‘నియో’తో సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట..ఏమిటి ఈ ‘నియో’? | CID To Launch Special Portal To Avoid Cyber Crimes | Sakshi
Sakshi News home page

‘నియో’తో సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట..ఏమిటి ఈ ‘నియో’?

Published Sat, Nov 13 2021 10:43 AM | Last Updated on Sat, Nov 13 2021 12:15 PM

CID To Launch Special Portal To Avoid Cyber Crimes - Sakshi

విజయవాడలోని సుబ్బారావు ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. అందులో లింక్‌ మీద క్లిక్‌ చేయగానే.. ఆయన నెట్‌ బ్యాంకింగ్‌ ఖాతా నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.3 లక్షలు తమ ఖాతాకు మళ్లించేసుకున్నారు. విశాఖపట్నంలోని అప్పలనాయుడుకు ఆగంతకులు ఫోన్‌ చేసి ఆయనకు బ్యాంకు రుణం మంజూరైందని చెప్పారు. ఆయన ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్‌ చెప్పమన్నారు. ఆ విషయం నిజమేనని భావించిన అప్పలనాయుడు తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్‌ చెప్పారు. అంతే ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2 లక్షల నగదును సైబర్‌ నేరగాళ్లు తమ బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేసేసుకున్నారు. 

నెల్లూరుకు చెందిన దివ్యశ్రీ ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తుండగా ఆమె ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. ఆ మెసేజ్‌ను కాపీ చేసి వచ్చిన నంబర్‌కు పంపించాలని ఆగంతకులు కోరారు. ఆమె మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేయగానే ఆమె బ్యాంకు ఖాతాలోని రూ.లక్ష నగదును తమ ఖాతాకు మళ్లించుకున్నారు.  
– సాక్షి, అమరావతి

ఈ మూడు సందర్భాల్లోనూ బాధితులు తాము మోసపోయామని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి బాధితుల బ్యాంకు ఖాతాలున్న బ్యాంకులకు సమాచారం ఇచ్చేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. అప్పటికే సైబర్‌ నేరగాళ్లు బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేసుకున్నారు. వారు బ్యాంకుకు ఇచ్చినవి కూడా తప్పుడు చిరునామాలే. దీంతో బాధితులు తాము కోల్పోయిన మొత్తాన్ని తిరిగి పొందలేకపోయారు. ఇలా నెట్‌బ్యాంకింగ్, ఇ–కామర్స్, ఓటీపీ మోసాలు దేశంలో గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగం ‘నియో’ పేరిట ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది. బాధితులు తాము మోసపోయాని గుర్తించిన 24 గంటల్లోగా ఈ పోర్టల్‌ను సంప్రదిస్తే.. కాలయాపన లేకుండా వెంటనే సంబంధిత బ్యాంకు ఖాతాను స్తంభింపజేసి బాధితులు కోల్పోయిన నగదును వారికి తిరిగి చెల్లించేలా చేస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో ఈ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు.  

అఖిల భారత స్థాయిలో నెట్‌వర్క్‌ 
సైబర్‌ ఆర్థిక నేరస్తులు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉండి మోసాలకు పాల్పడుతున్నారు. వారి ఆటకట్టించేందుకు కేంద్ర, రాష్ట్ర పోలీసులు కూడా జాతీయస్థాయిలో ఓ ప్యానెల్‌ను రూపొందించారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల సైబర్‌ పోలీసు విభాగాలు సమన్వయంతో వ్యవహరిస్తాయి. దీనికోసం యూపీఐ గేట్‌వేలు, ఇ–పేమెంట్‌ పోర్టళ్లు, తదితర సంస్థలతో సైబర్‌ పోలీసు విభాగాలను అనుసంధానించారు. తద్వారా ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టడంలో ఆయా సంస్థలను కూడా జవాబుదారిగా చేయనున్నారు. సీఐడీ విభాగం ఇప్పటికే ‘నియో’ పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. సాంకేతిక అంశాలతో సహా ఈ పోర్టల్‌ పనితీరు సంతృప్తికరంగా ఉందని నిర్ధారించారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియో పోర్టల్‌ను 
ప్రారంభిస్తారు.   

ఏమిటి ఈ ‘నియో’? 
సైబర్‌ ఆర్థిక నేరాల బాధితులు ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర సీఐడీ విభాగం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌.. ‘నియో’. నెట్‌ బ్యాంకింగ్, ఇ–కామర్స్, ఓటీపీ మోసాలను సమర్థంగా అరికట్టేందుకు ఈ పోర్టల్‌ దోహదపడుతుంది. ఈ పోర్టల్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు సీఐడీ విభాగం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించింది. ఈ పోర్టల్‌ ఇలా పనిచేస్తుంది.. 

బాధితులు తాము మోసపోయామని గుర్తించిన 24 గంటల్లోగా సంప్రదించడానికి టోల్‌ఫ్రీ నంబర్‌ 155260ను అందుబాటులోకి తెచ్చారు.   ఆ కాల్‌ సీఐడీ ప్రధాన కార్యాలయంలోని నియో పోర్టల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరుతుంది. ఆ వెంటనే ఫిర్యాదుదారు పేరిట ప్రత్యేక ఐడీ నంబర్‌ను ఇస్తారు.  

ఆ వెంటనే బాధితుల బ్యాంకు ఖాతాలోని నగదు బదిలీ అయిన బ్యాంకును సీఐడీ అధికారులు సంప్రదిస్తారు. సైబర్‌ నేరగాళ్ల బ్యాంకు ఖాతాను స్తంభింపజేస్తారు. ఆ ఖాతా నుంచి నగదు విత్‌డ్రాకు అవకాశం లేకుండా చేస్తారు. అనంతరం నియో పోర్టల్‌ సిబ్బంది ఆ ప్రత్యేక ఐడీ నంబరుతో నమోదైన ఫిర్యాదును బాధితుల నివాస ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేస్తారు. ఆ కేసు విచారణ, న్యాయ ప్రక్రియ పూర్తి చేశాక కోర్టు ద్వారా బాధితులకు కోల్పోయిన మొత్తాన్ని చెల్లిస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement