తుళ్లూరులో మావోయిస్టు అరెస్టు కలకలం | lady maoist arrested in AP capital Amaravathi | Sakshi
Sakshi News home page

తుళ్లూరులో మావోయిస్టు అరెస్టు కలకలం

Published Tue, Apr 5 2016 9:19 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

తుళ్లూరులో మావోయిస్టు అరెస్టు కలకలం - Sakshi

తుళ్లూరులో మావోయిస్టు అరెస్టు కలకలం

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం జరుగుతున్న తుళ్లూరులో మావోయిస్టుల కలకలం రేగింది. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో మావోయిస్టు పార్టీ మహిళా నేత భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణ అలియాస్ పద్మను మంగళవారం మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర సంచలనం కలిగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి సమీపంలోని తాళ్లాయపాలెంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోవడం చూస్తుంటే మావోయిస్టుల టార్గెట్ రాజధాని ప్రాంతంపై పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ సీనియర్ కమాండెంట్ నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న భార్య, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో డిప్యూటీ కమాండెంట్‌గా పనిచేసిన ఆమెను ఎస్‌ఐబీ పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలోని తన సోదరి వెంకటరత్నం ఇంట్లో చికిత్స పొందుతుండగా అన్నపూర్ణను ఎస్‌ఐబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టవేరా వాహనంలో సివిల్ డ్రస్సులో వచ్చిన ఎస్‌ఐబీ పోలీసులు అరుణను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే, ఛత్తీస్‌గఢ్ నుంచి అందిన సమాచారం మేరకే హైదరాబాద్ నుంచి ఎస్‌ఐబీ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం తాళ్లాయపాలెం చేరుకుని అన్నపూర్ణను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

అన్నపూర్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే, ఆమె రెక్కీలో భాగంగానే పలుమార్లు రాజధాని ప్రాంతంలో సంచరించినట్లు ఎస్‌ఐబీ అధికారులు భావిస్తున్నారు. రాజధాని ప్రాంతంతోపాటు జిల్లాలో జరుగుతున్న ఇసుక మాఫియా, భూమాఫియాపై మావోయిస్టు నేతలు దృష్టి సారించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధుల సోదరులు, తనయులకు వీరి నుంచి హెచ్చరికలు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి తోడు రాజధాని ప్రాంతంలో పనులు లేక రైతు కూలీలు అల్లాడిపోతుండడంతో మావోయిస్టు నేతలు ఇదే అదనుగా భావించి రంగంలో దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అదుపులోకి తీసుకున్న ఆమెను గుంటూరుకు చేరుస్తున్నారా, లేదా విజయవాడకు తరలించి విచారిస్తున్నారనే విషయంలో స్పష్టత లేదు. కీలక నేతల తనయులపై వీరు రెక్కీ నిర్వహిస్తున్నట్లు అనుమానంతో అరుణను అత్యంత రహస్యంగా పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రాజధాని ప్రాంతంలో మావోయిస్టు కీలక మహిళా నేత పోలీసుల అదుపులో తీసుకోవడం తీవ్ర సంచలనం కలిగిస్తోంది.

అన్నపూర్ణపై రూ. 5 లక్షల రివార్డు
భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణ ఆలియాస్ పద్మ జన్మస్థలం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామం. ఈమె గతంలో మావోయిస్టు నల్లమల జిల్లా కమాండర్‌గా పనిచేసి అనేక కీలకమైన సంఘటనల్లో పాల్గొంది. బొల్లాపల్లి మండలం బండ్లమోడు-రేమిడిచర్ల మధ్య 2002లో మందు పాతర పేల్చిన ఘటనలో అన్నపూర్ణ కీలక బాధ్యతలు నిర్వర్తించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్నపూర్ణ తలపై రూ. 5లక్షల రివార్డు ప్రకటించినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆమె అరెస్టుపై పోలీసు అధికారులు మాత్రం పెదవి విప్పడం లేదు. అయితే మరోవైపు అన్నపూర్ణ సోదరి వెంకటరత్నం భర్త బాలస్వామిని సైతం తుళ్లూరు పోలీసుస్టేషన్‌కు పిలిచి విచారిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement