది. -
తుళ్లూరులో మావోయిస్టు అరెస్టు కలకలం
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం జరుగుతున్న తుళ్లూరులో మావోయిస్టుల కలకలం రేగింది. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో మావోయిస్టు పార్టీ మహిళా నేత భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణ అలియాస్ పద్మను మంగళవారం మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర సంచలనం కలిగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి సమీపంలోని తాళ్లాయపాలెంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోవడం చూస్తుంటే మావోయిస్టుల టార్గెట్ రాజధాని ప్రాంతంపై పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ సీనియర్ కమాండెంట్ నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న భార్య, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో డిప్యూటీ కమాండెంట్‌గా పనిచేసిన ఆమెను ఎస్ఐబీ పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలోని తన సోదరి వెంకటరత్నం ఇంట్లో చికిత్స పొందుతుండగా అన్నపూర్ణను ఎస్ఐబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టవేరా వాహనంలో సివిల్ డ్రస్సులో వచ్చిన ఎస్ఐబీ పోలీసులు అరుణను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే, ఛత్తీస్‌గఢ్ నుంచి అందిన సమాచారం మేరకే హైదరాబాద్ నుంచి ఎస్ఐబీ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం తాళ్లాయపాలెం చేరుకుని అన్నపూర్ణను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అన్నపూర్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే, ఆమె రెక్కీలో భాగంగానే పలుమార్లు రాజధాని ప్రాంతంలో సంచరించినట్లు ఎస్ఐబీ అధికారులు భావిస్తున్నారు. రాజధాని ప్రాంతంతోపాటు జిల్లాలో జరుగుతున్న ఇసుక మాఫియా, భూమాఫియాపై మావోయిస్టు నేతలు దృష్టి సారించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధుల సోదరులు, తనయులకు వీరి నుంచి హెచ్చరికలు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి తోడు రాజధాని ప్రాంతంలో పనులు లేక రైతు కూలీలు అల్లాడిపోతుండడంతో మావోయిస్టు నేతలు ఇదే అదనుగా భావించి రంగంలో దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఆమెను గుంటూరుకు చేరుస్తున్నారా, లేదా విజయవాడకు తరలించి విచారిస్తున్నారనే విషయంలో స్పష్టత లేదు. కీలక నేతల తనయులపై వీరు రెక్కీ నిర్వహిస్తున్నట్లు అనుమానంతో అరుణను అత్యంత రహస్యంగా పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రాజధాని ప్రాంతంలో మావోయిస్టు కీలక మహిళా నేత పోలీసుల అదుపులో తీసుకోవడం తీవ్ర సంచలనం కలిగిస్తోంది. అన్నపూర్ణపై రూ. 5 లక్షల రివార్డు భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణ ఆలియాస్ పద్మ జన్మస్థలం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామం. ఈమె గతంలో మావోయిస్టు నల్లమల జిల్లా కమాండర్‌గా పనిచేసి అనేక కీలకమైన సంఘటనల్లో పాల్గొంది. బొల్లాపల్లి మండలం బండ్లమోడు-రేమిడిచర్ల మధ్య 2002లో మందు పాతర పేల్చిన ఘటనలో అన్నపూర్ణ కీలక బాధ్యతలు నిర్వర్తించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్నపూర్ణ తలపై రూ. 5లక్షల రివార్డు ప్రకటించినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆమె అరెస్టుపై పోలీసు అధికారులు మాత్రం పెదవి విప్పడం లేదు. అయితే మరోవైపు అన్నపూర్ణ సోదరి వెంకటరత్నం భర్త బాలస్వామిని సైతం తుళ్లూరు పోలీసుస్టేషన్‌కు పిలిచి విచారిస్తున్నట్లు సమాచారం.