సాక్షి, విజయవాడ: ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఐదుగురి పేర్లను కొత్తగా నిందితులుగా చేర్చింది దర్యాప్తు సంస్థ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్(AP CID). సోమవారం నలుగురి పేర్లను చేరుస్తూ.. అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది.
మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీల ( నారాయణ కళాశాల ఉద్యోగి ధనంజయ్ భార్య), ఆవుల మణి శంకర్( నారాయణ బంధువు), రాపూరి సాంబశివరావు( రమాదేవి బంధువు), వరుణ్ కుమార్ కొత్తాపు పేర్లు కేసులో చేర్చాలని మెమో దాఖలు చేసింది సీఐడీ. క్రైం నంబర్ 16/2021 గా ఇప్పటికే ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన ఏపీ సీఐడీ.. సెక్షన్ 120(b), 409, 420,166,167,34,35,37,218 IPC మరియు 13(2), 13(1) ఆఫ్ పీసీ యాక్ట్ గా కేసు నమోదు చేసింది కూడా.
ఇదే స్కాంలో చంద్రబాబు నాయుడు ఏ1గా, మాజీ మంత్రి పి.నారాయణ ఏ2గా, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఏ14గా ఉన్నారు. తాజాగా.. నారాయణ భార్య రమాదేవిని ఏ15గా, రావూరి సాంబశివరావు ఏ-16, ఏ-17గా ఆవుల మణిశంకర్, ఏ-18గా ప్రమీల, వరుణ్‌కుమార్ కొత్తాపును ఏ19గా చేర్చింది.
ఈ కేసుకు సంబంధించి నారా లోకేష్‌కు, నారాయణకు తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసింది సీఐడీ. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏ1 చంద్రబాబు పిటిషన్ వేయగా.. ఏపీ హైకోర్టు ఇవాళ ఆ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.
ఇదీ చదవండి: నారా-నారాయణ దోపిడీ.. ఇలా..
Comments
Please login to add a commentAdd a comment