
నిరసన వ్యక్తంచేస్తున్న పుష్పకుమారి
సూపర్‌బజార్(కొత్తగూడెం): పునరావాసం కింద తనకిచ్చిన మూడు సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని, తిరిగి తనకు ఆ భూమిని ఇప్పించాలని, లేనిపక్షంలో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్తానని జనశక్తి మాజీ మహిళా నక్సలైట్ ఇట్ల పుష్పకుమారి శుక్రవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో జనశక్తి అజ్ఞాతదళంలో పనిచేసి లొంగిపోయిన కారణంగా తనకు పునరావాసం కింద 3 సెంట్ల భూమిని మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీ రాజీవ్‌గాంధీనగర్‌లో 2010లో కేటాయించారని తెలిపారు. ఆర్థిక స్థోమత లేక అక్కడ ఇల్లు కట్టుకోలేకపోవడంతో కొందరు వ్యక్తులు ఆ స్థలాన్ని ఆక్రమించారన్నారు. రెండేళ్లుగా తన భూమిని తనకు ఇప్పించాలని మణుగూరు తహసీల్దార్‌తోపాటు భద్రాచలం ఆర్డీఓ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు విన్నవించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ వరకు వెళ్లానని, ఇటీవల కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం కూడా ఇచ్చానని చెప్పారు.
భర్త లేని తనకు న్యాయం చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని, తనకు సరైన న్యాయం జరగకపోతే తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లడానికి సిద్ధమవుతానని వెల్లడించారు. పోలీసులు, కలెక్టరేట్ ఏఓ నాగేశ్వరరావు వచ్చి ప్రత్యామ్నాయంగా స్థలం చూపించడానికి చర్యలు చేపడతామని చెప్పినప్పటికీ తనకు కేటాయించిన స్థలాన్నే తనకు ఇవ్వాలి తప్ప వేరే స్థలాన్ని ఇస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేస్తూ ఆందోళనకు దిగింది. సాయంత్రం వరకు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసినప్పటికీ అధికారులు అందుబాటులో లేకపోవడంతో సరైన హామీ లభించడం లేదని పేర్కొంటూ సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా మరోసారి కలెక్టర్‌కు తన ఆవేదనను వ్యక్తం చేస్తానని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే తిరిగి నిరవధిక ఆందోళనకు సిద్ధమవుతానని నిరసన విరమించింది.

నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్న పోలీసులు, ఏఓ
Comments
Please login to add a commentAdd a comment