మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు ఎదురు దెబ్బే తగిలింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ ఖరారు పేరిట జరిగిన కుంభకోణం కేసులో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. విచారణకు సహకరించాల్సిందేనంటూ ఏ-14 లోకేష్‌కు తేల్చి చెప్పి.. కుట్రను బయటపెట్టిన దర్యాప్తు సంస్థకు ఫ్రీ హ్యాండ్ అందించింది. ఇప్పుడు లోకేష్ నుంచి సదరు భూ దోపిడీలో నిజాలు రాబట్టేందుకు ఏపీ సీఐడీ ప్రయత్నించాల్సి ఉంది.
ఇప్పటికే చంద్రబాబు అవినీతి గుట్టు కదులుతోంది. ఒక్కొక్కటిగా స్కామ్‌లన్నీ బయటపడుతున్నాయి. అయితే ఈ స్కామ్‌లన్నింటిలోనూ తనయుడు నారా లోకేష్ హస్తం ఉన్నట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది అందుకే అన్ని కేసుల్లోనూ ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. ఇక.. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో అయితే నారా లోకేష్ పాత్ర మామూలుగా లేదు. ప్లాన్డ్‌గా తండ్రీకొడుకులు లబ్ధి పొందే యత్నాలు చేశారు. ఏపీ సీఐడీ సేకరించిన పక్కా ఆధారాలు గమనిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది.
ఏకంగా.. లోకేశ్ పాత్రకు సంబంధించి కీలకమైన 129 ఆధారాలను ఏపీ సీఐడీ సిట్ బృందం గుర్తించి, జప్తు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంటే లోకేష్ ఏమేర ఇందులో ఇన్‌వాల్వ్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు.
సిట్ సేకరించిన ఆధారాల్లో..
►సీఆర్‌డీఏ, మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన కీలక పత్రాలు, ఈమెయిల్ సందేశాలు, మ్యాపులు
►టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన అధికారులు, ప్రైవేటు ఏజెన్సీల ప్రతినిధుల వాంగ్మూలాలు
►కొందరు కీలక అధికారులు సంబంధిత నోట్ ఫైళ్లలో తాము లిఖితపూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను బేఖాతరు చేసి మరీ ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారని పేర్కొనడం గమనార్హం.
► మరోవైపు ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించిన ప్రైవేటు ఏజెన్సీలు కూడా ఇదే విషయాన్ని తెలిపాయి.
► నిబంధనలకు విరద్ధంగానే ఐఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్‌ను నిర్ధారించారని సిట్ అధికారులకు ఈమెయిల్స్ పంపాయి.
► ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్ కోసం నిర్వహించిన సర్వే నివేదికను కూడా సిట్ అధికారులు జప్తు చేశారు.
వీటన్నింటిలో లోకేశ్‌దే కీలక పాత్ర అని సిట్ సేకరించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
క్విడ్‌ప్రోకో ద్వారా..
టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్ ఖరారు పేరిట జరిగిన భూ దోపిడీలో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్ కీలక పాత్ర పోషించినట్లు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చెబుతోంది. ఈమేరకు ఈ కేసులో లోకేశ్‌ను ఏ–14గా చేర్చినట్లు న్యాయస్థానానికి సమర్పించిన మెమోలో పేర్కొంది. ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్ పేరిట చంద్రబాబు, లోకేశ్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని, తద్వారా తమ కుటుంబానికే చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌కు, లింగమనేని కుటుంబానికి చెందిన భూముల విలువ అమాంతం పెరిగేలా అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది.
సొంత కంపెనీకి భూములు
టీడీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న చంద్రబాబు అధికారిక నివాసంలోనే తనయుడు లోకేశ్ కూడా నివసించారు. రాజధాని ఎక్కడ నిర్మిస్తారన్నది ముందుగానే తెలియడంతో తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో ముందుగానే భూముల కొనుగోలు పేరిట దక్కించుకున్నారు. ఇక లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారు. అందులో భాగంగా అమరావతిలో భూములు పొందారు. 2014 జులై 1న 7.21 ఎకరాలను కొనుగోలు చేస్తూ హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం 2014 జులై 7న ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయించారు. లింగమనేని రమేశ్ కుటుంబ సభ్యుల నుంచి 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట దక్కించుకున్నారు. ఆ విషయం బయటకు పొక్కడంతో ఆ 4.55 ఎకరాలకు సేల్ అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నారు. ఆపై అధికారులపై ఒత్తిడి తెచ్చి లింగమనేని, హెరిటేజ్ ఫుడ్స్ భూములకు దూరంగా వెళుతున్న ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను మార్పించారు. లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్ భూములను ఆనుకొని ఐఆర్‌ఆర్ వెళ్లేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు.
మెమోలో ఇలా..
చంద్రబాబు బినామీల పేరిట భారీగా కొల్లగొట్టిన భూములు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారాయణ కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కొల్లగొట్టిన 148 ఎకరాల విలువ అమాంతంగా పెరిగేలా కుట్రకు పాల్పడ్డారు. క్విడ్‌ప్రోకో కింద లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. ఈ వివరాలన్నింటినీ పేర్కొంటూ సిట్ అధికారులు సమగ్రంగా దర్యాప్తు నిర్వహించి పూర్తి ఆధారాలతో న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు.
ఏ-6గా హెరిటేజ్ ఎందుకంటే..
హెరిటేజ్ ఫుడ్స్ అంటే నారా చంద్రబాబు కుటుంబం.. చంద్రబాబు కుటుంబం అంటే హెరిటేజ్ ఫుడ్స్ అనేది బహిరంగ రహస్యం. అందుకే చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు అనేక ప్రయోజనాలు కలిగించారు. ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చడం ద్వారా హెరిటేజ్ ఫుడ్స్‌కు అడ్డగోలుగా కల్పించిన ప్రయోజనం పెద్ద కుంభకోణమే. అందుకే ఈ కేసులో హెరిటేజ్ ఫుడ్స్‌ను ఏ–6గా సీఐడీ పేర్కొంది. ఎందుకంటే..
ఈ కేసులో ఏ–1 చంద్రబాబు నాయుడి సతీమణి అయిన నారా భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్‌కు వైస్ చైర్‌పర్సన్, ఎండీగా ఉండగా, ఏ–14గా ఉన్న లోకేశ్ భార్య బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా ఉన్నారు. వారి ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ వ్యవహారాలను పూర్తిగా చంద్రబాబు, లోకేశే నిర్వహిస్తున్నారు. 56 శాతానికిపైగా షేర్లు ఉండటంతో ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డు అంతా ఆ కుటుంబం ఆధిపత్యంలోనే ఉంది. ఇందులో 23,66,400 షేర్లతో 10.20 శాతం వాటా లోకేశ్ పేరునే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment